Bill Gates | వైట్‌కాలర్ ఉద్యోగాలకు ఏఐ ముప్పు.. హెచ్చరించిన బిల్ గేట్స్
ఏఐ వల్ల రాబోయే 4-5 ఏళ్లలో వైట్‌కాలర్ ఉద్యోగాలపై భారీ ప్రభావం ఉంటుందని బిల్ గేట్స్ హెచ్చరించారు. ఉద్యోగ మార్కెట్ రూపమే వేగంగా మారుతుందని చెప్పారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence).. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే మాట. ఇప్పుడు ఇది సర్వాంతర్యామి అయిపోయింది. ఎలాంటి ప్రశ్నకైనా ఇట్టే సమాధానం ఇస్తోంది. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ ఏఐ విస్తరించింది. దీంతో ఏఐ వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇది మంచి విషయమే అయినప్పటికీ.. ఏఐ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల్లో అభద్రతా భావం పెరిగిపోయింది. చాలా కంపెనీలు ఖర్చు తగ్గించుకునేందుకు తమ ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించి.. వారి స్థానాల్లో ఏఐని వినియోగిస్తున్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఆందోళనల వేళ ఏఐ వినియోగంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
కృత్రిమ మేధ (AI) విషయంలో ప్రపంచ దేశాలకు బిల్‌గేట్స్ కీలక హెచ్చరికలు చేశారు. ఏఐ కారణంగా వైట్ కాలర్ ఉద్యోగులకు పెద్ద ఉపద్రవం రాబోతున్నదని హెచ్చరించారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే ఏఐ ప్రభావంతో ఉద్యోగ మార్కెట్, ముఖ్యంగా వైట్ కాలర్ రంగం ఊహించని విధంగా మారిపోతుందని తెలిపారు. జాబ్ మార్కెట్ రూపాన్ని కృత్రిమ మేధ (ఏఐ) ఊహించిన దానికన్నా వేగంగా మార్చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరమ్ (WEF) సదస్సులో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గేట్స్ మాట్లాడుతూ ఈ హెచ్చరికలు చేశారు. ‘రాబోయే 4 నుంచి 5 ఏళ్లలో అటు వైట్ కాలర్, ఇటు బ్లూ కాలర్ రంగాల్లో భారీ మార్పులు రానున్నాయి. పెరుగుతున్న అసమానతలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాల్సి ఉంటుంది. ఈక్విటీ సమస్యలను పరిష్కరించాలి’ అని బిల్‌గేట్స్ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశారు. భవిష్యత్తులో శ్రామికశక్తి నియామక విధానాలు, ఆర్థిక న్యాయానికి అంతరాయం తీవ్రంగా ఉంటుందని బిల్ గేట్స్ హెచ్చరించారు.
వందేళ్లైనా ఏఐతో ఆ స్థానాలను భర్తీ చేయడం సాధ్యం కాదు..
అయితే, ఏఐ వినియోగంపై గతంలోనూ బిల్‌గేట్స్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వచ్చే 100 ఏళ్లైనా ప్రోగ్రామర్లను (programmers) ఏఐ భర్తీ చేయలేదన్నారు. అంతేకాదు కోడింగ్ పైనా ఏఐ ప్రభావం ఉండదని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్ మాట్లాడుతూ.. ‘కృత్రిమ మేధ అనేది ప్రోగ్రామింగ్ రంగంలో మనిషికి ప్రత్యామ్నాయం కాలేదు. కేవలం ఒక సహాయకారిగా మాత్రమే పనిచేస్తుంది. ప్రోగ్రామింగ్‌లో క్లిష్టమైన సమస్యగా భావించేదాన్ని క్రియేటీవ్‌గా పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రోగ్రామింగ్‌లో అది సవాలుతో కూడుకున్న విషయం. మానవ మేధస్సు లేని యంత్రాలు (ఏఐ) అలా చేయలేవు’ అని బిల్‌గేట్స్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా కోడింగ్ అంటే కేవలం టైపింగ్ చేయడం కాదని.. చాలా లోతుగా ఆలోచించాల్సి ఉంటుందని బిల్‌గేట్స్ తెలిపారు. ఈ మేరకు భవిష్యత్తులో కోడింగ్, ఎనర్జీ మేనేజ్‌మెంట్, బయాలజీ రంగాలకు ఆటోమేషన్ ముప్పు తక్కువేనని ఆయన అంచనా వేశారు.
ఇవి కూడా చదవండి :
Shakira Waka Waka Rajasthani Version | ‘వెల్‌కమ్ టు రాజస్థాన్’.. షకీరా వాకా వాకా పాటను ప్రత్యేక వెర్షన్‌లో పాడిన జానపద కళాకారులు.. ఆకట్టుకుంటున్న వీడియో
Medaram | మేడారంలో కొండెక్కిన కొబ్బరికాయ ధరలు..! గజం స్థలం రూ. 10 వేల పైమాటే..!!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram