Ferry Sank off Bali coast | సముద్రంలో మునిగిన నౌక.. 43 మంది గల్లంతు..!

Ferry Sank off Bali coast| ఇండోనేషియాలోని బాలి సమీపంలో సముద్రంలో ఫెర్రీ మునిగిపోయిన ప్రమాదంలో 43 మంది గల్లంతైనట్లు సమాచారం. ప్రమాద సమయంలో ఫెర్రీలో 65 మంది ఉన్నట్లు గుర్తించారు. తూర్పు జావాలోని కెటాపాంగ్ పోర్టు నుంచి బాలిలోని గిలిమనుక్‌కు బయలుదేరిన అరగంటకే ప్రమాదానికి గురైంది. ప్రమాదం సంభవించిన సమయంలో నౌకలో 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో పాటు 22 వాహనాలు, 14 ట్రక్కులు ఉన్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. అపస్మారక స్థితిలో ఉన్న 23 మందిని రక్షించారు. మిగిలిన వారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
పెద్దఎత్తున అలలు వస్తుండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇండోనేసియా 17వేలకు పైగా దీవుల సముదాయం. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ఫెర్రీలు, పడవలనే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే, భద్రతా ప్రమాణాలు సరిగా పాటించకపోవడం, సామర్థ్యానికి మించి ఎక్కించడం వంటి కారణాలతో తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయి. 2018లో సామర్థ్యానికి మించి ఓ పడవలో 200 మంది ప్రయాణించడంతో అది బోల్తా పడింది. ఆ ఘటనలో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.