Curry leaves | కూర‌లో క‌రివేపాకు అంటూ తేలిగ్గా తీసిపారేయొద్దు.. ఎందుకో తెలుసా..?

Curry leaves | కూర‌లో క‌రివేపాకు అంటూ తేలిగ్గా తీసిపారేయొద్దు.. ఎందుకో తెలుసా..?

Curry leaves : కూర‌ల్లో సువాసన కోసం వేసుకునే క‌రివేపాకును తినేవాళ్లు చాలా త‌క్కువ‌గా ఉంటారు. చాలామంది కూరలో కరివేపాకు కనిపించగానే తినకుండా పక్కకు పెడుతారు. ఎక్కువ మంది ఇలా క‌రివేపాకును తీసిపారేస్తారు కాబ‌ట్టే.. ఎవ‌రినైనా లెక్కచేయకపోతే ‘నన్ను కూర‌లో క‌రివేపాకులా తీసిపారేస్తున్నారు’ అంటూ వాపోతారు. కానీ క‌రివేపాకును పారవేయద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే దానిలో ఎన్నో ఔష‌ధ గుణాలుంటాయి. ప‌లు స‌మస్యల‌కు అది దివ్యౌష‌ధంగా ప‌నిచేస్తుంది. మ‌రి కరివేపాకుతో కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఒక‌సారి ప‌రిశీలిద్దాం..


ప్రయోజనాలు..

క‌రివేపాకుకు జీర్ణశ‌క్తిని పెంచే ల‌క్షణం ఉన్నది. అందుకే ఆహారంలో త‌ర‌చూ కరివేపాకు వాడటంవల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.

కరివేపాకు శరీరానికి అవసరమైన విటమిన్‌ ఎ, సి ల‌ను సరఫరా చేస్తుంది. రక్తంలో కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది. అందువ‌ల్ల క‌రివేపాకును త‌ర‌చూ తీసుకుకోవ‌డం ద్వారా బరువు పెరిగే ప్రమాదం నుంచి కూడా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

కరివేపాకులో ఉన్న ఔషధ గుణాలు రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడంతో కూడా తోడ్పడుతాయి.

కరివేపాకుల్లో ఉండే ఫైబర్‌ ఇన్సులిన్‌ను ప్రభావితం చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.

అంతేకాదు కరివేపాకు మలబద్ధకం సమస్యను కూడా తొలగిస్తుంది. కరివేపాకులో మెదడుతోపాటు నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తోడ్పడే పదార్థాలు చాలా ఉంటాయి.

కరివేపాకుతోపాటు, దాని నూనె కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది యాంటీ బయాటిక్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలను కలిగి ఉంది. ఇది అనేక ఇన్ఫెక్షన్లను నివారించడంలో తోడ్పడుతుంది.

కరివేపాకు చర్మానికి కూడా మేలు చేస్తుంది. క‌రివేపాకుల‌ను నీటిలో ఉడకబెట్టి ఆ నీటితో స్నానం చేస్తే ఫంగల్‌ ఇన్ఫెక్షన్ల నుంచి పరిష్కారం ల‌భిస్తుంది.