Musi Beautification Project | మూసీ సుందరీకరణపై రేవంత్ సర్కార్ ఊరట!

మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్. పిటిషన్‌ను కొట్టివేయడంతో రేవంత్ ప్రభుత్వం ముందడుగు. రూ.50వేల కోట్ల ప్రాజెక్టుకు మార్గం సుగమం.

Musi beautification project

విధాత, హైదరాబాద్ : మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ భారీ ఊరట దక్కింది. మూసీ సుందరీకరణపై రేవంత్ ప్రభుత్వం వైఖరిపై అభ్యంతరాలు తెలుపుతూ బీఆర్ఎస్ నేత పి.కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కొట్టి వేసింది. దీంతో మూసీ సుందరీకరణ అంశంపై రేవంత్ ప్రభుత్వం ముందుకెళ్లేందుకు కీలక అడ్డంకి తొలగిపోయింది.ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని పటోళ్ల కార్తిక్ రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యూనల్ పిటిషనర్ తన వాదనలకు సంబంధించి ఎటువంటి సరైన సాంకేతిక లేదా శాస్త్రీయ ఆధారాలను సమర్పించలేదని ఎన్జీటీ పేర్కొంది. కేవలం అనుమానాలతో ప్రాజెక్టును అడ్డుకోలేమని, పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని ట్రిబ్యూనల్ అభిప్రాయాపడుతూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

మూసీ సుందరీకరణ ప్రాజెక్టును రేవంత్ ప్రభుత్వం రూ. 50వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టింది. హైదరాబాద్‌ మహా నగరం మధ్యలో మురుగుతో ప్రవహిస్తున్న మూసీని దశలవారీగా అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను తీసుకొచ్చింది. మూసీ అభివృద్ధికి తీసుకోనున్న చర్యలను తొలి డీపీఆర్‌లో సవివరంగా తెలియజేసింది. మూసీ, ఈసా నదుల సంగమం వద్ద గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. 55 కిలోమీటర్ల మేర మూసీ నదిని లండన్‌లోని థేమ్స్ నది తరహాలో సుందరీకరణ చేయాలని నిర్ణయించింది. గోదావరి నీటిని ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌కు అనుసంధానం చేసి, 2.5 టీఎంసీల నీటితో మూసీకి జీవం పోయాలని నిర్ణయించింది. సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవుల వద్ద ఒంకారేశ్వర ఆలయం, అలాగే మరోచోట భారీ మసీద్, గురుద్వార్, చర్చిల నిర్మాణం చేయాలని నిర్ణయించింది.నగరంలో ప్రవహించే 55 కిలోమీటర్ల పరిధిని ఐదు జోన్లుగా విభజించి.. ఏడు అంశాలతో నదిని పునరుజ్జీవం చేసేందుకు అవసరమైన ప్రణాళికలను ఆవిష్కరించింది. పర్యావరణానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. తొలి దశలో అభివృద్ధి పనులకు రూ.6500-7000 కోట్లు అవసరమని అంచనా వేసింది. భూసేకరణ ప్రక్రియలో టీడీఆర్‌ అమలు చేస్తామని ప్రకటించింది.

మొదటి జోన్‌గా ఉన్న 21 కిలోమీటర్ల మూసీ నది ప్రాంతాన్ని ఫేజ్‌-1 కింద అభివృద్ధి చేయనున్నారు. ఇందులో హిమాయత్‌ సాగర్‌ నుంచి బాపూ ఘాట్‌ వరకు, గండిపేట నుంచి బాపూ ఘాట్‌ వరకు గల ఈసా, మూసీ నదుల సంగమం వరకు అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు. మొదటి దశ మూసీ అభివృద్ధిలో పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ ఉండేందుకు ప్లాన్‌ చేశారు. మొదటి దశ సుందరీకరణ ప్రాజెక్టు ‘వి’ ఆకారంలో చేపట్టనున్నారు. ఇప్పటికే ఉన్న బ్రిడ్జిలను ఆధునికీకరించడంతో పాటు జోన్ ఒకటిలో కొత్తగా 9బ్రిడ్జీలు నిర్మించనున్నారు. గండిపేట నుంచి బాపూ ఘాట్‌ వరకు మూసీ నదిపై 8, హిమాయత్‌సాగర్‌ నుంచి బాపూ ఘాట్‌ వరకు ఈసా నదిపై 6 కలిపి మొత్తం 14 బ్రిడ్జిలు ఉంటాయి. 3-4 కిలోమీటర్ల మేర ఈసా, మూసీ నదుల్లో నీళ్లు నిలిచేందుకు ఆరు చెక్‌ డ్యామ్‌లను నిర్మించనున్నారు.

