JD Vance | ఆంధ్రా అల్లుడే అగ్రరాజ్యం ఉపాధ్య‌క్షుడు..! ఇక మ‌న ఉష అమెరికా సెకండ్ లేడీ..!!

JD Vance | అమెరికా( America )కు 47వ అధ్య‌క్షుడిగా రిప‌బ్లిక‌న్ పార్టీ( Republican Party )కి చెందిన డొనాల్డ్ ట్రంప్( Donald trump ) రెండోసారి అధికారం చేప‌ట్ట‌నున్నారు.

JD Vance | ఆంధ్రా అల్లుడే అగ్రరాజ్యం ఉపాధ్య‌క్షుడు..! ఇక మ‌న ఉష అమెరికా సెకండ్ లేడీ..!!

JD Vance | అమెరికా( America )కు 47వ అధ్య‌క్షుడిగా రిప‌బ్లిక‌న్ పార్టీ( Republican Party )కి చెందిన డొనాల్డ్ ట్రంప్( Donald trump ) రెండోసారి అధికారం చేప‌ట్ట‌నున్నారు. ఉపాధ్య‌క్షుడిగా జేడీ వాన్స్( JD Vance ) వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. అంటే ఆంధ్రా అల్లుడు అగ్ర‌రాజ్యానికి ఉపాధ్య‌క్షుడు కాబోతున్నార‌న్న మాట‌. జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి( Usha Chilukuri ) తెలుగు అమ్మాయి కావ‌డం. ఉషా చిలుకూరి అమెరికా సెకండ్ లేడీగా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నార‌న్న‌మాట‌. ఒహోయో రాష్ట్ర సెనేట‌ర్‌గా జేడీ వాన్స్‌ను ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థిగా ట్రంప్ ఎంపిక చేసుకున్న‌ప్ప‌టి నుంచే ఉష పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది. అగ్ర‌రాజ్యం ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ల విజ‌యంతో ఉష పేరు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది.

ఎవ‌రీ ఉషా చిలుకూరి..?( Who is Usha Chilukuri )

ఉషా చిలుకూరి పూర్వీకుల‌ది ఏపీలోని కృష్ణా జిల్లా పామ‌ర్రుకి ద‌గ్గ‌ర్లోని ఓ కుగ్రామం. ఆమె త‌ల్లిదండ్రులు రాధాకృష్ణ‌, ల‌క్ష్మీ 1980ల్లోనే అమెరికా వెళ్లి స్థిర‌ప‌డ్డారు. తండ్రి రాధాకృష్ణ.. అమెరికాలో క్రిష్ చిలుకూరిగా అంద‌రికీ సుప‌రిచితం. ఆయ‌న ఏరోస్పేస్ ఇంజినీర్. యునైటెడ్ టెక్నాల‌జీస్ ఏరోస్పేస్ ఏరోడైన‌మిక్స్ స్పెష‌లిస్ట్‌గా సేవ‌లందించారు. ఆపై కాలిన్స్ ఏరోస్పేస్‌లో అసోసియేట్ డైరెక్ట‌ర్‌గానూ వ్య‌వ‌హ‌రించారు. త‌ల్లి ల‌క్ష్మీ మాలిక్యూల‌ర్ బ‌యాల‌జీ, బ‌యో కెమిస్ట్రీ రంగం నిపుణురాలు. ప్ర‌స్తుతం ప్రొఫెస‌ర్‌గా విధులు నిర్వ‌రిస్తూనే, శాన్‌డియాగో యూనివ‌ర్సిటీలో కీల‌క‌మైన అడ్మినిస్ట్రేటివ్ ప‌ద‌విలో ఉన్నారు. ఉషా అమెరికాలోనే జ‌న్మించారు. అక్క‌డే త‌న విద్యాభ్యాసాన్ని కొన‌సాగించార‌మె.

ఉషా చిలుకూరి విద్యాభ్యాసం..

ఉషా చిలుకూరి యేల్ యూనివ‌ర్సిటీ నుంచి హిస్ట‌రీలో బ్యాచిల‌ర్ డిగ్రీ ప‌ట్టా పొందారు. ఆ త‌ర్వాత కేంబ్రిడ్జి యూనివ‌ర్సిటీ నుంచి ఫిలాస‌ఫీలో మాస్ట‌ర్స్ పూర్తి చేశారు. న్యాయ సంబంధ‌మైన విభాగాల్లో సుదీర్ఘంగా ప‌ని చేశారు. యేల్ యూనివ‌ర్సిటీలో లా అండ్ టెక్ జ‌ర్న‌ల్‌కు మేనేజింగ్ ఎడిట‌ర్‌గా, యేల్ లా జ‌ర్న‌ల్‌కు ఎగ్జిక్యూటివ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎడిట‌ర్‌గా సేవ‌లందించారు. నాలుగేండ్ల పాటు యేల్ యూనివ‌ర్సిటీలో చురుగ్గా సేవ‌లందించిన ఆమె.. అనంత‌రం కేంబ్రిడ్జి యూనివ‌ర్సిటీకి గేట్స్ ఫెలోగా వెళ్లారు. అక్క‌డ ఉషా చిలుకూరి లెఫ్ట్ వింగ్, లిబ‌ర‌ల్ గ్రూప్స్‌తో క‌లిసి ప‌ని చేశారు.

జేడీ వాన్స్, ఉషా చిలుకూరిది ప్రేమ వివాహం..( Usha- JD Vance Love Marriage )

ఉషా చిలుకూరి ఇటీవ‌లే ఒక ప్ర‌సంగంలో త‌న జీవిత విశేషాల‌ను వెల్ల‌డించారు. తాను శాన్ డియాగోలోని ఒక మిడిల్ క్లాస్ కమ్యూనిటీలో పెరిగానని స్ప‌ష్టం చేశారు. తన తల్లిదండ్రులు భారత్ నుంచి వలస వచ్చారని, తనకు ఒక సోదరి ఉందని ఆమె తెలిపారు. లా చదివేటప్పుడు జేడీ వాన్స్‌ను కలుసుకున్నానని, అప్పటి నుంచి ఇప్పటివరకు తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అతనేనని ఉషా అన్నారు. 2013లో యేల్ లా స్కూల్‌లో జేడీ వాన్స్‌ను తొలిసారి క‌లిసిన‌ట్లు చెప్పారు. ‘సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా’’ అనే అంశంపై జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న‌ట్లు తెలిపారు. అక్క‌డ ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. 2014లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఉషా, జేడీ వాన్స్ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇవాన్, వివేక్, మీరాబెల్ వారి పేర్లు. ఉషా హిందూ సంప్రదాయంలో పెరగగా, జేడీ వాన్స్ క్యాథలిక్ మతాన్ని అనుసరిస్తారు.