కవిత టీఆర్ఎస్ పార్టీని ఈసీ అనుమతించదు: బీఆర్ఎస్ నేత పటోళ్ల
కవిత ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీ పేరును ఈసీ అనుమతించకపోవచ్చని బీఆర్ఎస్ నేత పటోళ్ల వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీ పేరు రిజిస్ట్రేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించకపోవచ్చని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ అనే పేరును కేంద్ర ఎన్నికల సంఘం 10ఏళ్ల పాటు ఫ్రీజ్ చేసిందని పటోళ్ల వెల్లడించారు.
ఈ నేపథ్యంలో టీఆర్ ఎస్ పేరును ఎవరు పెట్టుకోవడానికి వీల్లేదు అన్నారు. ఒకే పేరును మళ్ళీ వాడటం నిబంధనలకు విరుద్ధం అని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కవిత టీఆర్ఎస్ పార్టీ పేరును ఈసీ అనుమతించబోదని, ఆమె పార్టీ పేరు ఈసీ రిజిస్ట్రేషన్ జరిగి ఉండకపోవచ్చని పటోళ్ల కార్తీక్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇది కేవలం బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టడానికి చేసిన ఒక టాక్టిక్ మాత్రమే అయ్యిఉండవచ్చని, ఇప్పటికే నమోదు అయిన అన్ని రాజకీయ పార్టీలు ECI వెబ్‌సైట్‌లో ఉంటాయి అని, ఇప్పటివరకు కేవలం దరఖాస్తు (అప్లికేషన్) మాత్రమే చేసివుండొచ్చు అని పటోళ్ల పోస్టు చేశారు.
టీఆర్ఎస్ ఇప్పుడు ఫ్రీజ్ కాదు..ఫ్రీ : కవిత తాజా వ్యాఖ్యలు
అయితే కొన్ని రోజుల ముందు కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పేరు ఫ్రీ అయిందని.. ఇప్పుడు దాన్ని ఎవరైనా వాడుకోవచ్చని చేసిన కామెంట్లను కవిత పార్టీ కార్యకర్తలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
బీఆర్ఎస్ గా మారిన అసలు టీఆర్ఎస్
2001లో టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ఉద్యమ సాధనంగా కేసీఆర్ స్థాపించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ప్రభుత్వంగా టీఆర్ఎస్ పార్టీ 2014లో, తదుపరి 2018ల్లో వరుసగా అధికారంలోకి వచ్చింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 ఆక్టోబర్ 5న టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. 2022 డిసెంబరు 9న అధికారికంగా టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారింది. 2023 ఖమ్మంలో జనవరి 18న జరిగిన బీఆర్ఎస్ తొలి ఆవిర్భావ బహిరంగసభ నిర్వహించారు. దీంతో టీఆర్ఎస్ పేరు మనుగడలో లేకుండాపోయింది.2023 ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవానికి కారణం పార్టీ పేరు మార్పు కూడా ప్రధాన కారణం అన్న చర్చ బలంగా వినిపించింది. దీంతో తిరిగి బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్‌గా మార్చాలనే డిమాండ్లు కూడా గట్టిగానే వినిపించాయి. ఇంతలోనే కవిత తన పార్టీ పేరును టీఆర్ఎస్ గా ప్రకటించి బీఆర్ఎస్ ను మరింత ఇరకాటంలోకి నెట్టినట్లయ్యింది. బీఆర్ఎస్ పేరు మార్పుతో దూరమైన ‘తెలంగాణ సెంటిమెంట్’ను తన వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా ఆమె TRS అనే పేరును ఎంచుకున్నారు. ఇక పార్టీ గుర్తుగా కారు గుర్తును పోలిన గుర్తును కూడా కవిత సంపాదిస్తే అది బీఆర్ఎస్ కు మరింత సంకటంగా మారనుందని గులాబీ నేతల్లో గుబులు మొదలైంది.
సిద్దిపేట వ్యక్తి చేతిలో టీఆర్ఎస్
ప్రస్తుతం సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగం అధ్యక్షుడిగా
తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్టర్ అయి ఉంది. దానికి అసెంబ్లీ ఎన్నికల్లో గ్యాస్ సిలిండర్ గుర్తు కూడా కేటాయించారు . పార్టీ కార్యాలయంగా ఓల్డ్ అల్వాల్ (ఇం. నెం. 1-4-177/148, 149/201) చిరునామాను పేర్కొన్నారు. పార్టీ ఉపాధ్యక్షులుగా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల మురళీకంఠ, ప్రధాన కార్యదర్శిగా సిద్దిపేట జిల్లా వెల్గటూర్ గ్రామానికి చెందిన నల్లా శ్రీకాంత్, కోశాధికారిగా పొన్నాల గ్రామానికి చెందిన సదుపల్లి రాజు వ్యవహరిస్తున్నట్లుగా అధ్యక్షుడు తుపాకుల బాలరంగం 2023లో ఫిబ్రవరి 13న ఈసీకి పార్టీ నమోదు కోసం చేసిన దరఖాస్తులో పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన బాలరంగం కేసీఆర్‌కు ఎంతో సన్నిహితుడు. 1983నుంచి కేసీఆర్‌తో కొనసాగారు. 1987, 1995లో పొన్నాల గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. 2001లో సిద్దిపేట మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2006లో సిద్దిపేట మండల జడ్పీటీసీ సభ్యుడిగా, 2019 నుంచి 2021 వరకు ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా సేవలందించారు. ప్రస్తుతం బాలరంగం పేరిట ఉన్న టీఆర్ఎస్ పార్టీ కొన్నేళ్లుగా కార్యకలాపాలు లేకుండా..కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర ప్రత్యుత్తరాలకు స్పందించకుండా ఉందని..ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఫ్రీజ్ కాబడిందని బీఆర్ఎస్, ఫ్రీ జాబితాలోనే ఉందని కవిత చెబుతుండటంతో అసలు నిజం ఏమిటన్నది తేలాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :
కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ ఘాటు సెటైర్..!
కవిత పాంచజన్యం.. ఐదు హామీలు ఇవే!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram