విధాత, హైదరాబాద్ : అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ టి.హరీశ్ రావుకు, కాంగ్రెస్ మంత్రులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. బడ్జెట్ ప్రతిపాదనలపైన హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ హామీలు… అప్పులను ప్రస్తావిస్తూ…బీఆర్ఎస్ పాలన విజయాలను ఏకరువు పెడుతూ.. కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎత్తిచూపుతూ విరుచుక పడ్డారు. దీంతో పలుమార్లు హరీశ్ రావు ప్రసంగానికి అడ్డుతగిలిన మంత్రులు ఆయన ఆరోపణలపై కౌంటర్ ఎటాక్ చేశారు. నా గొంతు నొక్కుతున్నారని హరీశ్ రావు, సత్యదూరమైన మాటలు చెబుతున్నారని మంత్రులు పరస్పరం విమర్శలు సంధించుకున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో హరీశ్ రావు కు మంత్రులు ఉత్తమ్, భట్టి, పొన్నం ప్రభాకర్ లకు మధ్య పరస్పర విమర్శలు సాగాయి. బడ్జెట్ పై హరీశ్ రావు ప్రసంగానికి మంత్రులు భట్టి, సీతక్క, జూపల్లి, శ్రీధర్ బాబు, అడ్లూరిలు కౌంటర్ ఇచ్చారు.
బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో రూ. 4,00,017 వేల కోట్లు అప్పుచేస్తే..కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో రూ. 3,00,972 వేల కోట్లు అప్పు చేసింది అని హరీశ్ రావు ఆరోపించారు. ఈ విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధం అని సవాల్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 14శాతంగా ఉంటే.. కాంగ్రెస్ పాలనలో 2024-25 లో 10.6%, 2025-26 లో 10.2శాతానికి పడియపోయిందని, కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు పడిపోయాయని ఆరోపించారు. ఒకవైపు గ్రోత్ రేట్ పడిపోతుంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో రైజింగ్, రైజింగ్ అంటున్నాడని వంగ్యాస్త్రాలు సంధించారు.
రేవంత్ రెడ్డి రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్న మాటలు నమ్మిన పాపానికి రైతుల పాత అప్పు తీరలేదు, కానీ కొత్త అప్పు మీద పడ్డది అని హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేట నియోజకవర్గంలోనే ఇంకా 52% రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు అన్నారు. రుణమాఫీ కానటువంటి రైతులు ప్రతీ గ్రామంలో ఉన్నారని తెలిపారు. . బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క సీజన్ కూడా ఎగ్గొట్టకుండా రైతుబంధు ఇచ్చామని మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మూడు సీజన్‌లలో రైతు భరోసాను ఎగవేసిందని తెలిపారు. బాటసారి బంగారు కడియం కథను ఉదహరిస్తూ… ఆ కథలో ముసలి పులి కాంగ్రెస్, బంగారు కడియం ఆరు గ్యారంటీలు, మోసపోయిన బాటసారితో ప్రజలను పోల్చుతూ హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.15 వేలు రైతుబంధు ఇస్తామని హామీ ఇచ్చారని, ఈ మేరకు ఎన్నికల అజెండాలో కూడా పెట్టారని హరీష్‌రావు గుర్తుచేశారు. తొలి బడ్జెట్‌లో ప్రకటించి, ఆ తర్వాత దాన్ని రూ.12 వేలకు తగ్గించారని మండిపడ్డారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని కూడా రెండు బడ్జెట్‌లలో పెట్టారని, కానీ ఒక్కసారి కూడా ఇవ్వలేదని చెప్పారు. రెండు బడ్జెట్లలో పెట్టిన పంటల బీమా ఈ బడ్జెట్‌లో మాయమైందని అన్నారు. బోనస్ బోగస్ అయ్యింది.. బీమా బూటకం అయ్యిందని విమర్శించారు.
ప్రభుత్వం ఎక్సైజ్ ఆదాయాన్ని వచ్చే ఏడాదికల్లా రూ.12 వేల కోట్లు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎక్సైజ్ మంత్రి జూపల్లి కలుగజేసుకుని కాంగ్రెస్ హయాంలో రూ.12 వేల కోట్లుగా ఎక్సైజ్ ఆదాయాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.36 వేల కోట్లు పెంచిందని అన్నారు. జాబ్ క్యాలెండర్ త్వరలోనే ప్రారంభిస్తామని గత బడ్జెట్‌లో చెప్పారు. ఈసారి ఆ ప్రస్తావనే లేదు’’అని హరీశ్‌రావు అన్నారు. రాజీవ్ యువ వికాసం బదులు.. రేవంత్ ఆత్మీయ మోసం అని పెట్టుకోండి. లేకపోతే, భట్టి విక్రమార్క యువ భ్రమలు అని పెట్టుకోండని చురకలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్‌కు సాంక్టిటీ లేదు.. బడ్జెట్ ప్రసంగాలకు ప్యూరిటీ లేదు, క్లారిటీ లేదు. .హామీలు అమలు చేస్తారనే గ్యారెంటీ లేదు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అభయ హస్తం భస్మాసుర హస్తం అయ్యిందని మండిపడ్డారు.
భట్టి మొదటి బడ్జెట్ లో 59వేల కోట్ల కోత పెట్టారని, రెండో బడ్జెట్ లో 55వేలు కోట్ల కోత పెట్టారని, ఇప్పుడు మూడో బడ్జెట్ లో 50వేల కోట్లతో అదనంగా వాస్తవ అంచనాలకంటే ఎక్కువ పెట్టి ఎవరికి కోతలు పెడుతారని హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో మాయమాటలతో మరో మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆరు గ్యారంటీలకు చట్టబద్దత ఇవ్వాలని, వృద్దులకు రూ.4వేల పెన్షన,, నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు, మహిళలకు రూ. 2,500రూపాయలు ఎప్పుడిస్తారా చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ఈ ప్రభుత్వం రాష్ట్రానికి శాపంగా మారిన వినాశక, విధ్వంసక చర్యలు ఆపాలని, విధ్వంసం ఆపి అభివృద్ది వైపు సాగాలని, లేదంటే మీరు చేస్తున్న ఈ విధ్వంసం రేపు మిమ్నల్నే నాశనం చేస్తుందని హరీశ్ రావు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి :
ఆరు గ్యారంటీలపై ప్రైవేట్ బిల్లుకు అనుమతించండి : స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినతి
అభివృద్దిని అడ్డుకోకండి.. మూసీ సుందరీకరణకు సహకరించండి: సీఎం రేవంత్ రెడ్డి
