భారీగా పెరిగిన కరోనా కేసులు.. కేరళ రాష్ట్రంలోనే అత్యధికం

దేశంలో కరోనా మళ్లీ అలజడి సృష్టిస్తోంది. పలు రాష్ట్రాల పరిధిలో భారీగా కేసులు బయటపడుతున్నాయి. కేరళ రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

  • By: Somu    health    Dec 11, 2023 12:27 PM IST
భారీగా పెరిగిన కరోనా కేసులు.. కేరళ రాష్ట్రంలోనే అత్యధికం
  • అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం


ఢిల్లీ: దేశంలో కరోనా మళ్లీ అలజడి సృష్టిస్తోంది. పలు రాష్ట్రాల పరిధిలో భారీగా కేసులు బయటపడుతున్నాయి. కేరళ రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా మహమ్మారి పూర్తిగా నామరూపాల్లేకుండా పోయిందనుకుంటున్న తరుణంలో, మరోసారి కేసుల పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.


కాగా.. చాలా రోజుల తర్వాత మళ్లీ కొవిడ్‌ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో బయట పడుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 166 మంది కొత్తగా కొవిడ్‌ మహమ్మారి బారిన పడ్డారు. వీటిలో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే నమోదుకావడం గమనార్హం. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 895కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.


ఇన్‌ప్లూయెంజా వైరస్‌ల కారణమే..


దేశ వ్యాప్తంగా మొన్నటి వరకు రోజువారీ కరోనా కేసుల సగటు 100 గా నమోదైంది. చలి కాలం కావడంతో ఇన్‌ప్లూయెంజా లాంటి వైరస్‌లు విజృంభిస్తున్నాయి. ఈ కారణంగానే కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. కరోనా తీవ్రత తగ్గినప్పటి నుంచి, దేశంలో జూలై నెలలో అతి తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు.


2023 జూలై 24న కొత్త కరోనా కేసులు కేవలం 24 మాత్రమే రికార్డయ్యాయని పేర్కొన్నారు. ఇటీవల కరోనా పాజిటివ్‌ తో సిమ్లా ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ లో ఓ మహిళ మృత్యువాత పడినట్లు వెల్లడించింది. మొత్తానికి ఉన్నఫలంగా కరోనా కేసులు పెరగడంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.