సీఎం స్పందించాలి…నిజాం కాలేజీ విద్యార్ధుల నిరసన

హాస్టల్‌ సౌకర్యం కల్పించాలంటూ నిజాం కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్‌ ఛాంబర్‌ను ముట్టడించి, సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించాలని డిమాండ్‌ చేశారు.

విద్యా సంవత్సరం మొదలై..కాలేజీలో చేరి రోజులు గడుస్తున్నా తమకు హాస్టల్స్ అలాట్ చేయడం లేదంటూ నిజాం కాలేజీ విద్యార్ధులు గురువారం ఆందోళనకు దిగారు. కాలేజీ ప్రిన్సిపాల్ సీహెచ్. శ్రీనివాస్ ఛాంబర్ ను ముట్టడించి ధర్నా చేపట్టారు. హాస్టల్స్ అలాట్ చేయాలని, ప్రిన్సిపల్ స్పందించాలని, మాకు న్యాయం చేయాలని నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్ధులను అదుపు చేశారు.

తమ సమస్యపై విద్యాశాఖ పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు. తమకు హాస్టల్స్ అలాట్ చేయకపోవడంతో వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని.. వెంటనే హాస్టల్స్ అలాట్ చేయాలని డిమాండ్ చేశారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చి చదువుతున్న విద్యార్థులు వసతి, భోజన సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అటు గ్యులర్ కోర్సుల విద్యార్థులతో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు కూడా హాస్టల్ సౌకర్యం కల్పించాలని అంతకుముందు రోజు కూడా విద్యార్ధులు ధర్నా నిర్వహించారు.

ఆయుష్‌ హౌస్‌ సర్జన్లు, పోస్టు గ్రాడ్యుయేట్‌ వైద్య విద్యార్థుల ధర్నా..

మరోవైపు ..పెండింగ్ లో ఉన్న స్టై ఫండ్ పెంపు కోరుతూ ఆయుష్‌ హౌస్‌ సర్జన్లు, పోస్టు గ్రాడ్యుయేట్‌ వైద్య విద్యార్థులు ధర్నాకు దిగారు. పనికి తగిన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. తెలంగాణ ఆయుష్‌ హౌస్‌ సర్జన్స్‌ అండ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్స్‌ జాయింట్‌ కమిటీ (ఆయుష్‌ హెచ్‌ఎస్‌ అండ్‌ పీజీ- జేఏసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర వైద్య విద్యార్థులతో పోలిస్తే ఆయుష్ వైద్యులకు స్టైఫండ్‍లో అసమానత ఎందుకంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ఆయుష్ స్టై ఫండ్ పెంపుపై జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Latest News