తెలంగాణలోని అటవీ ప్రాంతాలు..అభయారణ్యాలలోనే కాకుండా..రాజధాని హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూ పార్కులో సైతం వన్యప్రాణుల సంతతి పెరగడం సానుకూల పరిణామంగా కనిపిస్తుంది. నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో వరుస విజయవంతమైన బ్రీడింగ్ కార్యక్రమాల ద్వారా గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు వివిధ జాతులకు చెందిన 90కి పైగా కొత్త జంతువులు జన్మించాయి. వీటిలో 6 సింహం కూనలు, 6 బెంగాల్ పులి పిల్లలు, 18కి పైగా మౌస్ డీర్, ఆస్ట్రిచ్, నక్క, గోల్డెన్ ఫీజెంట్ పిల్లలు ఉన్నాయి. శాస్త్రీయ బ్రీడింగ్‌తో జూలో సింహాల సంఖ్య 23కు చేరింది. 2010 నుంచి ఇప్పటివరకు ఇక్కడ పుట్టిన సుమారు 500కుపైగా మౌస్ డీర్‌లను అమ్రాబాద్, కవాల్ వంటి టైగర్ రిజర్వ్‌లకు ఇచ్చినట్లుగా జూ పార్కు క్యూరేటర్ జె.వసంత తెలిపారు. జంతు సంరక్షణ, శాస్త్రీయ బ్రీడింగ్ కార్యక్రమాల ఫలితంగానే ఈ సంతానోత్పత్తి విజయాలు సాధ్యమవుతున్నాయని వెల్లడించారు.
వన్యప్రాణుల కొత్త సంతతితో జూలో సందడి నెలకొంది. జన్యుపరమైన వైవిధ్యాన్ని కాపాడేందుకు దేశంలోని ఇతర జూల్లోని జంతువుల పరస్పర మార్పిడి ద్వారా సింహాల సంతానోత్పత్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇతర జాతుల్లో కూడా సంతానోత్పత్తి ఆశాజనకంగా కొనసాగుతోంది. ఇటీవలకాలంలో జూలో కొత్తగా ఆరు సింహం కూనలు జన్మించడం అత్యంత విశేషమైన పరిణామంగా జూ పార్కు నిర్వాహకులు చెబుతున్నారు. వీటిలో మూడు ఆఫ్రికన్ సింహాలు, మూడు ఆసియన్ సింహాలు ఉన్నాయి. వీటిని జూ పశువైద్య బృందం నిరంతరం ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం జూ పార్కులో మొత్తం 17 సింహాలు(5 ఆఫ్రికన్, 12 ఆసియన్) ఉన్నాయి. కొత్త కూనలతో కలిపి వాటి సంఖ్య 23కు పెరిగింది.
గతేడాది నుంచి ఆరు బెంగాల్ పులి పిల్లలు జన్మించగా అందులో 3 తెల్లవి, 3 పసుపు చారలవి ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం 10 బెంగాల్ పులులు, 10 తెల్ల పులులు ఉన్నాయి. గతేడాది నుంచి 18పైగా మౌస్ డీర్, 8 కృష్ణజింక, 2 హాగ్ డీర్ పిల్లలు జన్మించాయి. గత మూడు నెలల్లో నాలుగు ఆస్ట్రిచ్, మూడు నక్క, రెండు గోల్డెన్ ఫీజెంట్(రెయిన్‌బో నెమలి) పిల్లలు జన్మించాయి. అలాగే ఒక చౌసింఘా(నాలుగు కొమ్ముల జింక), ఒక సాంబార్ జింక పిల్ల పుట్టాయి. అంతరించిపోతున్న మౌస్ డీర్ జాతి సంరక్షణలో హైదరాబాద్ జూ పార్కు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
