64 KILLED in Rio De Janeiro | పోలీస్ కాల్పుల్లో 64 మంది మృతి!

బ్రెజిల్‌ రియోలో డ్రగ్‌ ముఠాలపై భారీ పోలీసు ఆపరేషన్‌.. నలుగురు అధికారులతో పాటు 64 మంది మృతి! మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.

64 KILLED in Rio De Janeiro | పోలీస్ కాల్పుల్లో 64 మంది మృతి!

న్యూఢిల్లీ : బ్రెజిల్ రియో డి జ‌నైరోలో డ్రగ్ దందా నిర్వహిస్తున్న ముఠాలపై ఆ దేశ పోలీసులు, భద్రత సిబ్బంది చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ లో ఒకేసారి 64మంది మరణించారు. దాదాపు 2500 మంది భ‌ద్ర‌తా సిబ్బంది.. డ్ర‌గ్ ట్రాఫికింగ్ ముఠాల‌పై ఒకేసారి విరుచుక పడ్డారు. సాయుధ‌ వాహ‌నాలు, హెలికాప్ట‌ర్లు, డ్రోన్ల‌తో పోలీసులు నిర్వహించిన ఆప‌రేష‌న్ లో భాగంగా నలుగురు భద్రతాధికారులు సహా 60మంది డ్రగ్ ముఠాల సభ్యులు మృతి చెందారు. నార్త‌ర్న్ బ్రెజిల్‌లో ఉన్న రెండు మురికివాడ‌ల్లో ఈ దాడులు నిర్వ‌హించారు. పోలీసు దాడులతో రియో ప‌ట్ట‌ణంలోని ఉత్త‌ర ప్రాంతం వ‌ణికిపోయింది. రియో ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు స‌మీపంలో కాల్పుల మోత మోగింది.

పోలీస్ ఆపరేషన్‌కు ప్రతీకారంగా.. వారిని లక్ష్యంగా చేసుకుని డ్రగ్ ముఠాలు డ్రోన్‌లు, ఆయుధాలతో ప్రతిదాడులకు దిగాయి. భద్రతా బలగాలు వెనక్కి తగ్గకుండా ఆపరేషన్‌లో కొనసాగిస్తున్నాయి. కొన్ని గంటల పాటు సాగిన కాల్పులలో నలుగురు అధికారులతో సహా 64 మంది ప్రాణాలు కోల్పోయారని, కాల్పులు కొనసాగుతున్నందునా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భద్రతాధికారులు తెలిపారు. మరో 81 మంది అనుమానితులను అరెస్టు చేసినట్లుగా పేర్కొన్నారు. దాదాపు ఏడాది పాటు ప్రణాళిక రచించి ఈ ఆపరేషన్ చేపట్టినట్లుగా వెల్లడించారు. రియో రాష్ట్ర చ‌రిత్ర‌లోనే ఇది అతిపెద్ద ఆప‌రేష‌న్ అని గ‌వ‌ర్న‌ర్ క్లాడియో క్యాస్ట్రో తెలిపారు.75 రైఫిల్స్‌తో పాటు పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాడుల సమయంలో సమీపంలోని 46 పాఠశాలలను మూసివేసినట్లు తెలిపారు.

డ్రగ్స్ ముఠాలను లక్ష్యంగా చేసుకుని బ్రెజిల్ సాయుధ బలగాలు నిర్వహించిన ఈ దాడిని మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ బ్రెజిల్‌ డైరెక్టర్‌ సీసార్‌ మయోజన్‌ మాట్లాడుతూ.. ఈ హింసాత్మక ఘటన పెద్ద విషాదకరమన్నారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆపరేషన్‌ను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం కూడా ఖండించింది. ఇది తమను భయభ్రాంతులకు గురిచేసిందంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టింది. దీనిపై దర్యాప్తు జరపాలని పేర్కొంది.