Namita Patjoshi | ఆమెది మధ్య తరగతి కుటుంబం. భర్త ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ చాలిచాలనీ జీతం. కుటుంబ పోషణకు భర్త జీతం సరిపోవడం లేదు. తమ ముగ్గురు పిల్లలను పోషించేందుకు ఆమె కూడా తన భర్తకు తోడుగా నిలిచింది. ఆమె నెల సంపాదన కూడా సరిపోవడం లేదు. అదే సమయంలో తన తండ్రి బహుమతిగా ఇచ్చిన జెర్సీ ఆవు.. ఆమె జీవితాన్ని మార్చేసింది. ఒక్క ఆవుతో తన పాల వ్యాపారాన్ని ప్రారంభించిన ఆమె.. ఇప్పుడు ఏడాదికి రూ. 1.5 కోట్లు సంపాదిస్తోంది.
Namita Patjoshi | ఆమెది మధ్య తరగతి కుటుంబం. భర్త ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ చాలిచాలనీ జీతం. కుటుంబ పోషణకు భర్త జీతం సరిపోవడం లేదు. తమ ముగ్గురు పిల్లలను పోషించేందుకు ఆమె కూడా తన భర్తకు తోడుగా నిలిచింది. ఆమె నెల సంపాదన కూడా సరిపోవడం లేదు. అదే సమయంలో తన తండ్రి బహుమతిగా ఇచ్చిన జెర్సీ ఆవు.. ఆమె జీవితాన్ని మార్చేసింది. ఒక్క ఆవుతో తన పాల వ్యాపారాన్ని ప్రారంభించిన ఆమె.. ఇప్పుడు ఏడాదికి రూ. 1.5 కోట్లు సంపాదిస్తోంది. అంతేకాదు ఓ 25 మందికి ఆమె ఉపాధి కల్పిస్తోంది. మరి ఆమె ఎవరు..? ఆమె కోట్ల సంపాదన గురించి తెలుసుకోవాలంటే ఒడిశాలోని కోరాపుట్‌కు వెళ్లాల్సిందే.
నా పేరు నమిత పట్‌జోషి. 1987లో వివాహమైంది. నా భర్త కోరాపుట్ జిల్లాలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో క్లర్క్ ఉద్యోగి. ఆయన జీతం నెలకు రూ. 800. వచ్చే 800తో ఏడుగురు కుటుంబ సభ్యులం బతకడం కష్టంగా మారింది. నా ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడి పోషణ కూడా ఇబ్బందిగా మారింది. మా కుటుంబ సభ్యుల కోసం రోజుకు రూ. 20 వెచ్చించి రెండు లీటర్ల పాలు కొనేదాన్ని. ఇక డబ్బులు సరిపోవడం లేదని చెప్పి 1992లో కోరాపుట్ పట్టణంలోని శ్రీ అరబిందో పుర్ణగా శిక్ష కేంద్ర పాఠశాలలో టీచర్‌గా చేరాను. అప్పుడు నా జీతం కేవలం రూ. 300 మాత్రమే.
అయితే నేను టీచర్‌గా ఉద్యోగం చేస్తున్న సమయంలో లైన్‌మెన్ అయిన నా తండ్రి 1995లో ఒక జెర్సీ ఆవును బహుమతిగా ఇచ్చాడు. ఆ ఆవు ప్రతి రోజు నాలుగు లీటర్ల పాలు ఇచ్చేది. దీంతో పాల ఖర్చు కూడా తగ్గిపోయింది. ఇక ఆవు పాలు పిల్లలకు తాగించడంతో వారికి పుష్కలంగా పోషకాలు అందేవి. అయితే ఏడాది లోపే నాన్న బహుమతిగా ఇచ్చిన జెర్సీ ఆవు అదృశ్యమైంది.
పాల విలువ తెలుసుకున్న నేను 1997లో తన వద్ద ఉన్న బంగారం గొలుసును తాకట్టు పెట్టాను. రూ. 5,400 వెచ్చించి ఒక జెర్సీ ఆవును కొనుగోలు చేశాను. ఈ ఆవు ప్రతి రోజు ఆరు లీటర్లు పాలు ఇచ్చేది. రెండు లీటర్ల పాలు ఇంటి అవసరాల కోసం ఉంచుకుని, మిగతా పాలను లీటర్‌కు రూ. 10 చొప్పున అమ్మేదాన్ని. 2004లో 20 ఆవులతో వ్యాపారం మరింత విస్తరించాను. అప్పుడు లీటర్ పాలను రూ. 30కి విక్రయించేదాన్ని. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఈ వ్యాపారం కొనసాగించాలని నిర్ణయించుకున్నాను.
