Om Bam Bhole: భక్తులను అలరిస్తున్న ‘ఓం భం భోలే’

మహాశివరాత్రి సందర్భంగా అకీ క్రియేటివ్ వర్క్స్ రూపొందించిన ‘ఓం భం భోలే’ భక్తిరస మ్యూజిక్ ఆల్బమ్ విడుదలైంది.

Reported by: raj | వినోదం | Feb 17, 2026, 6:50 am IST
Read Time: 3 mins
Om Bam Bhole: భక్తులను అలరిస్తున్న ‘ఓం భం భోలే’

మహాశివరాత్రి పర్వదినం దగ్గరపడితే భక్తిరస గీతాలకు ప్రత్యేకమైన ఆదరణ కనిపించడం సహజం. ఆధ్యాత్మికతను ఆలపించే ప్రతి స్వరానికి శివభక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. గతంలో ప్రేమ గీతాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అకీ క్రియేటివ్ వర్క్స్ ఈసారి భక్తి పరవశాన్ని నింపే కొత్త సంగీత కానుకతో ముందుకొచ్చింది.

అకీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందిన ‘ఓం భం భోలే’ మ్యూజిక్ ఆల్బమ్ మహాదేవుని మహిమను ఆవిష్కరిస్తూ శ్రోతలను భక్తి భావంలో ముంచెత్తుతోంది. శివతత్వాన్ని సులభమైన పదాలతో, హృద్యమైన స్వరాలతో ఆవిష్కరించిన ఈ గీతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ ప్రత్యేక గీతం ఇప్పటికే అనేకమంది భక్తుల ప్లేలిస్ట్‌లో స్థానం సంపాదించుకుంది.

ఈ ఆల్బమ్‌లో నాగేంద్ర ఇనమడుగు, అనిల్ ఇనమడుగు, అజయ్ ఇనమడుగు, అజయ్ సన్నపు, అజాస్ జాన్ శివభక్తుల పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. వారి వేషధారణ, భావప్రకటన భక్తి పరవశాన్ని స్పష్టంగా వ్యక్తపరుస్తాయి. ప్రత్యేకంగా అనిల్ ఇనమడుగు ఈ ప్రాజెక్ట్‌కు బహుముఖ పాత్ర పోషించారు. నటుడిగా మెప్పించడమే కాకుండా సాహిత్య రచయితగా, దర్శకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన రాసిన పదాలు శివుని వైభవాన్ని అందంగా వర్ణిస్తాయి.

మార్క్ ప్రశాంత్ అందించిన సంగీతం ఈ గీతానికి ప్రాణం పోసింది. ఆయన స్వరంలో వినిపించిన భక్తి గాఢత గీతాన్ని మరింత ప్రభావవంతంగా నిలబెట్టింది. చరణ్ పన్నాల కెమెరా పనితనం ప్రతి ఫ్రేమ్‌ను ఆధ్యాత్మిక దృశ్యంగా మలిచింది. నిర్మాతగా నాగేంద్ర ఇనమడుగు సమగ్ర పర్యవేక్షణతో ఈ ప్రాజెక్ట్‌ను భక్తులకు అంకితం చేశారు. మొత్తానికి ‘ఓం భం భోలే’ మహాశివరాత్రి వేళ శివభక్తులకు సంగీత రూపంలో అందిన ఓ పవిత్ర కానుకగా నిలిచింది.