హిమాయత్‌ సాగర్‌ నుంచి బాపూ ఘాట్‌ వరకు 9.8 కిలోమీటర్ల ఈసా నది ప్రాంతాన్ని జోన్‌ 1ఏ కింద అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే పశ్చిమాన ఓఆర్‌ఆర్‌, కిస్మత్‌పుర, ఉప్పర్‌పల్లి బ్రిడ్జిలు ఉండగా.. కొత్తగా బుద్వేల్‌, గాంధీ సరోవర్‌ వద్ద, బాపూ ఘాట్‌ వద్ద బ్రిడ్జిలు నిర్మించనున్నారు.

గండిపేట నుంచి బాపూ ఘాట్‌ వరకు 11.2 కిలోమీటర్ల మూసీ ప్రాంతాన్ని జోన్‌1బీ కింద అభివృద్ధి చేయనున్నారు. కొత్తగా గండిపేట, గండిపేట గోశాల, నార్సింగి, బైరాగిగూడ, రాందేవ్‌గూడ, గాంధీ సరోవర్‌ వద్ద బ్రిడ్జిలు నిర్మించనున్నారు.

మూసీ పునరుజ్జీవంలో గోదావరి జలాలు

గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్టు ఫేజ్‌-2, 3లో భాగంగా మల్లన్నసాగర్‌ నుంచి 20 టీఎంసీలు నగరానికి తీసుకొస్తుండగా.. అందులో 17.5 టీఎంసీలను తాగునీటికి వినియోగించనున్నారు. మరో 2.5 టీఎంసీల నీటిని ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), హిమాయత్‌సాగర్‌లకు తరలించనున్నారు. అక్కడి నుంచి నీళ్లు విడుదల చేస్తే మూసీలో ప్రవహిస్తాయి. మూసీ నదిలో చుక్క మురుగు నీరు కూడా చేరకుండా 27 ట్రంక్‌లైన్లను నిర్మించనున్నారు. వీటిని ఎస్టీపీలకు మళ్లించడంతో మూసీలో మురుగునీరు కలవదు. స్వచ్ఛమైన గోదావరి జలాలను మూసీలో ప్రవహింపజేయవచ్చు. అందులో భాగంగా పశ్చిమాన ఔటర్‌ రింగ్‌ రోడ్డు (నార్సింగి) నుంచి తూర్పున ఔటర్‌ రింగ్‌ రోడ్డు (గౌరెల్లి)వరకు మూసీ వెంట ట్రంక్‌లైన్ల నిర్మాణానికి రూ.4700 కోట్లతో అంచనా వేశారు. ఇప్పటికే అమృత్‌ 2.0లో భాగంగా రోజూ 972 మిలియన్‌ లీటర్లను శుద్ధి చేసే 39ఎస్టీపీల పనులు ప్రారంభమయ్యాయి. ఈసా దిగువన అండర్‌గ్రౌండ్‌లో ఎస్టీపీ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

సంగమం వద్ద గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు..

మూసీ, ఈసా నదుల పవిత్ర సంగమం వద్ద మహాత్మాగాంధీ పేరుతో బాపూ ఘాట్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడే అంతర్జాతీయ ప్రమాణాలతో గాంధీ సరోవర్‌ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించింది. అత్యంత ఎత్తయిన (123 అడుగులు) గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి, ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దనుంది. ప్రస్తుతం 60 ఎకరాల్లో బాపూ ఘాట్‌ ఉండగా.. 200 ఎకరాల్లో గాంధీ సరోవర్‌ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది. గాంధీ విగ్రహం కింద 100 మీటర్లతో టవర్‌ రానుంది. అందులో హ్యాండ్‌లూమ్‌ శిక్షణ కేంద్రంతో పాటు ఎడ్యుకేషన్‌ అండ్‌ నాలెడ్జ్‌ హబ్‌, పబ్లిక్‌ రిక్రియేషన్‌ ప్రాంతం, మెడిటేషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ విలేజ్‌, నేషనల్‌ మ్యూజియంలను ఏర్పాటు చేస్తారు. గాంధీ మ్యూజియం, ఎత్తయిన టవర్‌పై నుంచి హైదరాబాద్‌ మహానగరాన్ని వీక్షించేలా ఫ్లాట్‌ఫాం నిర్మాణం. సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రత్యేక వేదికలు, పరిశోధన కేంద్రాలను నిర్మించనున్నారు.

