ఎడారిలో విషాదం..తాగు నీరు దొరక్క 49మంది మంది మృతి

సహారా ఎడారిలో ట్రక్కు చెడిపోవడంతో తాగునీరు దొరక్క 49 మంది దాహంతో మృతి చెందారు. నైజర్-మాలి సరిహద్దులో ఈ విషాద ఘటన కలకలం రేపింది.

ఏడారిలో మరణ మృదంగం ధ్వనించింది. పొరుగు దేశంలో బంధువుల పండుగకు బయలుదేరి..సహారా ఎడారిలో చిక్కుకుని తాగునీరు దొరక్క 49మంది ప్రాణాలు విడిచిన విషాదం దిగ్బ్రాంతి కల్గించింది. పశ్చిమాఫ్రికాలో చోటుచేసుకున్న ఈ అత్యంత విషాదకర ఘటన లో నైజర్‌ దేశంలో కలవరం విషాదం రేపింది. నైజర్‌కు చెందిన కొంతమంది తమ బంధువులతో పండుగ చేసుకునేకుందుకు పక్కనే ఉన్న మాలి దేశానికి సహారా ఎడారి మార్గంలో ట్రక్కులో బయల్దేరారు. ఆ వేడుక ముగించుకొని తిరిగివస్తుండగా.. వీరు ప్రయాణిస్తున్న ట్రక్కు అసమాకా అనే సరిహద్దు ప్రాంతానికి 80 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయింది. వీరు ప్రయాణిస్తున్న ట్రక్కు ఆగిపోవడంతో వీరంతా కొన్ని రోజుల పాటు ఎడారిలో నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.

వారు ఆగిపోయిన ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటంతో సాయం చేసేవారు దొరకలేదు. డ్రైవర్‌తో పాటు అందులోని ప్రయాణికులు ట్రక్కును మరమ్మతు చేసేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో వారంతా కొన్ని రోజుల పాటు ఎడారిలోనే ఉండాల్సి వచ్చింది. అప్పటికే వారి వద్ద ఉన్న నీటి నిల్వలు నిండుకున్నాయి. ఎడారిలో నీటి జాడ లేకపోవడంతో వారు దాహంతో అల్లాడిపోయారు. సహారా ఎడారిలో తాగేందుకు నీరు దొరక్క దాహంతో వారిలో 49 మంది ప్రాణాలు కోల్పోయారు.

చివరకు ఇద్దరు వ్యక్తులు దాదాపు 50 కిలోమీటర్లకు పైగా కాలినడకన వెళ్లి నీరు తాగి అక్కడినుంచి అసమాకా పట్టణానికి చేరుకున్నారు. అక్కడ అధికారులను కలిసి విషయం చెప్పారు. అప్రమత్తమైన అధికారులు ఘటనా స్థలానికి చేరుకునేలోగా..అక్కడ హృదయ విదారక దృశ్యాలు కన్పించాయి. ట్రక్కు చుట్టూ డజన్ల కొద్దీ మృతదేహాలు కన్పించాయని అధికారులు తెలిపారు. విపరీతమైన వేడి, ఉక్కపోత, నీరు లేక 49 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. సాధారణంగా ఈ ఎడారి జోన్‌ మీదుగా పౌరులు రాకపోకలు సాగించడం చాలా అరుదని స్థానిక అధికారులు వెల్లడించారు. ఎక్కువగా ఆఫ్రికా దేశాల నుంచి యూరప్‌కు వలసవెళ్లేవారు ఈ మార్గాన్ని ఆశ్రయిస్తారని తెలిపారు. గతంలోనూ అనేక మంది ఇసుక వేడి, దాహం, ఆకలితో ఈ మార్గంలో ప్రాణాలు విడిచినట్లు అధికారులు గుర్తుచేశారు.

Latest News