ప్ర‌పంచ తెలివైన విద్యార్థుల జాబితాలో భార‌తీయ సంత‌తి విద్యార్థిని

భార‌త సంత‌తికి చెందిన ప్రీషా చ‌క్ర‌వ‌ర్తి అనే అమెరిక‌న్ విద్యార్థిని ప్ర‌పంచంలోనే తెలివైన విద్యార్థుల జాబితా (World's brightest student) లో చోటు ద‌క్కించుకుంది

ప్ర‌పంచ తెలివైన విద్యార్థుల జాబితాలో భార‌తీయ సంత‌తి విద్యార్థిని

భార‌త సంత‌తికి చెందిన ప్రీషా చ‌క్ర‌వ‌ర్తి అనే అమెరిక‌న్ (America) విద్యార్థిని ప్ర‌పంచంలోనే తెలివైన విద్యార్థుల జాబితా (World’s brightest student) లో చోటు ద‌క్కించుకుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 16000 మందితో పోటీ ప‌డి, ప‌లు ఆప్టిట్యూడ్ ప‌రీక్ష‌ల్లో విజ‌య‌వంత‌మైన అనంత‌రం.. థ‌ర్డ్‌ గ్రేడ్ చ‌దువుతున్న ప్రీషా ఈ జాబితాలో చేరింది. ద జాన్ హాప్కిన్స్ సెంట‌ర్ ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించింది. వ‌య‌సు, త‌ర‌గ‌తికి మించి తెలివితేట‌లు, సామ‌ర్థ్యం ప్ర‌ద‌ర్శంచే పాఠ‌శాల విద్యార్థుల‌ను వెలికితీయ‌డ‌మే ఈ ప‌రీక్ష ఉద్దేశం,. 2023 వేస‌విలో ప్రీషా ఈ ప‌రీక్ష‌ను రాయ‌గా.. అనేక వ‌డ‌పోత‌ల అనంత‌రం తాజాగా జాబితాను విడుద‌ల చేశారు. తొమ్మిదేళ్ల ప్రీషా ప్ర‌స్తుతం కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్‌లో నివాసం ఉంటోంది.


వార్మ్ స్ప్రింగ్ ఎలిమెంట‌రీ పాఠ‌శాల‌లో థ‌ర్డ్‌ గ్రేడ్ చ‌దువుతోంది. ప్రీషా వెర్బ‌ల్‌, క్వాంటిటేటివ్ సెక్ష‌న్స్‌లో 99 శాతం మార్కుల‌ను సాధించింద‌ని హాప్కిన్స్ సెంట‌ర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. థ‌ర్డ్ గ్రేడ్ చ‌దువుతున్న ప్రీషాకు ఫిఫ్త్ గ్రేడ్ స్థాయిలో ప్ర‌శ్న‌ప‌త్రం ఇచ్చామ‌ని.. అయినా 99 శాతం ఉత్తీర్ణ‌త సాధించింద‌ని తెలిపింది. ఈ విజ‌యంతో ప్రీషా మ‌రిన్ని టాలెంటెడ్ ప‌రీక్ష‌ల‌కు అర్హ‌త సాధించింది. గ్రేడ్ 12 వ‌ర‌కు నిర్వ‌హించే మాథ‌మేటిక్స్‌, కంప్యూట‌ర్ ప్రోగ్రామింగ్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, రీడింగ్‌, రైటింగ్ వంటి వాటిల్లో ఆమె త‌న స్థాయికి మించిన ప‌రీక్ష‌ల్లో పాల్గొనేందుకు ఇప్పుడు అవ‌కాశం ల‌భించింది. ఆమె ఇప్ప‌టికే మెన్సా ఫౌండేష‌న్ మెంబ‌ర్ కావ‌డం విశేషం. ఈ ఫౌండేష‌న్‌లో హై ఐక్యూ ఉన్న వారు మాత్ర‌మే స‌భ్యులుగా ఉంటారు. ఇది ప్ర‌పంచంలోనే అతి పురాత‌న‌మైన సొసైటీ కావ‌డం విశేషం. ఐక్యూ ప‌రీక్ష‌ల్లో 98 శాతం పైబ‌డి ఉత్తీర్ణ‌త సాధించిన వారికే ఇందులో స‌భ్య‌త్వం ల‌భిస్తుంది. ఆమె త‌న ఆరో ఏట‌నే ఈ ఘ‌నత సాధించ‌డం విశేషం. ఊరికే చ‌దువు ఒక‌టే కాకుండా ప్ర‌యాణాలు చేయ‌డం, కొండ‌లు ఎక్క‌డం, మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకోడం వంటి హాబీలు ఉన్నాయ‌ని మీడియాకు ప్రీషా వెల్ల‌డించింది.