పెంట్ హౌస్ ఒక్కటి రూ 62కోట్లకు అమ్ముడుపోవడం అశ్చర్యమే మరి. ఇలాంటి అశ్చర్యానికి ఇప్పుడు హైదరాబాద్ నగరం వేదికైంది. హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ కు ఇది కొత్త క్రేజ్ ను తెచ్చిపెడుతుంది. నగరంలోని పశ్చిమ భాగం కోకాపేట్ లో గోల్డెన్ మైల్ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న ట్రంప్ టవర్స్ ప్రాజెక్టులోని బహుళ అంతస్తుల అపార్ట్ మెంట్ పెంట్ హౌస్ ఏకంగా రూ.62 కోట్లకు విక్రయం జరగడం ఇప్పుడు ఐటీ బొకే, వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టవర్స్ లో మొత్తం 18 పెంట్ హౌస్ లు నిర్మిస్తుండగా..ఇందులో ఇప్పటికే 8 పెంట్ హౌస్ లను రూ. 250కోట్లకు విక్రయించారు. ఒక్కోటి రూ. 62కోట్లకు విక్రయించాగా..హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ వ్యాపార కుటుంబం దాదాపు 30 వేల చదరపు అడుగుల వైశాల్యం కలిగిన ఎనిమిది అపార్ట్‌మెంట్లను ఒకే పెంట్‌హౌస్‌గా మార్చుకుని ఈ కొనుగోలు చేయడం విశేషం.
హైదరాబాద్ రియల్ రంగంలోకి ట్రంప్ బ్రాండ్
అమెరికాకు చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్ ఇప్పుడు కోకాపేటలో లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టుతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లోకి గ్రాండ్ ఏంట్రీ ఇచ్చింది. భారత్ లో ఇది ఎనిమిదవ ట్రంప్ బ్రాండెడ్ ప్రాజెక్టు కాగా..దక్షిణ భారత్ లో ఇదే మొదటిది. ముంబై, పూణే, గురుగ్రామ్, నోయిడా, కోల్ కతాల తర్వాత హైదరాబాద్ లో ఇరా రియల్టీతో కిసలి ట్రంప్ టవర్స్ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతుంది. కోకాపేట్ గోల్డ్ మైన్ రోడ్డులో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఒక్కోటి 65అంతస్తులతో మొత్తం రెండు టవర్లను నిర్మిస్తుంది. 25లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ది చేస్తున్న ఈ టవర్స్ లో మొత్తం 16 పెంట్ హౌస్ లతో పాటు 450 అపార్ట్ మెంట్ లను నిర్మిస్తున్నారు.
పెట్టుబడి రూ. 2వేల కోట్లు..రాబడి 4వేల కోట్లపైనే
ట్రంప్ టవర్స్ నిర్మాణానికి భూమి ధరను మినహాయించి రూ. 18,00నుంచి 2వేల కోట్ల మేరకు పెట్టుబడి పెడుతున్నారు. ప్లాట్ల విక్రయంతో రూ.4,200కోట్ల మేరకు వస్తాయని ప్రాజెక్టు ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ టవర్స్ లో ఒక్కో ప్లాట్కు 3,4,5 బీహెచ్ కే ప్లాట్ల ధరలు రూ. 5కోటల నుంచి రూ.10కోట్ల మధ్య ఉన్నాయని ట్రెబెకా డెవలపర్స్ ఆర్గనైజర్ కల్పేష్ మోహతా, ఇరా రియల్టీ వ్యవస్థాపకుడు నర్సిరెడ్డిలు వెల్లడించారు. ఇప్పటికే కస్టమర్ల నుంచి మంచి డిమాండ్ వస్తుందని, కొన్ని బుకింగ్స్ కూడా వచ్చాయని చెబుతున్నారు. రెండు 65 అంతస్తుల స్కైస్క్రేపర్ టవర్లు, 450 అపార్ట్‌మెంట్లు, 16 అత్యంత విలాసవంతమైన పెంట్‌హౌస్‌లు ఇందులో ఉండనున్నాయి. ఇక్కడ ఒక్కో అపార్ట్‌మెంట్ ప్రారంభ ధర రూ. 5 కోట్లుగా నిర్ణయించగా.. అధికారిక ప్రారంభోత్సవానికి ముందే ఎనిమిది పెంట్‌హౌస్‌ల ద్వారా ఏకంగా రూ. 250 కోట్ల విలువైన ప్రీ-లాంచ్ బుకింగ్స్ జరిగినట్లు డెవలపర్లు స్పష్టం చేశారు.
