Hyderabad : రోడ్డు ప్రమాదాలపై యమధర్మరాజు ప్రచారం..వైరల్

రోడ్డు ప్రమాదాలపై అవగాహన కోసం యమధర్మరాజు గెటప్‌లో వ్యక్తి రోడ్డుపై ప్రత్యక్షమై హెల్మెట్ వినియోగం సహా ట్రాఫిక్ నియమాలు పాటించాలని ప్రజలకు హితవు పలికాడు.

Hyderabad : రోడ్డు ప్రమాదాలపై యమధర్మరాజు ప్రచారం..వైరల్

విధాత: ప్రాణాలు తీసుకెళ్లే యమధర్మరాజునే భూమిపైకి వచ్చి మీ ప్రాణాలు జాగ్రత్తరా నాయనా..! అంటూ రోడ్డు ప్రమాదాలపైన..రోడ్డు భద్రతపైన ప్రజలను అప్రమత్తం చేసిన ఘటన వైరల్ గా మారింది. అయితే ఇక్కడ ట్విస్టు ఏమిటంటే..నరకలోకం నుంచి యమధర్మరాజు భూలోకానికి స్వయంగా రాలేదుగాని..యముడి భీకర వేషధారణతో..నెత్తిన కిరీటం..ఓ చేతిలో గదా..మరోచేతిలో యమపాశంతో ఉన్న ఓ వ్యక్తి రోడ్డుపైన వెలుతున్న వాహనదారులను కలిసి..రోడ్డు భద్రతపై హిత వచనాలు చెప్పాడు. ‘ఒక తల పోతే ఇంకో తల రాదు’ అంటూ హెల్మెట్‌ వినియోగంపై యమధర్మరాజు వాహనదారులకు జాగ్రత్తలు తెలియచేశాడు. రోడ్డు ప్రమాదాల నివారణకు దూరంగా ఉండాలని హితబోధ చేశాడు.

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం కోసం కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రి చైర్మన్ డా.గురువారెడ్డి ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుధవారం రసూల్‌పుర సిటీ జంక్షన్ వద్ద యమధర్మరాజు వేషధారణలో ఉన్న వ్యక్తి చేత వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై కీలక సూచనలు చేయించారు.

ఈ సందర్భంగా గురువారెడ్డి మాట్లాడుతూ..ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే ప్రాణాలు కోల్పోతారని, కొత్త తరహా విధానంతో యమధర్మరాజు గెటప్ లో ప్రజల్లో మరింత అవగాహన పెంచే ప్రయత్నం చేశామని తెలిపారు. హెల్మెట్ లేకుండా నడపడం, తాగినడపడం, రాష్ డ్రైవింగ్ వంటి సప్త వ్యసనాలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయని, వాటికి దూరంగా ఉండి ప్రజలు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని, యమపురికి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రచారం చేశామని వెల్లడించారు. ఇండియాలో ప్రతి 3నిమిషాలకు ఓ రోడ్డు ప్రమాదం జరుగుతుందని, ప్రపంచంలోని 100వాహనాల్లో ఒక వాహనం ఇండియా భాగస్వామ్యంగా ఉంటే..రోడ్డు ప్రమాదాల్లో మాత్రం 16శాతం భాగస్వామ్యంగా ఉందన్నారు.

అమెరికాలో మనకంటే నాలుగుశాతం ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, అయితే రోడ్డు ప్రమాద మరణాలు అక్కడి కంటే నాలుగు శాతం ఎక్కువ ఇండియాలోనే జరుగుతున్నాయని తెలిపారు. అందుకే ప్రజలు రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండి..ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించి, రోడ్డు భద్రత నియమాలను అనుసరించాలని, ప్రమాదాలకు దూరంగా ఉండాలని కోరుతున్నామన్నారు.

ఇవి కూడా చదవండి :

ACB raids| రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు
police websites hacked| పోలీసులకు మరో సవాల్..కమిషనరేట్ల వైబ్ సైట్ల హ్యాకింగ్!