HYDRAA action | కొండాపూర్‌లో రూ.3,600 కోట్ల ప్రభుత్వ భూమిని రక్షించిన హైడ్రా

హైదరాబాద్‌ కొండాపూర్‌లో రూ.3,600 కోట్ల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు రక్షించారు. హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను కూల్చివేశారు.

HYDRAA action | కొండాపూర్‌లో రూ.3,600 కోట్ల ప్రభుత్వ భూమిని రక్షించిన హైడ్రా

HYDRAA Demolitions Save ₹3,600 Crore Govt Land in Kondapur, Shock to Encroachers

(విధాత సిటీ బ్యూరో) హైదరాబాద్​, అక్టోబర్​ 4:

హైదరాబాద్‌లో హైడ్రా మరోసారి తన దూకుడు చూపించింది. శేరిలింగంపల్లి మండలంలోని కొండాపూర్‌లో రూ.3,600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి రక్షిస్తూ భారీ కూల్చివేతల ఆపరేషన్‌ చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్‌ పకడ్బందీగా అమలు చేసారు. సర్వే నంబర్‌ 59లో ఉన్న 36 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంతమంది వ్యక్తులు తాత్కాలిక షెడ్లు వేసి వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు.

ఆర్టీఏ కార్యాలయం పక్కనే ఉన్న భిక్షపతి నగర్‌ ప్రాంతంలో ఉదయం నుంచే కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. జేసీబీలు, బుల్డోజర్లు సహా భారీ యంత్రాలు రంగంలోకి వచ్చాయి. ఆ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు రెండు కిలోమీటర్ల పరిధిలో కారిడార్లు ఏర్పాటు చేసి స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. తాత్కాలికంగా నిర్మించిన షెడ్లు, సిమెంట్ నిర్మాణాలను కూల్చివేసి ఆ స్థలాన్ని ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నారు. చుట్టూ కంచె వేసి ‘ఇది ప్రభుత్వ భూమి’ అనే బోర్డులు ఏర్పాటు చేశారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ 36 ఎకరాల భూమి మార్కెట్ విలువ దాదాపు రూ.3,600 కోట్లు. కొండాపూర్‌ వంటి ప్రధాన రియల్ ఎస్టేట్ ప్రాంతంలో ఇంత పెద్ద స్థలాన్ని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి రావడం చాలా పెద్ద విజయమని అధికారులు హర్షం వ్యక్తం చేసారు. ఈ భూమి గత 60 ఏళ్లుగా తమ అధీనంలో ఉందని కొంతమంది రైతులు చెబుతున్నప్పటికీ, హైకోర్టు తీర్పు ఆధారంగా హైడ్రా అధికారులు చర్యలు చేపట్టడంతో ఆ భూమిపై ప్రభుత్వానికి చట్టపరమైన అధికారం లభించింది. అయినప్పటికీ రైతుల ఈ వాదన భవిష్యత్తులో చట్టపరమైన సవాళ్లకు దారితీసే అవకాశం ఉందని న్యాయవర్గాలు అంటున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ భూముల రక్షణకు హైడ్రా యూనిట్‌ను మరింత బలోపేతం చేసింది. వివాదాస్పద భూములు, ఆక్రమణలు, కబ్జాలకు సంబంధించిన కేసుల్లో హైడ్రా విభాగం వేగంగా చర్యలు తీసుకుంటోంది. కొండాపూర్ ఆపరేషన్‌తో హైడ్రా మరోసారి దూకుడు చూపించింది. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తిని రక్షించడం ద్వారా హైడ్రా అధికారులు చట్టాన్ని అమలు చేయడమే కాకుండా భూ కబ్జాదారులకు కఠినమైన హెచ్చరిక పంపారు.