హైదరాబాద్ రియల్ రంగానికి ట్రంప్ టవర్స్ టానిక్..
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి ‘ట్రంప్ టవర్స్’ తెచ్చిన కొత్త క్రేజ్.. రాబోయే రోజుల్లో ఇతర బిల్డర్లను కూడా కేవలం ధరల విషయంలోనే కాకుండా బ్రాండ్ అనుభవం, లగ్జరీ జీవనశైలి సౌకర్యాల కల్పనలో పోటీ పడేలా ప్రోత్సహించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచస్థాయి లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను కేంద్రంగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సాధారణ రెసిడెన్షియల్ విభాగంలో స్థిరీకరణను చూస్తున్నప్పటికీ, ప్రీమియం, అల్ట్రా-లగ్జరీ విభాగంలో మాత్రం డిమాండ్ కొనసాగుతుంది. మౌలిక వసతుల విస్తరణ, ఔటర్ రింగ్ రోడ్ (ORR) అనుసంధానం, నగరంలో పెరుగుతున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, కొత్త ఐటీ ప్రాజెక్టుల రాక వల్ల పశ్చిమ హైదరాబాద్ మార్కెట్ నిలకడగా రాణిస్తోందనడానికి ట్రంప్ టవర్స్ నిదర్శనం.
విస్తరిస్తున్న వరల్డ్ క్లాస్ లగ్జరీ ప్లాట్ ల కల్చర్
గత కొన్నేళ్లుగా కోకాపేట్, నియోపోలిస్, గచ్చిబౌలి పరిసర ప్రాంతాలు హైదరాబాద్‌కే ప్రతిష్టాత్మక నివాస ప్రాంతాలుగా విరాజిల్లుతున్నాయి. గతంలో ఓపెన్ ప్లాట్ల హెచ్ఎండిఏ (HMDA) ఇ-వేలంలో ఎకరం ధర రూ. 100 కోట్ల మార్కును దాటి రికార్డు సృష్టించిన నియోపోలిస్ పరిధిలోనే.. ఇప్పుడు అల్ట్రా-లగ్జరీ ఆకాశహర్మ్యాల నిర్మాణాలు ఊపందుకున్నాయి. రాయదుర్గం (పాన్‌మక్తా) ఐటీ కారిడార్‌లో ఇటీవల ఎకరం రూ. 270కోట్లు పలుకగా..ఇక్కడ కూడా బహుళ అంతస్తుల భవనాలు రాబోతున్నాయి. మోకిలాలో సైతం చదరపు గజం ధర గరిష్ఠంగా రూ.1.05 లక్షలు పలికిన సంగతి తెలిసిందే. గ్లోబల్ బ్రాండ్ వాల్యూ, ప్రైవసీ, ప్రైవేట్ క్లబ్ హౌస్‌లు, హెలిప్యాడ్‌లు, వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్చర్‌ను కోరుకునే హై-నెట్-వర్త్ ఇండివిజువల్స్ కోసం స్థానిక డెవలపర్లు కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రాజెక్టులను వేగంగా అందుబాటులోకి తెస్తుండటంతో హైదరాబాద్ నగరం క్రేజ్ ను కూడా పెంచుతుందంటున్నారు నిపుణులు.
