Diabetes | భారత్‌లో 10 కోట్ల మందికి డయాబెటిస్: ICMR
Diabetes వేగంగా పెరుగుతున్న కేసులు వెల్లడించిన అధ్యయనం విధాత: డయాబెటిక్ (Diabetes) (మధుమేహం) భారత్‌లో ఒక పెద్ద సమస్యగా పరిణమిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు వృద్ధులు, మధ్యవయస్కులే దీని బారిన పడగా.. ఇప్పుడు బాలల్లోనూ డయాబెటిస్ కనిపిస్తోంది. ఒకప్పుడు నగరాల్లో ఉన్న వర్గాల వారికే ఈ జబ్బు వస్తుందని వాదన ఉన్నప్పటికీ డయాబెటిస్ గ్రామ, నగర సరిహద్దులను చెరిపేసిందని ఒక పరిశోధన పేర్కొంది. అలాగే ప్రస్తుతం దేశంలో సుమారు 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ద […]

Diabetes
- వేగంగా పెరుగుతున్న కేసులు
- వెల్లడించిన అధ్యయనం
విధాత: డయాబెటిక్ (Diabetes) (మధుమేహం) భారత్‌లో ఒక పెద్ద సమస్యగా పరిణమిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు వృద్ధులు, మధ్యవయస్కులే దీని బారిన పడగా.. ఇప్పుడు బాలల్లోనూ డయాబెటిస్ కనిపిస్తోంది. ఒకప్పుడు నగరాల్లో ఉన్న వర్గాల వారికే ఈ జబ్బు వస్తుందని వాదన ఉన్నప్పటికీ డయాబెటిస్ గ్రామ, నగర సరిహద్దులను చెరిపేసిందని ఒక పరిశోధన పేర్కొంది.
అలాగే ప్రస్తుతం దేశంలో సుమారు 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ద లాన్సెట్ డయాబెటిస్, ఎండోక్రైనాలజీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. మద్రాస్ డయాబెటిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎండీఆర్ ఎఫ్) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని చేపట్టాయి.
అధ్యయనం ఎలా జరిగింది
దేశవ్యాప్తంగా ఉన్న సుమారు లక్ష మంది దగ్గర పలు వివరాలను అధ్యయనకర్తలు సేకరించారు. రక్తపోటు, షుగర్ స్థాయిలు, ఒబెసిటీ, కొవ్వు స్థాయి మొదలైనవి ఇందులో ప్రధానం. ఒక్కో దశలో 5 రాష్ట్రాలు చొప్పున 2008 నుంచి 2020 వరకు ఐదు దశల్లో ఈ అధ్యయనం జరిగింది. ఒక్కో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి 2800 మందిని, పట్టణ ప్రాంతాల నుంచి 1200 మందిని ఈ రీసెర్చ్ కోసం ప్రశ్నించారు.
డయాబెటిక్‌కు సంబంధించి ఇది ప్రపంచంలోనే జరిగిన అతిపెద్ద సర్వే అని ఎండీఆర్ ఎఫ్ చీఫ్ వి.మోహన్ పేర్కొన్నారు. ‘ఏ దేశం కూడా ఇంత పెద్ద సర్వే నిర్వహించలేదు. అతి ఎక్కువ జనాభా ఉన్న చైనా సైతం కేవలం 40 వేల మందినే శాంపిల్‌గా తీసుకుంది. మేము ఈ సర్వేలో 1,13,000 మంది ఇంటికి వెళ్లి డోర్ టు డోర్ సర్వే నిర్వహించాం’ అని వెల్లడించారు.
ఏం కనుగొన్నారు..
దేశంలో డయాబెటిక్‌తో బారినపడుతున్న వారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. 2019లో సుమారు 7 కోట్ల మంది మధుమేహులు ఉండగా.. మూడేళ్లలోనే ఆ సంఖ్య 10 కోట్లను దాటడం ప్రమాదకరమని పేర్కొంది. రాష్ట్రాల వారీగా చూస్తే జనాభాలో 26.4 శాతం మంది డయాబెటిక్ బారిన పడి గోవా ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో పుదుచ్చేరి (26.3 శాతం), కేరళ (25.5శాతం) ఉన్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్ జనాభాలో కేవలం 4.8 శాతం మంది డయాబెటిక్‌తో బాధపడుతున్నారని.. ఆ మేరకు ఇది తక్కువ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందనుకున్నప్పటికీ.. భవిష్యత్తులో ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, అరుణాచల్ ప్రదేశ్ లలో కేసుల విస్ఫోటనం జరిగే ప్రమాదముందని అధ్యయనం హెచ్చరించింది. ప్రత్యేకంగా ఏ రాష్ట్రమూ సురక్షితంగా లేదని.. కేసులు తక్కువున్న రాష్ట్రంలో పెరుగుదల రాకెట్ వేగంతో ఉందని అధ్యయన కర్త డా.అంజన పేర్కొన్నారు.
అలాగే మొత్తం కేసుల్లో పట్టణ ప్రాంత ప్రజల్లో 16.4 శాతం మంది, పల్లె ప్రజల్లో 8.9 మంది మధుమేహం బారినపడ్డారని సర్వే తెలిపింది. శారీరక శ్రమ పట్టణ ప్రాంత ప్రజల్లో తక్కువగా ఉండటమే దీనికి కారణం. అయితే దీనిని ధనవంతులకు వచ్చే రోగంగానే చూడటం ఎంత మాత్రమూ మంచిది కాదని రాహుల్ బాక్సీ అనే వైద్యుడు స్పష్టం చేశారు.
ఏమిటీ కారణం
జీవనశైలి మారడం, మెరుగైన వసతులు లభించి శారీరక శ్రమ తగ్గిపోవడం, పట్టణాలకు వలసలు, సమతుల్యత లేని పని వేళలు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కాలుష్యం, జంక్ ఫుడ్.. ఇలా పలు కారణాలు భారత్‌లో డయాబెటిస్ విస్తరణకు కారణమని వైద్యులు తెలిపారు.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా షుగర్ పరీక్షలు చేయించుకోవాలని, ప్రీడయాబెటిక్ ఉన్నా ఆస్పత్రికి వెళ్లని వారి సంఖ్య పెద్దగానే ఉన్నట్లు తమ సర్వేలో తేలింది. ప్రీ డయాబెటిక్ ఉన్నవారంతా డయాబెటిక్ అవుతారని చెప్పలేం కానీ భారత్, దక్షిణాసియా ప్రజల్లో ఈ మార్పు ఎక్కువగా జరుగుతోంది అని డా.మోహన్ తెలిపారు.