కొబ్బ‌రి నీళ్ల‌తో ఎన్నో ప్ర‌యోజ‌నాలు..! మ‌రి మ‌ధుమేహులు తాగొచ్చా..?

ఎండ‌లు మండిపోతున్నాయి. ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణం కంటే అధికంగా న‌మోదవుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు

కొబ్బ‌రి నీళ్ల‌తో ఎన్నో ప్ర‌యోజ‌నాలు..! మ‌రి మ‌ధుమేహులు తాగొచ్చా..?

విధాత: ఎండ‌లు మండిపోతున్నాయి. ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణం కంటే అధికంగా న‌మోదవుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేస‌వి రాక‌ముందే ఈ ఎండ‌లు ఏంట‌ని అనుకుంటున్నారు. ఇక ఎండ‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు చ‌ల్ల‌ని పానీయాలను సేవిస్తుంటారు. దీంట్లో ముఖ్యంగా కొబ్బ‌రి నీళ్లు ప్ర‌ధాన‌మైన‌వి. తియ్యని, స్వచ్ఛమైన కొబ్బరి నీళ్లు వేసవి తాపాన్ని తీర్చడంలో ముందుంటాయి. ఖనిజ లవణాలు, ఎలక్ట్రోలైట్లు కలిగిన కొబ్బరి నీరు జీర్ణాశయంలో ఏర్పడే సమస్యలకు సహజ చికిత్స చేస్తాయి. తద్వారా ఆరోగ్యంగా ఉండేందుకు కొబ్బ‌రి నీళ్లు దోహ‌దం చేస్తాయి.

వేడిగా, తేమగా ఉండే తీరప్రాంతాల్లో కొబ్బరి నీళ్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎలక్ట్రోలైట్స్, మినరల్స్, విటమిన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కనుక ఉపవాసంలో ఉన్న వారికి మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వారు త్వరగా శక్తి సంతరించుకోవడానికి కూడా దోహదం చేస్తాయి.

ఉప‌వాసంలో ఉన్న వారు త‌రుచుగా కొబ్బ‌రి నీళ్లు తాగుతుంటారు. ఇక ఎండ‌లో తిరిగేవారు కూడా ఈ నీళ్ల‌ను సేవిస్తుంటారు. ఎందుకంటే చెమట రూపంలో బ‌య‌ట‌కు విడుద‌లైన ఎల‌క్ట్రోలైట్ల‌ను తిరిగి పొందేందుకు కొబ్బ‌రి నీళ్లు స‌హ‌క‌రిస్తాయి. ఈ నీళ్ల‌ల్లో ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో శక్తిస్థాయిని తక్షణమే పెంచుతాయి. చ‌ర్మం పొడిబార‌కుండా ఉండేందుకు కూడా దోహదం చేస్తాయి. శ‌రీరంలో టాక్సిన్లను బయటికి పంపి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి.

అల్స‌ర్స్‌, కొలైటిస్‌తో బాధ‌ప‌డే వారికి కొబ్బ‌రి నీళ్లు మంచి ఔష‌ధం. కొబ్బరినీళ్లలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఇది కోలైటిస్ సమస్యతో బాధ‌ప‌డేవారికి మంచి ఫ‌లితాల‌ను ఇస్తుంది. అందుకే ఇతర గ్యాస్ట్రోఇంటస్టయిన్ సమస్యలకు కొబ్బరి నీళ్లు చికిత్సగా వాడ‌టం మంచిద‌ని నిపుణులు పేర్కొన్నారు.

మ‌రి మ‌ధుమేహులు తాగొచ్చా..?

కొబ్బరి నీళ్లలో ఎన్నో పోషకాలున్నప్పటికీ, ప్రయోజనాలు ఉన్నప్పటికీ పరిమితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహులు సహజ చక్కెరలు కలిగిన ఈ పానీయాన్ని మితంగా తీసుకోవాలి. చాలా రకాల ఇతర పానీయాలతో పోలిస్తే ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి రక్తంలో చక్కెర స్థాయిని పెంచే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.