Nobel Prize Literature | హంగేరియన్ రచయిత లాజ్లో క్రస్నహూర్కైకు నోబెల్ సాహితీ పురస్కారం
2025 సంవత్సరానికి గాను నోబెల్ సాహితీ పురస్కారం హంగేరియన్ రచయిత లాజ్లో క్రస్నహూర్కై గెలుచుకున్నారు.

Nobel Prize Literature | 2025 సంవత్సరానికి గాను నోబెల్ సాహితీ పురస్కారం హంగేరియన్ రచయిత లాజ్లో క్రస్నహూర్కై (László Krasznahorkai) గెలుచుకున్నారు. భయానక విపత్తుల మధ్య కూడా కళకు ఉన్న శక్తిని చాటే ఆయన విప్లవాత్మక సాహిత్య కృషికి ఈ పురస్కారం అందజేస్తున్నట్టు స్వీడిష్ అకాడమీ గురువారం తన ప్రకటనలో తెలిపింది. ఆయన రచనల్లో కాఫ్కా నుంచి థామస్ బెర్న్‌హార్డ్ వరకూ కనిపించే అసంబద్ధ, వింతైన తీవ్రతలు స్పష్టంగా కనిపిస్తాయని పేర్కొన్నది. మధ్య ఐరోపా సాహిత్య సంప్రదాయంలో గొప్ప ఇతహాస రచయితగా అభివర్ణించింది. తూర్పు తాత్విక దృక్ఫథాలు కూడా కలిపి, ఆలోచనాత్మక ధోరణితో సాహిత్యానికి కొత్త మాధుర్యాన్ని అందించారని కొనియాడింది. గతంలో ఇమ్రే కేర్టెజ్ 2002లో నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్నారు. ఆయన తర్వాత లాజ్లో క్రస్నహూర్కై నోబెల్ పురస్కారం అందుకోబుతున్న రెండో హంగేరియన్ రచయిత కావడం విశేషం. క్రస్నహోర్కై 1954లో హంగేరీ దక్షిణ తూర్పు పట్టణం గ్యులా లో జన్మించారు. హంగేరియన్ గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 1985లో ఆయన రాసిన తొలి నవల స్టాన్‌టాంగో (Satantango) సాహితీలోకంలో సంచలనం రేపింది. ‘పేదరికంతో జీవిస్తున్న కొందరు గ్రామస్తుల జీవితాలను, సోషలిజం పతనానికి ముందు హంగేరీ గ్రామీణ ప్రాంతాల్లో చోటు చేసుకున్న సామాజిక పతనాన్ని అత్యంత గాఢంగా ఈ నవల ప్రతిబింబించింది’ అని స్వీడిష్ అకాడమీ తన ప్రకటనలో తెలిపింది.
సినిమాలుగా క్రస్న హూర్కై నవలలు
హంగేరియన్ ఫిలిం డైరెక్టర్ బెలా టార్‌తో క్రస్నహూర్కైకు సుదీర్ఘ, సృజనాత్మక సంబంధం ఉంది. ఆయన రాసిన స్టాన్‌టాంగో, ది వ్రెక్‌మెయిస్టర్ హార్మొనీస్ వంటివి సినిమాలుగా వచ్చాయి. మెలాంఖలీ ఆఫ్ రెసిస్టెన్స్ అనే రచనకు గాను 1993లో ఆయనకు బెస్టెన్‌లిస్టే ప్రైజ్ లభించింది.
డైనమైట్ ఆవిష్కర్త, స్వీడిష్ వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం 1901 నుంచి సాహిత్యం, విజ్ఞానం, శాంతి రంగాల్లో ఈ బహుమతులు అందిస్తున్నారు. గత ఏడాది దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్.. నోబెల్ సాహితీ పురస్కారాన్ని అందుకున్న తొలి కొరియన్ మహిళగా నిలిచారు. గతంలో టాల్‌స్టాయ్, ఎమిలీ జోలా, జేమ్స్ జాయిస్ వంటి ప్రముఖులను స్వీడిష్ అకాడమీ విస్మరించిందనే అపవాదు ఉంది.