Revanth Reddy : అందెశ్రీ స్మృతి వనం ఏర్పాటు చేస్తాం
అందెశ్రీ స్మారకార్థం స్మృతి వనం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కుటుంబానికి ఉద్యోగం, రచనలకు స్థానం కల్పిస్తామని తెలిపారు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అధికారిక గేయ రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ జ్ఞాపకం చిరస్మరణీయం చేసేలా ఘట్ కేసర్ లో స్మృతి వనం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందెశ్రీ అంత్యక్రియలకు హాజరైన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీకి అశ్రు నయనాలతో అంతిమ వీడ్కోలు పలికాను. బరువెక్కిన గుండెతో పాడి మోసి ఆయనతో నాకున్న అనుబంధపు రుణం తీర్చుకున్నానని రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. తన గళంతో, కలంతో జాతిని జాగృత పరిచి, తెలంగాణ సమాజాన్ని నిత్య చైతన్యవంతంగా ఉంచేందుకు శ్రమించిన ఆయన తెలంగాణ గుండెల్లో ఎప్పటికి మరచిపోలేని జ్ఞాపకంగా ఉంటారన్నారు. “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” అని పాడే ప్రతి గొంతులో ఆయన ప్రతిధ్వనిస్తారని పేర్కొన్నారు.
అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం అని రేవంత్ రెడ్డి తెలిపారు. అందేశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గేయాన్ని పాఠ్యంశంగా మార్చి వారి స్ఫూర్తిని తెలంగాణ ఉన్నంత కాలం తెలంగా రాష్ట్ర సాధనలో ఆయన పాత్రను శాశ్వతం చేసేలా చేస్తామన్నారు. అందెశ్రీ రచనల నిప్పులవాగు పుస్తకంను యువత, భవిష్యత్ తరాలు చదివేలా 20వేల ప్రచురణాలను రాష్ట్రంలోని అన్ని లైబ్రరీలలో, మారుమూల పల్లెల్లో, తండాలలో కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవే కాకుండా వారి అభిమానులనుంచి సూచనలు తీసుకుని వారి పేరు శాశ్వతంగా నిలిచేలా అవసరమైన అన్ని చర్యలను మా ప్రభుత్వం చేపడుతుందన్నారు. అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని స్వయంగా కలిసి కోరుతానని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram