కిడ్నీలపై క్రియాటిన్ ఎఫెక్ట్..! వారికే ఎక్కువ ప్రమాదం..?
క్రియాటిన్.. ఇప్పుడు విరివిగా వినిపిస్తున్న పదం. రక్త, మూత్ర పరీక్షలతో పాటు క్రియాటిన్ పరీక్ష కూడా చేయించుకోవాలని సూచిస్తున్నారు

క్రియాటిన్.. ఇప్పుడు విరివిగా వినిపిస్తున్న పదం. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యుడి వద్దకు వెళ్తే.. రక్త, మూత్ర పరీక్షలతో పాటు క్రియాటిన్ పరీక్ష కూడా చేయించుకోవాలని సూచిస్తున్నారు. అసలు ఈ క్రియాటిన్ అంటే ఏంటి..? దీని వల్ల మూత్రపిండాలకు ఎలాంటి ప్రమాదం ఉంటుందో తెలుసుకుందాం..
మానవుని మూత్రపిండాలు ఎలా పని చేస్తున్నాయని తెలుసుకునేందుకు క్రియాటిన్ పరీక్ష చేస్తారు. శరీరంలో క్రియాటిన్ లెవల్స్ పెరిగినట్లయితే మూత్రపిండాలు దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తిస్తారు. క్రియాటిన్ అనేది శరీరంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థం. సాధారణంగా శరీరంలోని మలినాలు మూత్రవిసర్జన, మలం ద్వారా బయటకు వెళ్తాయి.
అలా కాకుండా ఆ మలినాలు రక్తంలో నిల్వ ఉంటే.. వాటిని క్రియాటిన్‌గా భావిస్తారు. అయితే ప్రోటీన్ ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకునే వారి రక్తంలో క్రియాటిన్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కిడ్నీ రోగులు అలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
మరి క్రియాటిన్‌ను నివారించడం ఎలా..?
మన శరీరంలో క్రియాటిన్‌ను తగ్గించే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు అధిక ప్రోటీన్ ఉండే ఆహారాన్ని తగ్గించాలి. ఒక వేళ ప్రోటీన్ తీసుకోవడం అవసరం అనుకుంటే చేపలు, కోడిగుడ్డులోని వైట్ తీసుకోవాలి. మటన్, చికెన్‌కు దూరంగా ఉండాలి. డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. పాల ఉత్పత్తులు కూడా మంచివే. అయితే శరీర బరువును బట్టి ప్రోటీన్ ఆహారం తీసుకుంటే ప్రమాదం లేదని వైద్యులు సూచిస్తున్నారు.
మరి ముఖ్యంగా ప్రోటీన్ సప్లిమెంట్స్‌కు దూరంగా ఉండాలి. ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల శరీరంలో అనవసరంగా క్రియాటిన్ నిల్వలు పెరిగే అవకాశం ఉంది. ఇక నీళ్లను కూడా ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లను ఎక్కువగా తాగడంతో కిడ్నీలు సక్రమంగా పని చేసి, మలినాలు, వ్యర్థాలు బయటకు వెళ్లేందుకు వీలుంటుంది. ఉప్పు వినియోగం కూడా తగ్గించాలి. ఉప్పును ఎక్కువగా తినడం ద్వారా కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే ఉప్పు అధికంగా ఉండే పచ్చళ్లు, జంక్ ఫుడ్స్, బేకరి ఐటెమ్స్‌కు దూరంగా ఉంటే మంచిది.
ముఖ్యంగా పీచు పదార్థాలు ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా రక్తంలో క్రియాటిన్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. కూరగాయలు, ఆకుకూరలు తినడంతో ఆరోగ్యంగా ఉండడమే కాకుండా, కిడ్నీలకు కూడా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అధిక ప్రోటీన్ ఉండే పదార్థాలకు దూరంగా ఉంటే క్రియాటిన్‌కు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు.