VARANSI | వారణాసి లో కనిపించిన రహస్య దేవత ఎవరు? .. చేతిలో తెగిన త‌ల‌, మెడలో పుర్రెల దండ, నాగుపాము

VARANSI | సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కలయికలో రూపుదిద్దుకుంటున్న వారణాసి సినిమా పై అంచనాలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి.

  • By: sn |    movies |    Published on : Nov 19, 2025 9:03 AM IST
VARANSI | వారణాసి లో కనిపించిన రహస్య దేవత ఎవరు? .. చేతిలో తెగిన త‌ల‌, మెడలో పుర్రెల దండ, నాగుపాము

VARANSI | సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కలయికలో రూపుదిద్దుకుంటున్న వారణాసి సినిమా పై అంచనాలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ విజువల్‌లో కనిపించిన ఒక భయంకరమైన దేవత రూపం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చాలామంది ఆ విజువల్‌ను చూసి కాళీమాత అని భావిస్తున్నప్పటికీ అది నిజం కాదు… రాజమౌళి చూపించినది ‘చినమస్తాదేవి’ అనే అతి ప్రాచీన, తాంత్రిక శక్తి రూపం.

ఈ దేవత రూపం పురాతన శాస్త్రాలు, తంత్రాలు, బౌద్ధ తాంత్రిక గ్రంథాలలో విస్తృతంగా ప్రస్తావించబడింది. ఆమె రూపం ఎంత భయంకరంగా ఉంటుందో, రహస్యాలు కూడా ఆమెలో నిక్షిప్తమై ఉన్నాయనే చెప్పాలి. ఇంతకూ చినమస్తాదేవి ఎవరు? రాజమౌళి ఎందుకు ఆమెను విజువల్‌లో పెట్టారు? ఈ కథలో ఏముంది? ఇప్పుడు వివరంగా చూద్దాం.

చినమస్తాదేవి — తల తెగిన యోగినీ రూపం

‘చిన మస్త’ అనే పదానికి అర్థం “తలను తానే నరుక్కున్న స్త్రీ”. ఆమెను చినమస్త, చిన్నమస్తా, ప్రచండచండిక, జోగని మా వంటి పేర్లతో పలువురు గ్రంథాల్లో పేర్కొన్నారు. ఈ దేవత రూపం ప్రత్యేకత ఏంటంటే:

పూర్తిగా నగ్న రూపంలో ఉన్న స్త్రీ

తన తలను ఒక చేత్తో పట్టుకుని ఉంటుంది

మరో చేతిలో రక్తం కారుతున్న కత్తి

మెడలో పుర్రెల దండ, నాగుపాము

ఆమె శరీరం నుండి మూడు రక్తధారలు బయటకు రావడం

అందులో రెండు ధారలను డాకినీ — వామినీలు తాగడం

మూడో రక్తధారను తనే తెగిన శిరస్సుతో తాగడం

ఆమె కాళ్ల వద్ద యుగళం సృష్టి కార్యంలో నిమగ్నమై ఉండటం

ఈ రూపం తొలిచూపులోనే గగ్గుర్పాటు పుట్టించినా, దీనిలో జీవసారం, సృష్టి-సంహారం, బలి, త్యాగం, శక్తి, యోగం వంటి లోతైన అర్థాలు దాగి ఉన్నాయి. చినమస్తాదేవికి వైదిక, శైవ, తాంత్రిక సంప్రదాయాల్లో ప్రాధాన్యం ఉంటుంది. జీవాన్ని ఇచ్చే దేవతగా, జీవాన్ని తీసుకునే దేవతగా వర్ణిస్తుంటారు. కుండలినీ శక్తిని ఉత్తేజపరిచే తాంత్రిక దేవతగా, శృంగారం, త్యాగం, విధ్వంసం మూడు శక్తుల రూపంగా చెబుతుంటారు.

ఆమెను త్రికాయ యోగినీ అని పిలుస్తారు. బౌద్ధ తంత్ర గ్రంథాల్లో కనిపించే చిన్నముండిక రూపమే హిందూ పురాణాల్లోని చినమస్తాదేవి అని ప్రసిద్ధ పరిశోధకుడు బినయ్ తోష్ భట్టాచార్య నిర్ధారించారు. తాంత్రిక ఆరాధనల్లో ఉన్న పదిమంది రౌద్ర దేవతల్లో చినమస్తా ఒకరు. ఆమె ఆరాధన అత్యంత క్లిష్టం కాగా , లోతైన యోగిక శక్తులతో నిండి ఉంటుంది.

మందాకిని నది – చినమస్తాదేవి సంబంధం

19వ శతాబ్దపు ప్రాణతోషిణీ తంత్ర ప్రకారం పార్వతి దేవి చినమస్తా అవతారంలో మందాకినిలో స్నానం చేస్తూ ఉండగా ఆమె చెలికత్తెలు డాకినీ, వామినీలు ఆకలితో బాధపడతాయి. వారికోసం దేవి తన తలను తానే నరికి మూడు రక్తధారలను సృష్టిస్తుంది. రెండింటిని చెలికత్తెలకు ఆహారంగా ఇస్తుంది. నేలపై పడితే సృష్టిని నాశనం చేసే ప్రమాదం ఉండడంతో మూడో రక్తధారను తానే తాగుతుంది

మరొక పురాణంగా, క్షీరసాగర మథనం సమయంలో రాక్షసులకు అమృతం దక్కకుండా ఉండేందుకు చినమస్తాదేవి రాక్షస రూపంలో అమృతం తాగి, గొంతులోకి దిగేలోపు తలను నరుక్కుందని కూడా పురాణాలు చెబుతాయి.

అస‌లు గ్లింప్స్ లో రాజమౌళి ఎందుకు ఈ దేవతను చూపించారు?

టైటిల్ విజువల్‌లో గుహలో అద్భుతమైన చినమస్తాదేవి విగ్రహం, పై నుంచి పడుతున్న అమ్మాయి (ప్రియాంక చోప్రా లాంటి రూపం), ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తున్న మహేశ్ బాబు లాంటి హీరో ఇదంతా చూస్తే.. పురాణాలు, తాంత్రిక శక్తులు, జీవశక్తి — అమృత తత్త్వం, సంహారం – సృష్టి, యోధుడి ప్రయాణం, శక్తి మర్మాలు వంటి అంశాలతో కథ ముందుకు వెళ్లే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

మొత్తం మీద చినమస్తాదేవి రూపం ఎంచుకోవడం చూస్తుంటే రాజమౌళి ఒక సాధారణ యాక్షన్–అడ్వెంచర్ కాదు, గొప్ప పురాణ–తాంత్రిక చరిత్ర ఆధారంగా ఒక భారీ స్కేల్ సినిమా రూపొందిస్తున్నారని స్పష్టమవుతోంది. వారణాసి కథలో అమృతం, బలి, తాంత్రిక శక్తులు, గుహ రహస్యాలు, పురాతన దేవతల పాత్ర ఎంతగా మిళితమై ఉంటాయో చూడాలి.