దారుణం.. బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని

మేడిపల్లి ప్రాంతంలో నాలుగేళ్ల బాలుడికి పిన్ని యాసిడ్ తాగించిన దారుణం వెలుగుచూసింది. అసూయతో బాలుడిని హత్యాయత్నం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

విధాత, హైదరాబాద్ : .తన కొడుకు పట్ల చిన్నచూపు చూస్తున్నారన్న అక్కసుతో మానవత్వం మరిచిపోయిన ఓ మహిళ తన తోటి కోడలు కొడుకు(4)కి యాసిడ్ తాగించి చంపాలని ప్రయత్నించిన దారుణ ఘటన కలకలం రేపింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో బోడుప్పల్ శ్రీనివాస కాలనీలో ఉండే పర్వతం సతీష్ కుమార్, అంజమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు నాగరాజు, జగదీష్ ఉన్నారు. వారిద్దరికి పెళ్లిళ్లు కాగా..వారికి పిల్లలు ఉన్నారు. అంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. పెద్ద కుమారుడి కొడుకు (4)పై తాత ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని, తన బిడ్డను పట్టించుకోవడం లేదని చిన్న కోడలు మంజుల కక్ష పెంచుకుంది.

ఇటీవల తాత తన చేతిపై పెద్ద కుమారుడి కొడుకు పేరు పచ్చబొట్టు వేయించుకున్నారు. దీంతో ఆమె ఆ పిల్లాడిపై అసూయ ద్వేషం పెంచుకుంది. అతడిని అంతమొందించాలని నిర్ణయించి వరుసగా పలు దారుణాలకు పాల్పడింది. ఇటీవల ఇంట్లో చిన్నారి నోరు, ముక్కు మూసి చేతులు పట్టుకుని చంపేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో బాలుడి తల్లి గమనించి నిలదీయడంతో తాము ఆడుకుంటున్నామని చెప్పి తప్పించుకుంది.

మరోసారి ఆ బాలుడిని ఇంటిపై అంతస్తుకు తీసుకెళ్లి రెయిలింగ్‌పై కూర్చోబెట్టి కిందపడిపోయేలా చేసింది. అదే సమయానికి తాత ఆమె చర్యను గమనించి మందలించాడు.‌ ఈ నెల 9న మంజుల బాలుడిని కిచెన్‌లోకి తీసుకెళ్లి జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తానని చెప్పి.. యాసిడ్ తాగించింది. దీంతో బాలుడు తీవ్ర అస్వస్థతో ప్రాణాపాయానికి గురయ్యాడు. బాలుడి పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. బుధవారం రాత్రి చిన్నారి తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

బిగ్ డే…లోక్ సభ ముందుకు మూడు కీలక బిల్లులు..ప్రతిపక్షాల నిరసనలు
తెలంగాణ కుల గణన లెక్కలు వెల్లడించిన ప్రభుత్వం

Latest News