• Telugu News
  • /Hyderabad

Engineering Colleges Project Fees | ప్రాజెక్టు పేరుతో ‘తెలివి’గా ఇంజినీరింగ్ కాలేజీల అక్రమ ఫీజు వసూళ్లు..

అయినదానికి కాని దానికి ఫీజులు వసూలు చేయడం పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో రివాజుగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అబ్దుల్లాపూర్ మెట్ లోని ఒక కాలేజీ నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టుకు ఫీజులు వసూలు చేయడం వివాదాస్పదమైంది.

Reported by: Jagan Mohan Talluri | హైదరాబాద్​ | Mar 25, 2026, 11:20 pm IST
Read Time: 4 mins
Engineering Colleges Project Fees | ప్రాజెక్టు పేరుతో ‘తెలివి’గా ఇంజినీరింగ్ కాలేజీల అక్రమ ఫీజు వసూళ్లు..

Engineering Colleges Project Fees | హైదరాబాద్‌లోని పలు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రాజెక్టు ఫీజు పేరిట విద్యార్థులపై అదనపు భారాన్ని మోపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెల్లించని పక్షంలో సెమ్‌ హాల్‌టికెట్‌ జారీ చేయబోమని బెదిరిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్‌ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఒక కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం విద్యార్థుల నుంచి ‘మినీ ప్రాజెక్ట్‌’ పేరుతో ఆరు వేల రూపాయలు డిమాండ్‌ చేయడం వివాదాస్పదంగా మారింది. దీనితోపాటు కాలేజీ వార్షికోత్సవ ఫీజు, క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ఫీజులు చెల్లించకపోతే సెమ్‌ హాల్‌టికెట్‌ను ఇవ్వబోమని బెదిరిస్తున్నట్టు సమాచారం.

వాస్తవానికి తమకు ముందుగా ఫీజుల విషయం చెప్పలేదని విద్యార్థులు అంటున్నారు. ఉన్నట్టుండి ఫీజు కట్టాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారని వాపోతున్నారు.

ఇంజినీరింగ్‌ కాలేజీ ఫీజులను తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ (TAFRC) నిర్ణయిస్తుంది. ఇందులో ట్యూషన్‌ ఫీజు మాత్రమే అధికారికంగా నిర్ణయిస్తారు. ప్రాజెక్టు వర్క్‌ అనేది సిలబస్‌లో భాగం. దీనికి మినీ ప్రాజెక్ట్‌ ఫీజు అనే ప్రత్యేక చార్జ్‌కు ఎలాంటి స్పష్టమైన అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు. అదనపు పేర్లతో ఫీజులు వసూలు చేయడం నిషిద్ధమని పేర్కొంటున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చులన్నీ ట్యూషన్‌ ఫీజులోనే ఉండాలని చెబుతున్నారు. అయితే.. కొన్ని కాలేజీలు లొసుగులను ఆధారం చేసుకుని, బయట కంపెనీలతో ప్రాజెక్టులు చేయించడం, మెటీరియల్‌, హార్డ్‌వేర్‌ ఖర్చులు, ట్రైనింగ్‌ పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.

ఇదే విషయంలో సంబంధిత కాలేజీ సిబ్బందిని అడిగితే.. తమకేమీ సంబంధం లేదని చెబుతున్నారని కొందరు విద్యార్థులు వాపోతున్నారు. హెచ్‌వోడీని అడిగితే తన పరిధిలోనిదికాదని అన్నారని, ప్రిన్సిపల్‌ను అడిగితే.. తామేమీ చేయలేమని చేతులెత్తేశారని పేర్కొన్నారు. ఒకరిపై ఒకరు నెట్టేసుకొని.. వైస్‌ చైర్మన్‌ను కలవాలంటూ ఆగ్రహంతో బదులిచ్చారని చెప్పారు. వైస్‌చైర్మన్‌ను కలిసేందుకు ప్రయత్నించగా.. లోనికి కూడా అనుమతించలేదని సమాచారం. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, అదనపు ఫీజులపై విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.