TPCC Chief Mahesh Kumar Goud : ప్రభుత్వానికి ఢోకా లేదు

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకా లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగుతారని తెలిపారు.

TPCC Chief Mahesh Kumar Goud : ప్రభుత్వానికి ఢోకా లేదు

విధాత, హైదరాబాద్ : రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనతో ప్రజలు సంతృప్తి గా ఉన్నారని, మరోసారి ప్రభుత్వంలో మేమే ఉంటామని..కాంగ్రెస్ పార్టీకి ఢోకా లేదు, రేవంత్ రెడ్డి సీఎంగా, డిప్యూటీ సీఎంగా భట్టి, నేను పీసీసీ చీఫ్ గానే ఉంటాం అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం గాంధీభవన్ లో ఆయన మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి మెజార్టీతో గెలవబోతుందన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా కార్యకర్తలు ఇచ్చిన సమాచారం నమ్ముకున్నాం అని, డోర్ టు డోర్ తిరిగి కష్ట పడ్డ కార్యకర్తల నుండి సమాచారం తీసుకున్నాం అని, మంచి మెజారిటీ తో గెలుస్తున్నాం అని కార్యకర్తలు సమాచారం ఇచ్చారని తెలిపారు.

క్యాబినెట్ విస్తరణ అనేది ఏఐసీసీ , సీఎం రేవంత్ రెడ్డి కలిసి తీసుకునే నిర్ణయం అని, మంత్రి వర్గం నా పరిధిలో ఉన్న అంశం కాదు అని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. నాకు డిప్యూటీ సీఎం పదవి అని పేపర్లో చూశానన్నారు. డిప్యూటీ సీఎం పదవిపై నాకు ఆశ లేదు అని, నేను పీసీసీ అధ్యక్షుడిగా సంతృప్తిగా ఉన్నానని, రాబోయే ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ గానే కష్టపడి పని చేసి పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం అని తెలిపారు. జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్టడీ చేస్తాం అని, ఏఐసీసీ పెద్దలతో మాట్లాడి ముందుకెలుతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం అనేది మా ప్రభుత్వం ప్రాధాన్యత అంశమని తెలిపారు.

ఈ సందర్బంగా గాంధీజీ విగ్రహాల సేకరణ కార్యక్రమ ప్రచార రథాన్ని మహేష్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్ స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రపంచంలోనే ఎత్తైన గాంధీజీ విగ్రహ ఏర్పాటు కోసం తెలంగాణ కాంగ్రెస్ లక్ష గాంధీజీ విగ్రహాల సేకరణ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.