World Lupus Day | ల్యూప‌స్‌.. భ‌యం వ‌ద్దు!.. నేడు వ‌ర‌ల్డ్ ల్యూప‌స్ డే

ఇమ్యూనిటీ... మ‌న శ‌రీరాన్ని వ్యాధుల బారి నుంచి ర‌క్షించే ప‌టిష్ట‌మైన ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌. కానీ ఒక్కోసారి, కొంద‌రిలో మ‌న సొంత వ్యాధి నిరోధ‌క వ్య‌వస్థే మ‌న అవ‌య‌వాల‌పై దాడి చేస్తుంది

World Lupus Day | ల్యూప‌స్‌.. భ‌యం వ‌ద్దు!.. నేడు వ‌ర‌ల్డ్ ల్యూప‌స్ డే

ఇమ్యూనిటీ… మ‌న శ‌రీరాన్ని వ్యాధుల బారి నుంచి ర‌క్షించే ప‌టిష్ట‌మైన ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌. కానీ ఒక్కోసారి, కొంద‌రిలో మ‌న సొంత వ్యాధి నిరోధ‌క వ్య‌వస్థే మ‌న అవ‌య‌వాల‌పై దాడి చేస్తుంది. దానివ‌ల్ల క‌లిగే స్థితే ఆటో ఇమ్యూనిటీ. ఇలాంటి ప‌రిస్థితిలో క‌నిపించే వ్యాధుల‌నే ఆటోఇమ్యూన్ వ్యాధులంటారు. వీటిలో ఎక్కువ మందిలో క‌నిపించే వ్యాధి ల్యూప‌స్‌. ఈ వ్యాధిని సిస్ట‌మిక్ ల్యూప‌స్ ఎరిథిమేటొసిస్ (ఎస్ ఎల్ ఇ) అని కూడా పిలుస్తారు. దీని ప‌ట్ల అవ‌గాహ‌న క‌లిగించ‌డానికి 2004 సంవ‌త్స‌రం నుంచి మే 10 ని వ‌ర‌ల్డ్ ల్యూప‌స్ డే గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ప్ర‌తి వెయ్యి మందిలో ఒక‌రు మ‌న‌దేశంలో ల్యూప‌స్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. శ‌రీరంలోని ఏ వ్య‌వ‌స్థ పైన అయినా ఈ వ్యాధి ప్ర‌భావం ఉండ‌వ‌చ్చు. మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఈ వ్యాధి బారిన ప‌డుతుంటారు. ఇదొక మ‌ల్టీ సిస్ట‌మ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్‌. మ‌న‌దేశంలో ప్ర‌తి ల‌క్ష మందిలో 3.2 మంది దీని బారిన ప‌డుతార‌ని అంచ‌నా. ఇది చాలా సంక్లిష్ట‌మైన వ్యాధి. శ‌రీర ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థే దాని సొంత శ‌రీర భాగాల‌పై దాడి చేస్తుంది. చ‌ర్మం, జుట్టు, కీళ్లు, కండ‌రాలు, ఎముక‌లు, నాడీ వ్య‌వ‌స్థ‌.. మొద‌లైన అవ‌య‌వాల‌న్నింటి పైనా ప్ర‌భావం చూపిస్తుంది. పురుషుల క‌న్నా ప‌ది రెట్లు మ‌హిళ‌ల‌పై ప్ర‌భావం చూపిస్తుంది.

ల‌క్ష‌ణాలు

• కిడ్నీ ఫెయిల్యూర్‌
• కండ‌రాల నొప్పులు
• కీళ్లు వాపులు
• జ్వ‌రం
• ద‌ద్దుర్లు
• కొన్నిసార్లు మెద‌డు పొర‌ల్లో ఇన్ ఫ్ల‌మేష‌న్ (వాపు) రావొచ్చు.
• ప్ర‌త్యుత్ప‌త్తి వ‌య‌సులో ఉన్న అమ్మాయిల్లో ఫ‌ర్టిలిటీ స‌మ‌స్య‌లు, ప‌దే ప‌దే అబార్ష‌న్లు కావ‌డం

ఎలా గుర్తించాలి?

ల్యూప‌స్ వ్యాధిని నిర్ధారించ‌డానికి ఒకే టెస్టు అంటూ లేదు. కాబ‌ట్టి దీన్ని నిర్ధారించ‌డం కొంచెం క‌ష్ట‌మైన విష‌య‌మే. అందుకే మెడిక‌ల్ హిస్ట‌రీ, శారీర‌క ప‌రీక్ష‌లనే ముఖ్యంగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. యాంటీ న్యూక్లియ‌ర్ యాంటీబాడీస్ (ఎఎన్ఎ) అనే ప‌రీక్ష ఈ వ్యాధి నిర్ధార‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎఎన్ఎ నెగ‌టివ్ వ‌స్తే ల్యూప‌స్ లేద‌ని అర్థం. అయితే క్లినిక‌ల్ గా కూడా ప‌రీక్ష‌లు చేసి నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. లూపస్ వ్యాధిలో కిడ్నీలు ప్ర‌భావితం చెందితే కిడ్నీ ప‌నితీరును తెలిపే కిడ్నీ ఫంక్ష‌నింగ్ టెస్టులు అవ‌స‌రం అవుతాయి. ల‌క్ష‌ణాల‌ను నాడీవ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం ఉంద‌ని అనుకుంటే మెద‌డుకు సిటి స్కాన్ చేస్తారు.

