Revanth Reddy : ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతైనా ఖర్చు పెడుతాం

ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ఎంతైనా ఖర్చు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం. విద్యార్థుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తూ కొత్త భవనాలు, హాస్టళ్లు నిర్మాణం దిశగా చర్యలు.

Revanth Reddy : ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతైనా ఖర్చు పెడుతాం

విధాత, హైదరాబాద్ : ఉస్మానియా యూనివ‌ర్సిటీ అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించి ఎంత మొత్త‌మైనా ఖ‌ర్చు చేసేందుకు వెనుకాడ‌మ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. యూనివ‌ర్సిటీలో (ఓయూ) చేప‌ట్ట‌నున్న అభివృద్ధి ప‌నుల్లో విద్యార్థులు, బోధ‌న సిబ్బంది అభిప్రాయాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సూచించారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీని ఈ నెల 10వ తేదీన సంద‌ర్శించనున్న‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అక‌డ‌మిక్ బ్లాక్‌లు, హాస్ట‌ళ్ల‌ను ప‌రిశీలిస్తాన‌ని సీఎం తెలిపారు. ఓయూ అభివృద్ధి ప‌నుల‌పై త‌న నివాసంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీలో చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌నుల‌పై తొలుత అధికారులు సీఎంకు వివ‌రించారు. అనంత‌రం ప‌నుల‌కు సంబంధించిన వివిధ మోడ‌ళ్ల ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్స్‌ను సీఎం వీక్షించారు.

హాస్ట‌ల్ భ‌వ‌నాలు, ర‌హ‌దారులు, అక‌డ‌మిక్ బ్లాక్స్‌, ఆడిటోరియం నిర్మాణాల‌కు సంబంధించి ప‌లు మార్పులు చేర్పుల‌ను సీఎం సూచించారు. యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని అట‌వీ ప్రాంతంలో ప‌నుల‌కు అర్బ‌న్ ఫారెస్ట్రీ నిధులు వినియోగించే అంశాన్ని ప‌రిశీలించాల‌ని అధికారుల‌ను సీఎం సూచించారు. యూనివ‌ర్సిటీ ప‌రిధిలో ఇప్ప‌టికే ఉన్న జ‌ల వ‌న‌రుల‌ను సంర‌క్షిస్తూనే నూత‌న జ‌ల వ‌న‌రుల ఏర్పాటుకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని సీఎం సూచించారు. హాస్ట‌ల్‌, అక‌డ‌మిక్ భ‌వ‌నాల నిర్మాణం విష‌యంలో వంద మంది విద్యార్థులుంటే అద‌నంగా మ‌రో ప‌ది శాతం విద్యార్థుల‌కు వ‌స‌తులు ఉండేలా చూడాల‌ని సీఎం తెలిపారు. విద్యార్థులు, సిబ్బంది భ‌విష్య‌త్తులోనూ ఎటువంటి అసౌక‌ర్యానికి గురికాకుండా నిర్మాణాలు ఉండాల‌ని సీఎం అన్నారు.

పాత భవనాల మరమ్మతులు..నూతన భవనాల నిర్మాణాలు

యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని చారిత్ర‌క, వార‌స‌త్వ భ‌వ‌నాల‌ను సంర‌క్షించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. చారిత్ర‌క ప్రాధాన్యం లేని పురాత‌న‌ భ‌వ‌నాల‌కు భారీ మొత్తాలు వెచ్చించి మ‌ర‌మ్మ‌తుల‌కు చేసే బ‌దులు నూత‌న భ‌వ‌నాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీఎం సూచించారు. సైకిల్ ట్రాక్‌లు, వాకింగ్ పాత్‌లతో పాటు ప్ర‌తి ప‌నిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టాల‌ని సీఎం తెలిపారు. ఉస్మానియా విద్యార్థుల పోరాట ప్ర‌తిమ‌ను ప్ర‌తిబింబించే చిహ్నాలు ఏర్పాటు చేయాల‌ని సీఎం సూచించారు.

యూనివ‌ర్సిటీ అభివృద్ది ప‌నుల‌కు సంబంధించి విద్యార్థులు, బోధ‌నా సిబ్బంది అభిప్రాయాలు స్వీక‌రించాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. తొలుత అభివృద్ధి న‌మూనాలు వారి ముందు ఉంచాల‌ని.. త‌ర్వాత వారి అభిప్రాయాలు తెలిపేందుకు డ్రాప్ బాక్స్‌లు ఏర్పాటు చేయ‌డంతో పాటు ప్ర‌త్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయాల‌ని సీఎం సూచించారు. వారి అభిప్రాయాల‌కు ప్రాధాన్య‌మిస్తూ ఈ నెలాఖ‌రు నాటికి అభివృద్ధి ప్ర‌ణాళిక‌ల‌పై తుది నిర్ణ‌యం ఖ‌రారు కావాల‌ని సీఎం తెలిపారు. స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేశ‌వ‌రావు, సీఎం ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, విద్యా శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ క‌మిష‌న‌ర్ శ్రీ‌దేవ‌సేన‌, ఉస్మానియా విశ్వ విద్యాల‌యం వైస్ ఛాన్స‌ల‌ర్ ప్రొఫెస‌ర్ మొలుగారం కుమార్‌, ఆర్ట్స్ క‌ళాశాల ప్రిన్సిప‌ల్ ప్రొఫెస‌ర్ కాశీం త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

Akhanda 2 postpone: ఆర్థిక సమస్యలతోనే..‘అఖండ 2’ వాయిదా: నిర్మాత సురేశ్ బాబు
UAE Celebrates 54th National Day : సూపర్ థ్రిల్లింగ్…యుఏఈ 54వ జాతీయ దినోత్సవం