Bangladesh Nationalist Party | మా శత్రువుకు సహాయం చేస్తే మీతో సహకారం కష్టం: భారత్‌కు బీఎన్‌పీ హెచ్చరిక
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారతదేశం ఆశ్రయం కల్పించడంపై అక్కడి ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్‌పీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది

ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారతదేశం ఆశ్రయం కల్పించడంపై అక్కడి ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్‌పీ) (Bangladesh Nationalist Party (BNP)) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ శత్రువుకు సహాయం (help our enemy) కొనసాగిస్తే భారత్‌తో తమ పార్టీ సహకరించడం కష్టమని హెచ్చరిక చేసింది. బీఎన్‌పీ సీనియర్ నేత, పార్టీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు గయేశ్వర్‌రాయ్ (Gayeshwar Roy) టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్, భారత్ పరస్పరం సహకరించుకోవాలని బీఎన్‌పీ భావిస్తున్నదని అన్నారు.
‘అయితే.. ఆ స్ఫూర్తికి తగినట్టు వ్యవహరించాలని భారత ప్రభుత్వం (Indian government) అర్థం చేసుకోవాలి’ అని గయేశ్వర్‌రాయ్ చెప్పారు. ‘కానీ మీరు మా శత్రువుకు సహకరిస్తే రెండు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని గౌరవించడం క్లిష్టంగా మారుతుంది. హసీనా మరోసారి అధికారంలోకి రావడానికి భారత్ సహకరించాలని ఎన్నికలకు ముందు మా మాజీ విదేశాంగ మంత్రి (హసీనా ప్రభుత్వంలోని) అన్నారు. షేక్ హసీనా బాధ్యతను ఇప్పుడు భారతదేశం తీసుకున్నది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
బీఎన్‌పీ మైనార్టీ వ్యతిరేక పార్టీ (anti-minority party) అన్న వాదనలను గయేశ్వర్‌రాయ్ కొట్టిపారేశారు. బీఎన్‌పీ జాతీయ పార్టీ అని, అన్ని మతాల వ్యక్తిగత హక్కులను గౌరవిస్తుందని స్పష్టం చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌ను ఉగ్రవాద శక్తులు వాడుకుంటున్నాయన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ‘అందులో వాస్తవం లేదు. మేం స్వాతంత్ర్యం సాధించుకునేందుకు భారత్ సహాయం అందించింది. మేం భారత్‌కు వ్యతిరేకంగా మారే ప్రసక్తే లేదు’ అని గయేశ్వర్‌రాయ్ చెప్పారు.
‘మాది చాలా చిన్న దేశం. వైద్య సదుపాయాలు (medical facilities), ప్రజలకు అవసరమైన వస్తువులు సహా అనేక అంశాల్లో భారత సహకారం మాకు కావాలి. ఇందుకు బంగ్లాదేశీల నుంచి భారత్ సంపాదించుకునే ఆదాయం కూడా చిన్నదేమీ కాదు’ అని ఆయన గుర్తు చేశారు. తదుపరి కార్యాచరణను నిర్ణయాన్ని (Hasina on her next course of action) షేక్ హసీనాకే వదిలేశామని భారత్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.