Covid-19 | ప్రధాని మోదీని కలవాలంటే.. మంత్రులు ముందుగా ఆ టెస్ట్ చేయించుకోవాల్సిందే!

Covid-19 | దేశంలో రోజు రోజుకూ కొవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం నాటి వివరాల ప్రకారం.. యాక్టివ్ కొవిడ్ కేసులు 7వేలకు చేరుకున్నాయి. వైరస్ వేగంగానే విస్తరిస్తున్నదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 306 కొత్త కేసులు, 6 మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంటున్నది. ఈ మరణాల్లో మూడు కేరళలోనే సంభవించాయి. మహారాష్ట్రలో ఒకరు, కర్ణాటకలో ఇద్దరు చనిపోయారు. కేరళలో 170 తాజా కేసులతో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 2,223కు పెరిగింది. తర్వాతి స్థానంలో 114 కొత్త కేసులు సహా 1223 కేసులతో గుజరాత్ ఉన్నది. కర్ణాటకలో కొత్తగా 100 కేసులో గడిచిన 24 గంటల్లో నమోదు కాగా.. మొత్తం కేసులు 459కి పెరిగాయి. ఢిల్లీలో కూడా వైరస్ వేగంగానే వ్యాపిస్తున్నది. ఇక్కడ 66 కొత్త కేసులు సహా మొత్తం 757 కేసులు ఉన్నాయి. మొత్తం మీద ఈ దఫా కొవిడ్ తీవ్ర స్థాయిలోనే వ్యాపిస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే.. గతంతో పోల్చితే తీవ్ర అంతగా ఉండదని నిపుణులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇకపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవాలనుకునే మంత్రులకు, ఇతరులకు ఆర్టీ పీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేసినట్టు కొన్ని వర్గాలను ఉటంకిస్తూ ఇండియా టుడే పేర్కొన్నది. అయితే.. ఈ పరీక్ష ఎందుకు తప్పనిసరి చేశారన్న విషయంలో అధికారికంగా ప్రకటన ఏదీ రాలేదు. రాజధాని ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకుని ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.