2013లో నా ఉద్యోగాన్ని వదిలేసుకుని, పాల వ్యాపారంపై దృష్టి సారించాను. ఒక ఆవు నుంచి ఐదు ఆవులను విస్తరించేందుకు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాను. నా అత్త పేరు మీద కంచన్ డెయిరీ ఫామ్ నెలకొల్పాను. మొదట్లో ఫీడింగ్ నుంచి క్లీనింగ్ దాకా అన్ని పనులు నేనే చేసుకునే దాన్ని. నా వ్యాపారాన్ని విస్తరించాలని చెప్పి 2015-16 సమయంలో 50 శాతం సబ్సిడీ లోన్లు తీసుకున్నాను. కమర్షియల్ అగ్రి ఎంటర్‌ప్రైజెస్ స్కీం కింద బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాను. అనుకున్న సమయానికి ముందుగానే రుణాలు చెల్లించడంతో బ్యాంకర్లు ఎప్పుడంటే అప్పుడు నాకు రుణాలు ఇచ్చేవారు.
ఇప్పుడు ప్రస్తుతం నా డెయిరీలో 200 దాకా ఆవులు ఉన్నాయి. 50 వరకు దూడలు ఉన్నాయి. ఒక 25 ఆవుల దాకా పాలు ఇవ్వవు. 200 ఆవులతో రోజుకు 600 లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తున్నాం. పాలతో పాటు జున్ను, పెరుగు, నెయ్యి తయారు చేసి విక్రయిస్తున్నాం. రూ. 65 చొప్పున లీటర్ పాలను విక్రయిస్తున్నాం. అంటే రోజుకు రూ. 39 వేలు సంపాదిస్తున్నాను. పాలతో పాటు నెయ్యి, పెరుగు, జున్ను అమ్మకాల ద్వారా ఏడాదికి రూ. 1.5 కోట్లు సంపాదిస్తున్నాను.
నా డెయిరీ పక్కనే ఉన్న డిస్పెన్షరీని షాహీద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌గా 2017లో మార్చారు. దీంతో ఆవులను పెంచేందుకు ఇబ్బంది ఉందని చెప్పి డెయిరీని మూసేయాలని నిర్ణయించుకున్నాను. నా భర్త కూడా డెయిరీని మూసేయాలని ఒత్తిడి తెచ్చారు. ఆ సమయంలో నా ఫామ్‌లో 55 ఆవులు ఉన్నాయి. 13 మంది వర్కర్లుగా పని చేస్తున్నారు. ఇందులో 9 మంది ట్రైబల్ వుమెన్స్ ఉన్నారు. డెయిరీని మూసేయొద్దని మహిళా వర్కర్లు నాతో వాదనకు దిగారు. వారి ఉపాధికి భంగం కలిగించొద్దనే ఉద్దేశంతో మా ఇంటికి దగ్గర్లో ఉన్న 15 సెంట్ల భూమిని లీజుకు తీసుకున్నాం. దానికి నెలకు రూ. 5 వేలు చెల్లిస్తున్నాం. ఇక ఆ భూమిలో డెయిరీని ప్రారంభించాం. గిరిజన మహిళా వర్కర్ల కోసం ఇండ్లు కూడా నిర్మించాం. ప్రస్తుతం డెయిరీ ఫామ్‌లో 25 మంది వర్కర్లు ఉన్నారు. ఇందులో 18 మంది గిరిజన మహిళలే ఉన్నారు.
ఆవుల దాణా కోసం నెలకు రూ. 7 లక్షలు ఖర్చు పెడుతున్నాం. రూ. 30 వేల దాకా ఆవుల మెడికల్ ట్రీట్‌మెంట్‌కు వెచ్చిస్తున్నాం. మహిళా వర్కర్లకు నెలకు రూ. 5 వేల చొప్పున, మగ కూలీలకు నెలకు రూ. 9 వేల చొప్పున జీతాలు చెల్లిస్తున్నాం. ఇక కూలీల పిల్లల చదువులకు కూడా ఆర్థిక సాయం చేస్తున్నాం. సమయం దొరికినప్పుడు కూలీల పిల్లలకు పాఠాలు కూడా బోధిస్తున్నాను.
నా డెయిరీ ఫామ్‌లో 100 మంది నిరుపేద గిరిజన మహిళలకు ఉపాధి కల్పించడం, వారి పిల్లల చదువుకు నిధులు సమకూర్చడం లక్ష్యంగా పెట్టుకున్నాను. నేను దీన్ని ఎప్పుడు చేయగలనో నాకు తెలియదు, కానీ నేను ఒక రోజు చేస్తాను. పాల వ్యాపార రంగంలో రాణిస్తున్న నాకు ఇప్పటి దాకా 20 అవార్డులు వచ్చాయని నమిత చెప్పుకొచ్చారు.