ధురంధర్: ది రివెంజ్ — ప్రతీకారం కాదు.. ఒక జాతి గాయాల నుండి వెలువడ్డ వేదన

కశ్మీర్ గాయాలు, దేశభక్తి, ప్రతీకారం మేళవించిన ధురంధర్: ది రివెంజ్ సినిమా లోతైన భావోద్వేగంతో పాటు హింసాత్మక ఫ్యాంటసీని చూపిస్తుంది. ప్రతీ భారతీయుడు నిజమవ్వాలని కోరుకునే కలగా మన ముందుకు వచ్చింది.

  • By: ADHARVA |    reviews |    Published on : Mar 21, 2026 10:46 PM IST
ధురంధర్: ది రివెంజ్ — ప్రతీకారం కాదు.. ఒక జాతి గాయాల నుండి వెలువడ్డ వేదన ప్రతి భారతీయుడు మనసులో ఊహించే ఆ కోపం… సినిమాగా మారితే ఎలా ఉంటుందో చూపించిన కథ. ధురంధర్ — ఇది కేవలం సినిమా కాదు… ఒక భావన

Dhurandhar The Revenge Exclusive Review: A Violent Tale of Vengeance Rooted in Kashmir’s Pain

ధురంధర్: ది రివెంజ్ ప్రతీకారం కాదు… ఒక గాయం

కాశ్మీర్ గాయాలు, దేశభక్తి భావోద్వేగం, ప్రతీకారం మేళవించిన ఈ సినిమా ఒక యాక్షన్ కథగా మొదలై, మనసును తాకే అనుభూతిగా మారుతుంది. న్యాయం లభించనప్పుడు ఒక మనిషి ఎలా మారుతాడో చూపిస్తూ, ఒక బలమైన దేశం ఎలా ఉండాలనే కలను తెరపై ఆవిష్కరించింది. హింస ఎక్కువగా ఉన్నప్పటికీ, భావోద్వేగం సినిమాను నిలబెడుతుంది.

 

  • బాధ, అవమానాల మధ్య.. గాయాలతో వచ్చి, ఆయుధంగా మారిన మనిషి కథ

(విధాత ప్రత్యేక సమీక్ష)

హైదరాబాద్​:

యాక్షన్ సినిమాల గోల మధ్యలో చాలా కథలు వస్తుంటాయి. కానీ కొన్ని కథలు మనసులో మానని గాయంలా మిగిలిపోతాయి. ‘ధురంధర్: ది రివెంజ్’ అలాంటి చిత్రమే. దర్శకుడు ఆదిత్య ధర్​ ఈ సినిమాతో ఒక వ్యక్తి కథ చెప్పలేదు; ఒక సమాజం అనుభవించిన బాధను మనం అనుభవించేలా చేసాడు. సింగ్ రంగి అనే యువకుడు — ఒక మామూలు కుటుంబం, సాధారణ కలలు, సైన్యంలో చేరాలనే ఆశ. కానీ ఒక భూవివాదం రూపంలో వచ్చిన దురదృష్టం అతడి జీవితాన్ని చీల్చి ముక్కలు చేస్తుంది. కుటుంబంపై జరిగిన అమానుష ఘటనలు, అక్కాచెల్లెళ్లపై దాడులు, తండ్రి మీద జరిగిన దౌర్జన్యం — ఇవి కేవలం కథ కోసం రాసిన సన్నివేశాలు కాదు; అవి మనం వినడానికి కూడా భయపడే వాస్తవాల ప్రతిధ్వనిలా వినిపిస్తాయి.

