ఇటీవలి కాలంలో అవినీతి అధికారులపై వరుస దాడులు నిర్వహిస్తున్న తెలంగాణ ఏసీబీ మంగళవారం ఉదయం నుంచి ఆర్ఆండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్ పై దాడులు చేపట్టింది. మోహన్ నాయక్ కు సంబంధించిన హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లోని నివాసాలు, బంధువుల ఇళ్లలో ఏసీబీ ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తుంది. ఆదాయానికి మించి భారీగా వందల కోట్లలో అక్రమ ఆస్తులు కూడబెట్టాడన్న ఆరోపణల నేపథ్యంలో మోహన్ నాయక్ పై ఏబీసీ దాడులు చేపట్టింది.
మాదాపూర్, మియాపూర్ లోని మోహన్ నాయక్ నివాసాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 నుంచి 15 ప్రాంతాలలో ఏసీబీ అధికారులు ఒకేసారి సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా స్థిర, చరాస్తులు, డాక్యుమెంట్లు మరియు విలువైన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆస్తుల విలువ వందల కోట్ల రూపాయల్లో ఉంటుందని ప్రాథమిక అంచనా. సోదాలు పూర్తయిన తర్వాత ఏసీబీ దీనిపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
ఇటీవల ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలాలు
ఇటీవల ఏసీబీ నిర్వహించిన కొన్ని ప్రముఖ దాడులు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రూ.100కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టిన అవినీతి అధికారుల చిట్టాను ఏసీబీ రట్టు చేసింది. మాజీ హెచ్‌ఎండీఏ డైరెక్టర్ శివ బాలకృష్ణ, టీజీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ ఎరుగు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్ నూనె శ్రీధర్, మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావు, ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ అధికారి శ్రీనివాసులు, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి కేసుల్లోనూ రూ.100కోట్లకు పైగానే అక్రమాస్తులు వెలుగు చూశాయి.ట్రాన్స్‌పోర్ట్ శాఖ డిప్యూటీ కమిషనర్ మూడ్ కిషన్, హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ (ఇంజినీరింగ్) సంగం అనంత లక్ష్మీకుమార్‌పై, మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ పై నిర్వహించిన దాడుల్లోనూ రూ.100కోట్లకు పైగా అక్రమాస్తులు బయటపడ్డాయి.
