Ponguleti Srinivas : ఏప్రిల్ నుంచి రెండో విడ‌త ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు

ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రారంభమవుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. అర్బన్ హౌసింగ్ పాలసీ కూడా త్వరలోనే అమలులోకి రానుంది.

Ponguleti Srinivas : ఏప్రిల్ నుంచి రెండో విడ‌త ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు

విధాత, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నుంచి రెండో విడ‌త ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ప్రక్రియ చేపడుతామని..ఇప్పటికే మంత్రివర్గం దీనిపై నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. స‌చివాల‌యంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ఏర్పాటు మీడియా సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కంలో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 4 ల‌క్ష‌ల ఇండ్ల‌ను మంజూరు చేశామని తెలిపారు. 3 ల‌క్ష‌ల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని..వచ్చే ఏడాది మార్చి నాటికి ల‌క్ష, జూన్ కు మ‌రో రెండు ల‌క్ష‌ల గృహ ప్ర‌వేశాలు జ‌రుగనున్నాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా శరవేగంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం జరుగుతుందన్నారు.

త్వ‌ర‌లో అర్బ‌న్ హౌసింగ్ పాల‌సీ

రాష్ట్రంలోని జీహెచ్ఎంసీతో స‌హా అన్ని ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో పేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరుకు ప్ర‌ణాళిక సిద్ద‌మైందని.. జి ప్ల‌స్ త్రీ ప‌ద్ద‌తిలో నిర్మించే గృహాల కోసం అతి కొద్ది రోజుల్లో ఇందిర‌మ్మ అర్బ‌న్ హౌసింగ్ పాల‌సీని ప్రకటించబోతున్నామని పొంగులేటి తెలిపారు. దీనికోసం ఓఆర్ఆర్ చుట్టూ నాలుగు స్థలాలను గుర్తించాం. ఒక్కో చోట 8 నుంచి 10 వేల ఇండ్లు నిర్మించే ప్రతిపాదన ఉందన్నారు. గ‌త కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూక‌ట్ ప‌ల్లి హౌసింగ్ బోర్డు ప‌రిధిలో నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటిని తొల‌గించి హైరైజ్ అపార్ట్‌మెంట్‌ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాల‌న్న ఆలోచ‌న చేస్తున్నాం అని తెలిపారు. గ‌త ప్ర‌భుత్వం అసంపూర్తిగా వ‌దిలేసిన 2BHK ఇండ్ల నిర్మాణాన్ని 700 కోట్ల రూపాయిల‌తో పూర్తి చేశాం. 200 కోట్ల రూపాయిల‌తో ఆయా కాల‌నీకు మౌళిక వ‌స‌తులు క‌ల్పించాం అని వెల్లడించారు. హౌసింగ్ బోర్డు ప‌రిధిలో లీజుకు తీసుకున్నలేదా కబ్జా అయిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇప్ప‌టికే వెయ్యి ఎక‌రాల భూమికి చుట్టూ ప్ర‌హారీ నిర్మించాం అని తెలిపారు. గృహ జ్యోతి ప‌ధ‌కంతో పాటు గ‌తంలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించి మ‌ధ్య‌లోనే వ‌దిలేసిన సుమారు 15 వేల మందికి కొత్త ప‌ధ‌కం వ‌ర్తించేలా క్యాబినెట్ లో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాం అని తెలిపారు.

ఇళ్ల నిర్మాణంలో అవకతవకలపై చర్యలు

గ‌త ప్ర‌భుత్వం గృహ నిర్మాణ శాఖ‌ను పూర్తిగా ర‌ద్దు చేస్తే పేద‌ల‌కు పక్కా ఇండ్లు నిర్మించాల‌న్న ఆలోచ‌న‌తో తిరిగి గృహ నిర్మాణ శాఖ‌ను పున‌రుద్ద‌రించాం అని, దీనికోసం 394 మంది డీఈఈల‌ను వెన‌క్కి ర‌ప్పించి 800 మంది ఏఈల‌ను కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిలో తీసుకున్నామని పొంగులేటి గుర్తు చేశారు. వివిధ శాఖ‌ల నుంచి 152 , రెవెన్యూ శాఖ నుంచి 32 మందిని డిప్యూటేష‌న్‌పై తీసుకుని వ్యవస్థను పటిష్టం చేశాం అని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అనేది నిరంతరం కొనసాగే ప్రకియ. అర్హులైన పేదలందరికి ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని, ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కం అమలులో చేతివాటం చూపిన 9 మంది పంచాయితీరాజ్ కార్య‌ద‌ర్శుల‌ను స‌స్పెండ్ చేశాం అన్నారు. మ‌రో ఇద్ద‌రిని స‌ర్వీసు నుంచి తొల‌గించ‌డం జ‌రిగిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Two Years of Congress Rule | ఏలుబడిలో ఎవరున్నా.. ఎక్కడి భూ సమస్యలు అక్కడే!
Hyderabad : అత్మహత్య యత్నం చేసుకున్న సాయి ఈశ్వర్ మృతి