ఇరుముడి’సినిమా.. థియేటర్‌లలో అభిమానుల హారతులు

రవితేజ ‘ఇరుముడి’ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. అయ్యప్ప మాల సన్నివేశాలు, మల్లెపూల పల్లకి పాటకు అభిమానులు థియేటర్లలో హారతులు ఇస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి.

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్‌ టాక్‌ తో ముందుకెల్తుంది. హీరో అయ్యప్ప మాలధారణలో ఉన్న సన్నివేశాలు వచ్చినప్పుడు.. మల్లెపూల పల్లకి పాట వచ్చిన సమయంలో స్క్రీన్‌లకు హారతులు ఇస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు స్క్రీన్ వద్దకు వెళ్లి డ్యాన్స్‌లు చేస్తోన్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ సినిమా విజయంతో చాల రోజుల తర్వాతా రవితేజ ఖాతాలో ఓ మంచి హిట్‌ పడినట్లయ్యింది.

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ తండ్రీకూతుళ్ల బంధం చుట్టూ కొనసాగుతూ..నేర నేపథ్యం, బలమైన సామాజికాంశాల మేళవింపుతో రూపుదిద్దుకుంది. అయ్యప్ప మాల, భక్తి నేపథ్యం సినిమాని మరింత ఆసక్తిగా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తుంది.

అనూహ్య‌మైన మ‌లుపుల‌తో థ్రిల్లింగ్‌గా సాగే ద్వితీయార్ధం, పతాక స‌న్నివేశాల్లో పండిన గాఢ‌మైన భావోద్వేగాల సన్నివేశాలు ఆధ్యంతరం ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఆడ పిల్లల పెంప‌కం, వాళ్ల ప‌రిర‌క్ష‌ణలో కుటుంబం, స‌మాజం బాధ్య‌త‌ని తెలియ‌జెప్పేదిగా సినిమా సందేశాత్మకంగాను నిలిచింది. ప్రీ క్లైమాక్స్‌, ఆ త‌ర్వాత వ‌చ్చే క్లైమాక్స్‌ స‌న్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయ్య‌ప్ప మాల నేప‌థ్యంలో సాగే మూడు పాట‌లూ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

త్రినాథ్ పాత్రలో రవితేజ, భార్య కావేరి పాత్ర‌లో ప్రియ భ‌వానీ శంక‌ర్, కూతురు మ‌ణికంఠ పాత్రని పోషించిన బేబి న‌క్ష‌త్ర ఎవరికి వారు తమ నటనతో పాత్రల్లో జీవించేశారు. రవితేజ‌కీ, చిన్నారి న‌క్ష‌త్ర‌కీ మ‌ధ్య స‌న్నివేశాలే సినిమాకి బ‌లం. సాయికుమార్, శ్వాసిక, అజ‌య్ ఘోష్, ఎమ్మెల్యే పాత్రలో నటించిన రమేశ్‌ ఇందిర పాత్ర‌లు క‌థ‌లో కీల‌కం. ఆ పాత్ర‌ల్ని డిజైన్ చేసిన తీరు, అందులో వాళ్ల న‌ట‌న చాలా బాగుందన్న ప్రశంసలు ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ-సిరీస్ సమర్పణలో సినిమా తెరకెక్కింది. శివ్ చనానా సహ నిర్మాతగా వ్యవహరించారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైన్‌ చేశారు. యాక్షన్ సన్నివేశాలను రామ్ లక్ష్మణ్, రియల్ సతీష్ రూపొందించారు.

ఏపీలోని సీలేరు ప్రాంతంలోని ఓ చిన్న గ్రామం చుట్టూ సాగే కథలో హీరో త్రినాథ్ ఊర్లో ఏ ఆడపిల్లని ఇబ్బంది పెట్టిన.. ఊరుకోడు. దానివల్ల త్రినాథ్‌కు చాలా మంది శత్రువులు ఏర్పడతారు. మరోవైపు ఊర్లో ఐదో తరగతి వరకు మాత్రమే ఉండడంతో హైస్కూల్ కోసం కూతురిని సీలేరుకు పంపిస్తాడు. ఆ స్కూల్‌ టీచర్‌(స్వసికా) స్టూడెంట్స్‌ని చాలా ఇబ్బందికి గురి చేస్తుంటుంది. అదే సమయంలో ఆ స్కూల్‌లో చదువుకునే అమ్మాయిలు ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు. దానికి సంబంధించిన కొన్ని నిజాలు కూతురు మణికంఠకు తెలుస్తాయి. ఆవేంటి? ప్రతి విషయాన్ని తండ్రితో చెప్పే మణికంఠ.. ఆ విషయాలను కూడా తండ్రికి చెప్పిందా? ఆ విషయం తెలిసిన తర్వాత త్రినాథ్‌ ఏం చేశాడు? గురుస్వామి గోపరాజు (సాయికుమార్)తో త్రినాథ్ అనుబంధం ఎలా ఉంది? త్రినాథ్‌ మాలలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఏంటి? తన కూతురుకు జరిగిన అన్యాయానికి త్రినాథ్‌ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Latest News