Viral News | బ్రెజిల్‌లో 37 ఏళ్ల మహిళ 12 ఏళ్ల బాలికల నటించి ఓ కుటుంబాన్ని దాదాపు 14 నెలల పాటు నమ్మించి మోసం చేసిన ఘటన బ్రెజిల్‌లో సంచలనంగా మారింది. ఆటిజంతో బాధపడుతున్నానని.. చిన్నతనం నుంచి వేధింపులకు గురై ఇంటి నుంచి పారిపోయి వచ్చానని కథ అల్లిన ఆమె.. ఆ కుటుంబం దత్తత తీసుకునేంతగా నమ్మించింది. కానీ చివరి నిమిషంలో అసలు నిజం బయటపడటంతో ఆ కుటుంబం షాక్‌కు గురైంది.
బ్రెజిల్‌లోని శాంటా కాటరీనా ప్రాంతానికి చెందిన అమాండా మారియా సౌజా డి ఒలివెయిరా అనే మహిళ (37) తనను తాను 12 ఏళ్ల అనాథ బాలికగా అందర్నీ నమ్మించింది. ఆటిజంతో బాధపడుతున్నానని.. తల్లిదండ్రులు కూడా లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నానని చెప్పి ఓ కుటుంబానికి దగ్గరయ్యింది. ఆమె పరిస్థితి పట్ల జాలిపడ్డ కుటుంబం కూడా ఉదారతతో ఆ పాపను తమ వెంట ఇంటికి తీసుకెళ్లింది. దాదాపు 14 నెలల పాటు వారి ఇంట్లోనే ఉన్న తర్వాత ఆమెను దత్తత కూడా తీసుకునేందుకు సిద్ధమైంది.
ఆ సమయంలో 12 ఏళ్ల బాలికలా నమ్మకం కలిగించేందుకు అమాండ అచ్చం చిన్న పిల్లలాగే ప్రవర్తించేది. ఎప్పుడూ చిన్నపిల్లలు ఉపయోగించే వస్తువులునే వాడటం, చిన్నపిల్లలా ప్రవర్తించడం బేబీ బాటిల్‌తో పాలు తాగడం, పాసిఫైర్ చప్పరించడం, చిన్నారులు ఉపయోగించే వస్తువులనే పట్టుకుని నిద్రపోవడం, రాత్రిళ్లు భయాంకరకమైన కలలు వచ్చినట్లుగా నటించి, అర్ధరాత్రి నిద్రలేచి భయపడటం వంటివి అన్నీ చేసింది. వయసుకు మించిన శరీరాకృతితో కనిపిస్తున్నావని ఎవరైనా ప్రశ్నిస్తే.. చిన్నతనంలో తనపై శారీరక వేధింపులు జరిగాయని వాటివల్లే అలా కనిపిస్తున్నానని బదులిచ్చేది.
ఇలా 14 నెలల పాటు అమాండా వారి ఇంట్లోనే చిన్నపిల్లలా నటిస్తూ ఉంది. ఈ క్రమంలో వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి అమాండాపై అనుమానం వచ్చి ఇలాంటి కేసుల గురించి ఇంటర్నెట్‌లో వెతికాడు. అప్పుడే ఆమె 12 ఏళ్ల బాలిక కాదని.. పలు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడిన 37 ఏళ్ల మహిళగా గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సదరు మహిళను పోలీసులు అరెస్టు చేశారు.
దర్యాప్తు వివరాల ప్రకారం.. అమాండా మొదట జాయిన్‌విల్లే నగరంలోని ఓ చర్చికి వెళ్లింది. తన పేరు గాబ్రియెల్లాగా చెప్పుకుని అందరికీ పరిచయం చేసుకుంది. పరా రాష్ట్రంలో తనపై హింస జరుగుతుందని.. అందుకే తప్పించుకుని వచ్చానని వారికి చెప్పింది. తాను ఆటిజంతో బాధపడుతున్నానని కూడా తెలిపింది. ఆమె చెప్పిన మాటలు నమ్మిన ఓ కుటుంబం జాలిపడి ఇంట్లో ఆశ్రయమిచ్చారు. 14 నెలల తర్వాత దత్తతకు కూడా సిద్ధమయ్యారు. దత్తతకు కొద్ది రోజుల ముందే ఈ విషయం బయటపడటంతో పోలీసులకు అప్పగించారు.
పోలీసులు దర్యాప్తులో అమాండా తన నేరాలను అంగీకరించినట్లు సమాచారం. దీంతో ఆమెపై మోసం, తప్పుడు గుర్తింపు వినియోగం కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ మహిళ జాయిన్‌విల్లే మహిళా జైలులో విచారణ ఖైదీగా ఉంది. ఆమె మానసిక పరిస్థితిని అంచనా వేయడానికి సైకియాట్రిక్ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
