Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల: నవంబర్ 11న పోలింగ్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదల కాగా, నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న కౌంటింగ్ జరుగుతుంది.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. సోమవారం నాడు న్యూఢిల్లీలోని ఈసీఐ ప్రధాన కార్యాలయంలో భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఈ ఏడాది జూన్ 8న కన్నుమూశారు. దీంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ తరపున గోపినాథ్ సతీమణి మాగంటి సునీతను బీఆర్ఎస్ తన అభ్యర్ధిగా ప్రకటించింది. గులాబీ పార్టీ నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించింది. ఇక ముగ్గురి పేర్లతో కాంగ్రెస్ పార్టీ ఆశావాహుల పేర్లను ఎఐసీసీకి పంపింది. నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్ పేర్లు ఈ షార్ట్ లిస్టులో ఉన్నాయని సమాచారం. ఇక కమలం పార్టీ అభ్యర్ధి ఎంపిక కోసం త్రిమెన్ కమిటీని ఏర్పాటు చేసింది. స్థానికంగా ఉన్న పార్టీ క్యాడర్ అభిప్రాయాలను క్రోడీకరించి అధిష్టానానికి ఈ త్రిమెన్ కమిటీ అభ్యర్థి పేరును సూచిస్తోంది. లంకల దీపక్ రెడ్డి, ఎ. విజయ, కీర్తిరెడ్డి తదితరులు బీజేపీ టికెట్టు కోసం పోటీపడుతున్నారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 3,92,669 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2,04,228 మంది, 1,88,356 మంది మహిళా ఓటర్లు. 25 మంది ట్రాన్స్ జెండర్లు. నియోజకవర్గంలో కొత్తగా ఓటు హక్కు నమోదు కోసం ధరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఈ నెల 29 వరకు అభ్యంతరాలు, కొత్త ధరఖాస్తుల స్వీకరణకు గడువు విధించారు. ఈ నెల 30న జూబ్లీహిల్స్ ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 13
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 13
నామినేషన్ల దాఖలుకు చివరి తేది: అక్టోబర్ 21
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 22
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది: అక్టోబర్ 24
పోలింగ్ తేది: నవంబర్ 11
కౌంటింగ్ తేది: నవంబర్ 14