హైదరాబాద్ హోటళ్లలో సంక్షోభం: పాయా నుంచి బిర్యానీ దాకా.. గ్యాస్​ కొరత ప్రభావం

హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్​ కొరత తీవ్రంగా మారింది. పాయా, నిహారి, బిర్యానీ వంటి వంటకాలు ప్రభావితమవుతున్నాయి. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా హోటళ్లు మెనూలను తగ్గించుకుంటున్నాయి. కట్టెల పొయ్యిల మీద వంటలు మంటలు పుట్టిస్తున్నాయి.

Reported by: ADHARVA | హైదరాబాద్​ | Apr 16, 2026, 5:20 pm IST
Read Time: 8 mins
హైదరాబాద్ హోటళ్లలో సంక్షోభం: పాయా నుంచి బిర్యానీ దాకా.. గ్యాస్​ కొరత ప్రభావం ఎల్పీజీ అందుబాటులో లేక పాతకాలపు వంట విధానాలకు మళ్లిన హోటళ్లు

Hyderabad LPG Shortage Hits Restaurants, Paya-Nihari to Biryani Affected

సారాంశం
హైదరాబాద్‌లో కమర్షియల్ LPG కొరత తీవ్రంగా మారడంతో నిహారి–పాయా వంటి వంటలు నిలిచిపోయాయి. బిర్యానీ సహా అనేక వంటకాలను హోటళ్లు మంటలపై తయారు చేస్తున్నాయి. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంతో గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో పాటు నూనెలు, మసాలా ధరలు పెరగడంతో ఖర్చులు పెరిగి, మెనూలను కుదించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

(మట్టపల్లి సుబ్బారెడ్డి)

 (విధాత ప్రత్యేక వార్తా కథనం)

హైదరాబాద్, మార్చి 30 : హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన నిహారి, పాయా వంటలు గత రెండు వారాలుగా క్రమంగా కనుమరుగవుతున్నాయి. ముఖ్యంగా పాతనగర ప్రాంతాల్లో తెల్లవారుజామున పెద్ద పెద్ద పాత్రల్లో గంటల పాటు మరిగే పాయా, నిహారి దృశ్యాలు ఇప్పుడు కనిపించడం లేదు.

ఇదంతా వంటగ్యాస్‌ కొరత కారణంగా జరుగుతోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు—ఇజ్రాయెల్‌, అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు—ఇంధన సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపడంతో హైదరాబాద్‌లో వాణిజ్య గ్యాస్​ సిలిండర్ల కొరత తీవ్రంగా పెరిగింది.

Food preparation on wood fire in temporary kitchen arrangements

టిఫిన్​ సెంటర్లదీ అదే సమస్య – ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో బయట వంటలు

నిహారి వంటకం ప్రత్యేకత ఏమిటంటే అది రాత్రంతా నెమ్మదిగా ఉడికించాలి. తరువాత కూడా వేడి వేడి గా అందించాలంటే మళ్లీ మళ్లీ మంటపై పెట్టాలి. ఈ ప్రక్రియలో భారీగా గ్యాస్‌ వినియోగం జరుగుతుంది. దీంతో గ్యాస్‌ సరఫరా తగ్గడంతో చాలా హోటళ్లు ఈ వంటకాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. అలాగే పాయా కూడా. పాయా చాలా ప్రఖ్యాతి పొందిన వంటకం. మేక కాళ్ల ఎముకలను రకరకాల మసాలా దినుసులతో కలిపి బాగా ఉడికించే తయారు చేసే పలుచటి వంట. తాగడానికి కూడా వీలుగా ఉంటుంది. అత్యంత బలవర్థకమైన పోషకాహారం ఇది. దీన్ని తయారుచేయడానికి కూడా చాలా సమయం పడుతుంది.

ఉదయాన్నే నిహారి, పాయా కోసం వచ్చే వినియోగదారులను వెళ్లగొట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వారిలో అసంతృప్తి పెరుగుతోంది.

