విధాత, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామంలో 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా బుధవారం కాపాడింది. దీని విలువ రూ. 90 కోట్లకు పైగా ఉంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. సర్వే నంబర్ 626/2లో మొత్తం 176.05 ఎకరాల ప్రభుత్వ భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉంది. అటవీ అభివృద్ధి సంస్థకు 166 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఇంకా అక్కడ 9.05 ఎకరాల ప్రభుత్వ భూమి మిగిలింది. ఖస్రా పహాణీ( గ్రామ పాత రికార్డుల) ప్రకారం మొత్తం 176.05 ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదైంది. ఇందులోని 9.05 ఎకరాలను సీఎస్ 14 (నిజాంలకు చెందిన) భూములుగా పేర్కొంటూ కొంతమంది హక్కులు క్లైమ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
మొత్తానికి ఈ వివాదం హైకోర్టులో పెండింగ్ ఉంది. తుది తీర్పు వచ్చే వరకూ ఈ భూమి స్వరూపాన్ని మార్చరాదని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు స్టే ఇచ్చింది. స్టేటస్ కో ఆర్డర్‌ను పట్టించుకోకుండా.. తజమ్ముల్ మొయినుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి ఆ భూమిని చదును చేసి లే ఔట్‌గా మార్చినట్టు రంగరెడ్డి కలెక్టర్‌తో పాటు.. శంషాబాద్ మున్సిపల్ అధికారులకు ప్రజావాణిలో ఫిర్యాదులందాయి. క్షేత్ర స్థాయిలో పరిశీలించగా.. తజమ్ముల్ మొయినుద్దీన్ ఖాన్ 9.05 ఎకరాల భూమిని చదును చేసి.. ప్రీకాస్ట్ గోడల ద్వారా ఆక్రమించినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. భూ ఆక్రమణ చట్టం 1905 ప్రకారం ఆక్రమణలను తొలగించాలని మొయినుద్దీన్‌కు సూచించారు. ఇవేవీ పట్టించుకోకుండా.. అక్కడ కొన్ని ఇంటి స్థలాలు అమ్ముకున్నట్టు కూడా తెలుసుకున్నారు.
రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇదే విషయాన్ని హైడ్రాకు చెబుతూ.. ఆక్రమణలు తొలగించాలని లేఖ రాశారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల ఫిర్యాదుతో బుధవారం హైడ్రా ఈ ఆపరేషన్ చేపట్టి.. 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించింది. చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది.
ఇవి కూడా చదవండి :
మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత
నటుడు పార్దీబన్ కు ‘నో కాస్ట్ – నో రిలీజియన్’ సర్టిఫికేట్..హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