చికిత్స‌

ఎక్కువ‌మ‌టుకు ల్యూప‌స్ చికిత్స ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టే ఉంటుంది. ఏయే అవ‌య‌వాలు ప్ర‌భావితం అయ్యాయ‌నే దాన్ని బ‌ట్టి ల‌క్ష‌ణాలు ఉంటాయి. వీటి నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగించే దిశ‌గానే చికిత్స అందిస్తారు. అంటే ఏ అవ‌య‌వాలు ప్ర‌భావిత‌మ‌య్యాయ‌నే దాని ఆధారంగా చికిత్స ప‌ద్ధ‌తి కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఎటువంటి ల‌క్ష‌ణాలు లేకుండా, వేరే ఏవో ప‌రీక్ష‌ల కోసం వ‌చ్చిన‌ప్పుడు యాదృచ్ఛికంగా ల్యూప‌స్ ఉన్న‌ట్టు తేలుతుంది.

ఇలాంటి సంద‌ర్భాల్లో ల్యూప‌స్ ని మేనేజ్ చేయ‌డానికి నాన్ స్టిరాయిడ‌ల్ యాంటీ ఇన్ ఫ్ల‌మేట‌రీ మందుల (ఎన్ ఎస్ ఎ ఐడి)ను ఇస్తారు. ల‌క్ష‌ణాలు పెద్ద‌గా లేకుండా వ్యాధి చాలా మైల్డ్ గా ఉన్న‌ప్పుడు ఇన్ ఫ్ల‌మేష‌న్ త‌గ్గించ‌డానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ లాంటి మందులు స‌రిపోతాయి. కొన్ని సార్లు, ఇన్ ఫ్ల‌మేష‌న్ ఎక్కువ‌గా ఉండి, వ్యాధి ప్ర‌భావం దీర్ఘ‌కాలికంగా ఉన్న‌ట్ట‌యితే కార్టికోస్టిరాయిడ్స్ , ఇత‌ర ఇమ్యూన్ స‌ప్రెసెంట్ మందుల‌ను వాడుతారు.

ఇలాంట‌ప్పుడు ఆటోఇమ్యూన్ వ్యాధి తీవ్రంగా ఉంటుంది కాబ‌ట్టి ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ ని (రోగ‌నిరోధ‌క చ‌ర్య‌ల‌ను) ఈ మందులు కంట్రోల్ చేస్తాయి. ప్రెడ్నిసొలోన్ లేదా మిథైల్ ప్రెడ్నిసొలోన్ లేదా హైడ్రో కార్టిసోన్ లాంటి కార్టికోస్టిరాయిడ్స్ ను సాధార‌ణంగా ఉప‌యోగిస్తారు. ఇవ‌న్నీ కూడా వాపు, మంట (ఇన్ ఫ్ల‌మేష‌న్‌)ను త‌గ్గించ‌డంలో స‌హ‌క‌రిస్తాయి. వీటితో పాటుగా మైకోఫినోలేట్ లాంటి డిసీజ్ మాడిఫ‌యింగ్ మందుల‌ను కూడా ఇస్తారు.

నివార‌ణ‌

ల్యూప‌స్ ఆటో ఇమ్యూన్ వ్యాధి కాబ‌ట్టి దీన్ని నివారించ‌డం చాలావ‌ర‌కు అసాధ్యం. ఎందుకంటే ల్యూప‌స్ వ్యాధి ప్రేరేపింప‌బ‌డ‌టానికి గ‌ల రిస్కు కార‌కాలు మ‌న‌కు ఇంత‌వ‌ర‌కు తెలియ‌దు. అయితే స‌మ‌తులాహారం తీసుకోవ‌డం, ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌విధానం కొంత‌వ‌ర‌కు రిస్కు త‌గ్గించే అవ‌కాశం ఉంటుంది. ఒత్తిడి త‌గ్గించుకోవ‌డం కూడా అవ‌స‌ర‌మే.

అయితే ల్యూప‌స్ వ్యాధి రావ‌డ‌మ‌నేది ఏ పూర్వ‌జ‌న్మ పాప‌మో అని బాధ‌ప‌డుతూ ఉండ‌టం స‌రికాదు. ఇదే శాప‌మూ కాదు. ల్యూప‌స్ ఉన్న పేషెంట్లు కూడా చాలా సంతోష‌క‌ర‌మైన జీవితాన్ని గ‌డిపేవాళ్లు ఉన్నారు. స‌కాలంలో వ్యాధి నిర్ధార‌ణ జ‌రిగి, స‌రైన చికిత్స తీసుకోవ‌డం వ‌ల్ల ఇది సాధ్య‌మ‌వుతుంది. ఇండియ‌న్ ర్యుమ‌టాల‌జీ అసోసియేష‌న్‌, యూరోపియ‌న్ ర్యూమ‌టాల‌జీ, అమెరిక‌న్ ర్యుమ‌టాల‌జీ , ఇత‌ర స‌పోర్టివ్ గ్రూప్స్ ల్యూప‌స్ పేషెంట్ల‌కు బాస‌ట‌గా నిలుస్తున్నాయి.


డాక్టర్ గౌరీ శంకర్ బాపనపల్లి,

జ‌న‌ర‌ల్ ఫిజీషియ‌న్‌
మల్లా రెడ్డి నారాయణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్
హైదరాబాద్‌