తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగుల నిరసన !

తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

విధాత, హైదరాబాద్: తమ డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ టీజీఈ జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు భోజన విరామంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మండల తహశీల్దార్లు , రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలలో ఆర్డీవోలకు ఉద్యోగులు వినతి పత్రాలు అందించారు.

సెక్రటేరియట్ లో ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల మహా ధర్నా నిర్వహించారు. నల్ల రిబ్బన్లతో నిరసన ప్రదర్శన చేపట్టారు. 52 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ అమలు, హెల్త్ స్కీమ్, , సీపీఎస్ ని రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.

ఉద్యోగు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వహిస్తున్న జాప్యం కారణంగా రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులతో పాటు సర్వీసులో ఉన్న ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైన స్పందించి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్‌ రెండో తేదీన పీఆర్సీ అమలుతోపాటు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల ఐదు డీఏలను కూడా విడుదల చేయాలన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులన్నీ క్లియర్‌ చేయాలని, ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు జారీ చేసి తక్షణమే అమల్లోకి తీసుకురావాలన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం(ఓపీఎస్‌)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్‌ఏల వారసుల ఉద్యోగ నియామక సమస్యను సత్వరం పరిష్కరించాలన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. నిరసన కార్యాచరణలో భాగంగా మే 5న జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పిస్తామని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి :

ఢిల్లీలో మల్లారెడ్డి కోడలు..ప్రధాని మోదీతో భేటీ!
సమగ్ర కుటుంబ సర్వే ఎక్స్ పర్ట్ కమిటీకి సన్మానం

Latest News