న్యాయం కోసం కోర్టు నుంచి కోర్టుకు తిరిగే ఆ కుటుంబం — ఆ నిస్సహాయత, ఆ విసుగు, ఆ ఆవేదన… చివరికి ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది: ఈ వ్యవస్థ నిజంగా మనకోసమేనా?.. ఈ ప్రశ్నకు సమాధానం రాకపోయేసరికి, జస్కీరత్ మనసు బండబారిపోతుంది. అక్కడ పుడుతుంది ప్రతీకారం. అదే అతడిని హమ్జా అలీ మజారిగా మార్చేస్తుంది. మనిషి ఆయుధంగా మారే ఈ ప్రయాణం, మనసును కుదిపేస్తుంది. ఇది కేవలం వ్యక్తిగత ప్రతీకారం కాదు — ఇది కశ్మీరీ పండితులు కోల్పోయిన నేల, బయలెళ్లిన వలస, మనసులు పడిన గోస, తిరిగి చేరలేని నేల చెప్పే కథ.

దేశభక్తి, యుద్ధం, ప్రతీకారం — ఇది ఒక కల… మనం నమ్మాలనుకునే కల

Dhurandhar The Revenge Ranveer Singh intense long hair look representing transformation and revenge journey

ఒక మనిషి బాధ ఎంత లోతుగా ఉంటే… అతడు అంత ప్రమాదకరమైన ఆయుధంగా మారుతాడు. ఇది ప్రతీకారం కాదు, ఒక నిశ్శబ్ద ఆక్రందన

సినిమా ముందుకు సాగే కొద్దీ ఒక విషయం అర్థమవుతుంది — ఇది కేవలం కథ కాదు, ఒక భావన. భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న అంతులేని ఉద్రిక్తతలు, ఉగ్రవాద దాడులు, వాటి వెనుక ఉన్న మానసిక సంఘర్షణ — ఇవన్నీ సినిమాలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడ అజయ్ సన్యాల్ పాత్ర, అజిత్​ దోభాల్​ ప్రేరణతో రూపొందించబడి, కథకు దిశానిర్దేశం చేస్తుంది. “నజర్, సబ్ర్” అనే సిద్ధాంతం — ఓపిక, జాగ్రత్త — ఇవి మాటల్లో వినిపించినా, సినిమాలో కనిపించేది మాత్రం ప్రతీకారం.

దేశంపై జరిగిన ప్రతీ దాడికి సమాధానంగా కథానాయకుడొక్కడే ముందుకు వెళ్లి శత్రువులను అంతమొందించడం — ఇది నిజానికి నిజం కాదు, కానీ మనం చూడాలనుకునే నిజం. ఒక బలమైన దేశం, వెంటనే ప్రతిస్పందించే ప్రభుత్వం, ఎక్కడికైనా వెళ్లి శత్రువులను నాశనం చేసే శక్తి — ఇవన్నీ మన మనసులో ఉన్న కోరికలు.మనలో స్వతహాగా ఉండే ఫాంటసీ. దర్శకుడు ఆ ఆశనే కథగా మలిచాడు. అందుకే ఈ సినిమా ఒక నిశిరాత్రి. నిద్రపట్టనీయని ఆలోచన. మెలకువ రానీయని స్వప్నం.

మొదటి భాగం గుర్తుండే ఉంటుంది కదా.… అవసరం కూడా.

‘ధురంధర్’ మొదటి భాగం పూర్తిగా ఒక అండర్‌కవర్ మిషన్ చుట్టూ తిరిగింది. అక్కడ మనం చూసింది జస్కీరత్ కాదు —హమ్జా అలీ మజారి. పాకిస్తాన్‌లోని కరాచీ ల్యారీ ప్రాంతపు గ్యాంగ్‌లో చొరబడి, ఉగ్రవాద నెట్‌వర్క్‌ను లోపల నుంచే ధ్వంసం చేసే ఒక దశాబ్దపు కార్యక్రమం అతడిది. ప్రతి అడుగులోనూ ప్రాణపాయం, ప్రతి సంభాషణలోనూ మోసం — ఆ ప్రపంచంలో హమ్జా ఒక నీడలా కదిలే పాత్రగా కనిపించాడు.