గ్యాస్‌కు బదులు మంటల వంటలుఖర్చులు పెరిగి హోటళ్లకు భారం

Traditional cooking setup with firewood as LPG cylinders become scarce

గ్యాస్ కొరతతో రోడ్డుపై మంటలతో వంటలు… హైదరాబాద్ హోటళ్ల కొత్త పరిస్థితి

హైదరాబాద్​కు తలమానికమైనటువంటి బిర్యానీకి కూడా యుద్ధపు మంటలు అంటుకున్నాయి. చికెన్​ బిర్యానీ, మటన్​ బిర్యానీలకు విపరీతమైన గిరాకీ ఉండే ఈ నగరంలో ఇప్పుడు అది కూడా అందని ద్రాక్షగా మారుతోంది. కేవలం బిర్యానీలకే ప్రసిద్ధి చెందిన ప్యారడైజ్​, షాగౌస్​, సర్వీ, బావార్చీ లాంటి హోటళ్లు బిర్యానీ తయారీకి పూర్తిగా కట్టెల పొయ్యిలను వినియోగిస్తున్నారు. ఇక ఆన్​లైన్​ ఆర్డర్లలో బిర్యానీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. డిమాండ్​ మీరకు బిర్యానీలు అందించడం రెస్టారెంట్లకు తలకు మించిన భారమవుతోంది.

 సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో అనేక హోటళ్లు ఇప్పుడు మళ్లీ పాతకాలపు వంట విధానాలకు మారుతున్నాయి. బిర్యానీ, మండి, దమ్ కా ముర్గ్‌, డబుల్ కా మీఠా, కద్దు కా ఖీర్ వంటి వంటకాలను ట్టెలు, బొగ్గు పొయ్యి (ఫైర్‌వుడ్‌, చార్​కోల్‌)లపై తయారు చేస్తున్నారు. కానీ ఇది సులభమైన విషయం కాదు. ఇందుకు చాలా స్థలం కావాల్సివుండటంతో కొన్ని హోటళ్లు ప్రత్యేకంగా ఫంక్షన్ హాల్స్‌ను అద్దెకు తీసుకుని వంట చేస్తున్నారు. ఇది అదనపు ఖర్చుగా మారింది.

అదే సమయంలో మంటల కోసం అవసరమైన కట్టెలు, బొగ్గు ధరలు కూడా పెరగడంతో మొత్తం తయారీ తడసి మోపెడవుతోంది. ఒకవైపు గ్యాస్ కొరత, మరోవైపు ప్రత్యామ్నాయ వనరుల ఖర్చు—ఇవి రెండూ కలిసి హోటళ్లను ఆర్థికంగా ఒత్తిడికి గురిచేస్తున్నాయి.

ధరల పెరుగుదలమెనూలు కుదింపువినియోగదారులకు ఇబ్బందులు

Hotel staff cooking meals using firewood amid gas shortage

గ్యాస్ సంక్షోభంలోనూ వంటలు ఆగకుండా శ్రమిస్తున్న హోటల్ సిబ్బంది

ఈ సంక్షోభం కేవలం గ్యాస్ సరఫరాతోనే పరిమితం కాలేదు. మధ్యప్రాచ్య పరిస్థితుల ప్రభావంతో తినుబండారాల్లో ఉపయోగించే నూనెలు, మసాలాలు వంటి వస్తువుల ధరలు కూడా పెరిగాయి. దీంతో హోటల్ యజమానులు నష్టాలను తగ్గించుకోవడానికి కొన్ని వంటకాలను మెనూలో నుంచి తొలగిస్తున్నారు. కొంతమంది పరిమిత వంటకాలతోనే సేవలు అందిస్తున్నారు. మరికొన్నింటికి ధరలు పెంచారు.

హైదరాబాద్ ఆహార సంస్కృతిలో ముఖ్య భాగమైన నిహారి–పాయా లాంటి వంటకాలు అందుబాటులో లేకపోవడం కేవలం వ్యాపార సమస్య మాత్రమే కాదు—ఇది నగర జీవనశైలిపై కూడా ప్రభావం చూపుతోంది.

ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడే వరకు హోటళ్లు ఈ కష్టకాలాన్ని ఎదుర్కోవాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది—ప్రపంచ రాజకీయ పరిణామాలు సంబంధం లేని దేశాల వంటశాలలపై కూడా ప్రభావం చూపుతున్నాయి.

ADHARVA
Chief News Editor
adharva@vidhaatha.com

తెలుగు జర్నలిజంలో పదిహేను సంవత్సరాల అనుభవం. అన్ని రంగాలపై సమగ్ర అవగాహన కలిగిన రచయిత. ప్రముఖ తెలుగు పత్రికలలో ఇంటర్నెట్​ డెస్క్​లో పనిచేసారు. సామాజిక అవగాహన, సైన్స్​, టెక్నాలజీ, రాజకీయ విశ్లేషణ, క్రీడలపై వివిధ రకాల కథనాలు రాసారు. ప్రస్తుతం విధాతలో ముఖ్య వార్తాసంపాదకుడుగా పనిచేస్తున్నారు.