డీలిమిటేషన్ పై ఏకపక్ష నిర్ణయాలు సరికాదు : ఎంపీ చామల

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు సరికాదు అని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇండియా కూటమి మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం అని బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని మంండిపడ్డారు.

డీలిమిటేషన్ పై ఏకపక్ష నిర్ణయాలు సరికాదు : ఎంపీ చామల

విధాత, హైదరాబాద్: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు సరికాదు అని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇండియా కూటమి మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం అని బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని మంండిపడ్డారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణ ప్రతిపాదన సందర్బంగా మల్లిఖార్జున్ ఖర్గే స్పందిస్తూ… ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుని పార్లమెంట్ సమావేశాలు పెట్టాలని చెప్పారని చామల గుర్తు చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 850 పార్లమెంట్ సీట్ల పెంపుదల కన్ఫ్యూజన్ గా ఉంది అన్నారు. పార్లమెంట్ లో బలం ఉందని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. 2026 జనగణనను పరిగణనలోకి తీసుకుంటారా లేదా స్పష్టం చేయాలని కోరారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు అని, మధ్యాహ్నం ఇండియా కూటమి నేతల మీటింగ్ తర్వాత ఇండియా కూటమి అజెండా తెలుస్తుంది అన్నారు. కేంద్రం డీలిమిటేషన్ ఇష్టం ఉన్నట్లు చేస్తామంటే కుదరదు అని తేల్చిచెప్పారు.

2023లో మహిళా రిజర్వేషన్ల బిల్లు పెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయని, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలుపై చర్చలో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయాలని చామల డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినప్పుడు 2026 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్రం చెప్పిందని, 543 సీట్లకు మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదు అన్నారు. ప్రోరెటా ప్రకారం డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అన్నారు. ఇప్పటికే నిధుల విషయంలో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయన్నారు. పది రోజులు ఆగితే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటో వారికే తెలియాలన్నారు. ప్రోరేటా ప్రకారం 50 శాతం, రాష్ట్రాల ఆర్ధిక అభివృద్ధి ఆధారంగా 50 శాతం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేశారు అని, దీనిపై ఐదు రాష్ట్రాల సీఎంలకు రేవంత్ రెడ్డి లేఖలు రాశారు అని గుర్తు చేశారు.