ఆ సమయంలో ప్రేక్షకుడికి మిగిలని ఒక ప్రశ్న.. “ఈ మనిషి ఎవరు? ఇంత క్రూరంగా, ఇంత ఖచ్చితత్వంతో పనిచేసే వ్యక్తి ఎలా తయారయ్యాడు?” ఆ ప్రశ్నకు సమాధానమే ఈ ‘ధురంధర్: ది రివెంజ్’. మొదటి భాగంలో మనం చూసినది ఫలితం అయితే, ఈ భాగంలో చూపించేది కారణం. హమ్జా అనే ఆయుధంగా మారిన జస్కీరత్ అనే గాయం — ఎవరు? అతడిని ఈ మార్గంలో నడిపించింది ఏంటి? అనే విషయాలను ఈ సినిమా లోతుగా ఆవిష్కరిస్తుంది.

అందుకే, ఈ భాగం ప్రీక్వెలో, సీక్వెలో కాదు… ఇది ఒక భావోద్వేగ సమాహారం. మొదటి భాగంలో కనిపించిన ‘చల్లటి’ చావుల వెనుక ఉన్న భగభగలాడే బాధను, కోల్పోయిన జీవితాన్ని ఈ చిత్రం మన ముందుకు తెస్తుంది.

హింసే బలం – బలహీనత :  నటనలో జీవం – సాంకేతికం అద్భుతం

Dhurandhar The Revenge action scene with hero holding gun and sparks in background

న్యాయం దొరకనప్పుడు… చట్టం మౌనంగా ఉన్నప్పుడు… ఒక మనిషి చేతిలో తుపాకీ పడితే — అది ప్రతీకారం కాదు, యుద్ధానికి ఆరంభం

సినిమా మొత్తం మీద హింస ఒక ప్రధాన భాగంగా ఉంటుంది. ప్రతి సన్నివేశంలో రక్తం, కోపం, ప్రతీకారం కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో అవి అతిగా అనిపించి ప్రేక్షకుడిని అలసటకు గురిచేస్తాయి — ఇదే సినిమా ప్రధాన బలహీనత. విచిత్రంగా అదే బలం కూడా.. ఆ హింస వెనుక ఉన్న భావోద్వేగం, మనిషి లోపలి గాయం, కోల్పోయిన జీవితం — ఇవన్నీ కథకు ప్రాణం పోస్తాయి.

నటనాపరంగా చూస్తే, మాధవన్​ అజయ్ సన్యాల్ పాత్రలో హుందాగా ఒదిగిపోయాడు. అజిత్​ దోభాల్​ స్ఫూర్తితో రూపొందించిన ఈ పాత్ర గంభీరతను కూడా ప్రశాంతంగా ప్రదర్శిస్తుంది. మాధవన్​ అందులోనే తన శక్తికి చూపించాడు. మాటల కంటే చూపులతోనే ఆలోచనలు చెప్పే విధానం అతడి నటనలో కనిపిస్తుంది.  అర్జున్​ రాంపాల్​ ప్రతినాయకుడి పాత్రలో భయానకంగా కనిపించాడు. అతడి పాత్రలో ఉన్న క్రూరత్వం కథను మరింత తీవ్రంగా మార్చింది.

R Madhavan as Ajay Sanyal in Dhurandhar The Revenge portraying national security strategist inspired character

యుద్ధాలు ఆయుధాలతో గెలవరు… ఆలోచనలతో గెలుస్తారు. హమ్జా ఆయుధం అయితే అజయ్ సన్యాల్ ఆలోచన

ఇక హమ్జా పాత్రలో రణవీర్​సింగ్​ — బాధ, కోపం, ప్రేమ అనే మూడు భావాలను సమతుల్యం చేస్తూ కథను తన భుజస్కంధాలపై మోసాడు.  సంఘర్షణ, ఆవేదన, ఆవేశం అతని ప్రతీ సన్నివేశంలో ప్రస్ఫుటంగా కనిపించింది. నాయిక పాత్ర చిన్నదైనా, కథలో ఒక మానవీయ కోణాన్ని జోడిస్తుంది.