తూర్పు-పశ్చిమ రవాణా కారిడార్‌..

హైదరాబాద్‌ మహా నగరం మీదుగా పశ్చిమం నుంచి తూర్పువైపు మూసీ ప్రవాహం సుమారు 55 కి.మీ. మేర ఉంటుంది. మూసీ నది నార్సింగి వద్ద, ఈసా నది రాజేంద్రనగర్‌-హిమాయత్‌సాగర్‌ల వద్ద రెండు ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌చేంజ్‌లు ఉన్నాయి. ఈ రెండు నదుల మీద పశ్చిమాన ఉన్న ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌చేంజ్‌ల నుంచి తూర్పున గౌరెల్లి వద్ద ఉన్న ఓఆర్‌ఆర్‌ వరకు మూసీ నది వెంబడి తూర్పు-పశ్చిమ రవాణా కారిడార్‌ నిర్మాణానికి ప్రణాళికను రూపొందించారు. ప్రస్తుతం వెస్ట్‌ హైదరాబాద్‌ నుంచి ఈస్ట్‌ హైదరాబాద్‌ వైపు వెళ్లాలంటే ఓఆర్‌ఆర్‌ మీదుగా దక్షిణం వైపు నుంచి 69 కి.మీ., ఉత్తరం వైపు నుంచి వెళితే 91 కి.మీ. ప్రయాణించాల్సి ఉంటుంది. ఈస్ట్‌-వెస్ట్‌ మొబిలిటీ కారిడార్‌ నిర్మాణం జరిగితే 43 కి.మీ. దూరంతోనే గౌరెల్లి చేరుకోవచ్చు. కారిడార్‌లో 6 వరసలతో రహదారి నిర్మిస్తారు. ఇటు విజయవాడ రహదారికి, మరోవైపు శంకర్‌పల్లి నుంచి బీజాపూర్‌ వెళ్లే రహదారికి అనుసంధానం కలగనుంది. మూసీ నదికి ఇరువైపులా ఐటీ కారిడార్‌తో పాటు మధ్యలో కోర్‌ సిటీ, పాతనగరం, ఎంజీబీఎస్‌, చాదర్‌ఘాట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, అంబర్‌పేట, ఉప్పల్‌, నాగోల్‌ ప్రాంతాల నుంచి సులభంగా ఈస్ట్‌ హైదరాబాద్‌ వైపు, లేదా వెస్ట్‌ హైదరాబాద్‌ వైపు రాకపోకలు సాగించేందుకు అవకాశం కలుగుతుంది.

మురిగునీరు శుద్దీకరణ

మూసీ నది సుందరీకరణలో భాగంగా మురుగు నీటిని శుద్ధి చేసే క్రమంలో వచ్చే గ్రే వాటర్‌ను నగరంలోని డేటాసెంటర్ల కోసం వినియోగించేలా డిజైన్‌ చేశారు. ఇందుకోసం అత్తాపూర్‌, అంబర్‌పేట, నాగోల్‌ ప్రాంతాల్లో భారీ బ్యాలెన్సింగ్‌ గ్రే వాటర్‌ రిజర్వాయర్లను నిర్మించనున్నారు.సీవరేజ్‌ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తయ్యే నీటిని ఇతర అవసరాలకు వాడుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఓఆర్‌ఆర్‌ చుట్టూ రింగ్‌బండ్‌ నిర్మించి శుద్ధి చేసిన మురుగు నీటిని రకరకాల అవసరాలకు వాడుకోనున్నారు.

ఇవి కూడా చదవండి :

Telangana Liquor Sales | ఖజనాకు మందు కిక్కు..తెలంగాణ ఎక్సైజ్ శాఖ సరికొత్త రికార్డు!
Water Glass | ఒక్క గ్లాస్ నీటితో రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులైపోవ‌చ్చు..! అదేలాగో తెలుసా..?

Latest News