Vijay | తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్న విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేతగా ఉన్న ఆయన, తన వ్యక్తిగత కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
దీర్ఘకాలంగా తనకు నమ్మకంగా సేవలు అందిస్తున్న రాజేంద్రన్‌పై కృతజ్ఞతగా, ఆయన కుమారుడు శబరీనాథన్‌కు టీవీకే తరఫున టికెట్ ప్రకటించారు. ఈ ప్రకటన జరిగిన వెంటనే వేదికపై రాజేంద్రన్, శబరీనాథన్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. విజయ్‌ను హత్తుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
సామాన్యులకే ప్రాధాన్యం..
విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా పార్టీ లోపల సామాన్య కార్యకర్తలు, యువతకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టమైన సందేశం వెళ్లిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయాన్ని అభిమానులు, పార్టీ శ్రేణులు హర్షాతిరేకంగా స్వాగతించగా, సోషల్ మీడియాలో కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా, రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం చెన్నైలో జరిగిన భారీ సభలో విజయ్ టీవీకే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మొత్తం 234 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు.
రెండు స్థానాలలో పోటీ..
ఈ ఎన్నికల్లో విజయ్ స్వయంగా పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. ఉత్తర, సెంట్రల్ తమిళనాడులో ప్రభావం చూపేలా ఈ స్థానాలను ఎంపిక చేసినట్లు సమాచారం.
సభలో మాట్లాడుతూ విజయ్, తమ పార్టీ అభ్యర్థులను “ప్రజా రక్షకులు”గా పేర్కొన్నారు. ప్రజలకు పూర్తి స్థాయిలో జవాబుదారీగా ఉంటామని హామీ ఇచ్చారు. టీవీకే అధికారంలోకి వస్తే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయమని, అవినీతిని అణిచివేస్తామని స్పష్టం చేశారు. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, రాష్ట్ర ప్రయోజనాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విఘాతం కలగనీయమని తెలిపారు.
ఆకర్షణీయ హామీలు..
అలాగే ఎన్నికల హామీల్లో భాగంగా స్కూల్, కాలేజీల్లో యాంటీ డ్రగ్ యూనిట్లు ఏర్పాటు, రూ.20 లక్షల వరకు విద్యా రుణ సదుపాయం, డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగులకు నెలకు రూ.4,000 భృతి వంటి పలు ఆకర్షణీయ హామీలు ప్రకటించారు.
ఇక ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ డీఎంకే మరియు టీవీకే మధ్యనే జరుగుతుందని విజయ్ మరోసారి స్పష్టం చేశారు. మొత్తం మీద, సామాన్యులకు అవకాశాలు కల్పిస్తూ, సంక్షేమ హామీలతో ముందుకు సాగుతున్న టీవీకే ఈసారి ఎన్నికల్లో ఎలా ప్రభావం చూపుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
#ThalapathyVijay has given an MLA seat to his personal car driver Rajendran’s son, Sabrinathan.
pic.twitter.com/4mQPkMUtrV— Movies Singapore (@MoviesSingapore) March 29, 2026