సాంకేతికంగా దర్శకుడు ఆదిత్య ధర్​  వాణిజ్య చట్రంలోనే ఒక భావోద్వేగ కథను చెప్పడంలో విజయవంతమయ్యాడు. అతని ఆలోచనాధోరణి, నిబద్ధత, నిజాయితీ , కష్టం ప్రతీ ఫ్రేమ్​లో ప్రతిఫలించాయి.

సినిమాటోగ్రఫీ యాక్షన్ సన్నివేశాలను విస్తృతంగా చూపించింది. నేపథ్య సంగీతం — పాత పాటల మేళవింపు — కథకు ఒక ప్రత్యేక థీమ్​ను ఇచ్చింది. అయితే ఎడిటింగ్ మరింత కట్టుదిట్టంగా ఉంటే సినిమా ప్రభావం ఇంకా పెరిగేది. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా అనిపిస్తాయి.

వాస్తవాలే వేదనలై.. దృశ్యంగా మారిన వేళ..

Aditya Dhar director of Dhurandhar The Revenge in formal suit at event showcasing filmmaker behind patriotic action drama

ధురంధర్‌తో దర్శకుడు ఆదిత్య ధర్ చూపించింది యాక్షన్ కాదు – గాయం, సినిమా కాదు – వేదన

ఇలాంటి కథవస్తువును ఎంచుకోవడమే ఒక ఎత్తయితే, దాన్ని సినిమాగా మలచడం, అదీ వ్యాపారపరంగా కొద్దోగొప్పో లాభం సంపాదించాలని ఆశించి తీయడం మరో ఎత్తు. ఎన్ని రోజుల కథ ఏడు గంటల సినిమాగా మారిందో మనకు తెలయకపోవచ్చు. ఇక్కడ మొదటి ఎత్తు కంటే రెండో ఎత్తే కఠినమైనది. అయితే రెండు ఎత్తులూ కలిసి సంచలనం సృష్టించాయి.  మొదటి భాగం విడుదలైనప్పుడు ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. భారీ తారాగణం ఉన్నప్పటికీ మొదటి రెండు రోజులు అదేదీ సినిమాను లాగలేదు. కథ, కథనాలే ఆయువుపట్టుగా నిలిచి భారీ విజయాన్ని నమోదు చేసాయి. దర్శకుడికి ఉన్న స్పష్టత, అవగాహన, ఏకాగ్రతలే ఈ విజయానికి కారణం. బాలీవుడ్​కు కొత్త దశ, దిశ చూపించిన చిత్రంగా ధురంధర్​ చరిత్రలో నిలిచిపోతుంది.

ఇది ముగిసిన కథ కాదు… మనలో మిగిలే ప్రశ్న

Dhurandhar The Revenge hero Hamza intense action scene holding rocket launcher symbolizing revenge and war

బాధ మానకపోతే అది కోపంగా మారుతుంది…కోపం మితిమీరితే, అది యుద్ధంగా మారుతుంది.

‘ధురంధర్: ది రివెంజ్’ ఒక యాక్షన్ సినిమా కాదు. ఇది ఒక ప్రశ్న. న్యాయం లభించనప్పుడు మనిషి ఏమవుతాడు? బాధ ఎంతవరకు ప్రతీకారంగా మారుతుంది? ఒక దేశం తన గాయాలను ఎంతవరకు భరిస్తుంది? అన్న ప్రశ్నలకు  ఈ సినిమా సమాధానాలు ఇవ్వదు. కానీ మనల్ని ఆలోచింపజేస్తుంది. మనసులో ఒక భారాన్ని మిగుల్చుతుంది. బహుశా అది దిగకపోవచ్చు.

👉 విధాత రేటింగ్: 3/5