Viral Video | హిందూ దేవాల‌యంలో న‌గ్నంగా ధ్యానం.. మండిప‌డ్డ భ‌క్తులు

Viral Video | హిందూ దేవాల‌యంలో న‌గ్నంగా ధ్యానం.. మండిప‌డ్డ భ‌క్తులు

Viral Video | హిందువులు సంప్ర‌దాయ దుస్తులు ధ‌రించి దేవాల‌యానికి వెళ్తుంటారు. కానీ ఓ వ్య‌క్తి మాత్రం హిందూ దేవాల‌యంలోకి న‌గ్నంగా ప్ర‌వేశించాడు. అంతేకాకుండా ఆల‌యంలో న‌గ్నంగా ధ్యానం చేశాడు. ఈ ఘ‌ట‌న ఇండోనేషియాలోని చారిత్రాక ప్ర‌దేశ‌మైన బాలిలో వెలుగు చూసింది.


ప్ర‌పంచంలోనే అతిపెద్ద హిందూ దేవాల‌యంలో బాలిలో ఉంది. ఇక్క‌డికి హిందువుల‌తో పాటు ఆయా దేశాల ప‌ర్యాట‌కులు వ‌స్తుంటారు. అయితే ఇటీవ‌లే ఆ ఆల‌యంలోకి ఓ వ్య‌క్తి ప్ర‌వేశించి, న‌గ్నంగా ధ్యానం చేశాడు. న‌గ్నంగా ధ్యానం చేసిన వీడియో ఇండోనేషియాలోని సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైర‌ల్ అయింది.



దీంతో భ‌క్తులు మండిప‌డ్డారు. హిందూ ఆల‌యంలో న‌గ్నంగా ధ్యానం చేసిన వ్య‌క్తిని గుర్తించాల‌ని అధికారుల‌ను కోరారు. అలాంటి వ్య‌క్తుల‌ను దేశంలోకి అనుమ‌తించ‌కూడ‌ద‌ని డిమాండ్ చేశారు. ఈ వీడియోను నీ లుహ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారు త‌న ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఇది అగౌర‌వ‌మైన‌ది.



మా ఆల‌యంలో న‌గ్నంగా ధ్యానం చేయ‌డం ఏంటి..? మీ మైండ్ ప‌ని చేయ‌డం లేదా..? ఇలాంటి ప‌ని ఎలా చేస్తారు. బాలినీస్ ప్ర‌జ‌లకు ఇది అవ‌మానం.. న‌గ్నంగా ధ్యానం చేసిన వ్య‌క్తిని గుర్తించాల‌ని ఇమ్మిగ్రేష‌న్ అధికారుల‌ను అత‌ను కోరారు.ఇండోనేషియాకు ఇలాంటి ప‌ర్యాట‌కులు రావాల్సిన అవ‌స‌రం లేదు. మ‌ర్యాద తెలియ‌ని ప‌ర్యాట‌కులు బాలికి రాన‌వ‌స‌రం లేద‌ని మ‌రో నెటిజ‌న్ సూచించారు.



అయితే న‌గ్నంగా ధ్యానం చేసిన వ్య‌క్తిని అధికారులు గుర్తించిన‌ట్లు స‌మాచారం. కానీ అత‌ను ఏ దేశ‌స్తుడు అనే విష‌యాన్ని బ‌హిరంగంగా వెల్ల‌డించ‌లేద‌ని తెలుస్తోంది. బాలిలోని హిందూ దేవాల‌యంలో ఇలాంటి ఘ‌ట‌న గ‌తంలోనూ వెలుగు చూసింది. ర‌ష్యాకు చెందిన‌ లూయిజా కోసిఖ్‌ అనే 40 ఏళ్ల మహిళ బాలిలోని 700 ఏళ్ల నాటి మర్రి చెట్టు ముందు నగ్నంగా ఫోటో తీయించుకుంది.



అంతటితో ఆగక ఆ నగ్న ఫోటోను ఏకంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే లూయిజా కోసిఖ్‌ షేర్ చేసిన ఆ నగ్న ఫోటో.. ఆ దేశంలోని హిందువుల కంట పడడంతో వారు తీవ్రంగా ఆగ్రహించారు. సమాచారం అధికారుల వరకు చేరడంతో వారు రంగంలోకి దిగి లూయిజా కోసిఖ్‌ను బాలి నుంచి బహిష్కరించడంతో పాటు అరెస్ట్ చేశారు.