గర్భిణి ఒత్తిడికి గురైతే.. పుట్టే బిడ్డకు 15 ఏళ్ల వరకు మానసిక సమస్యలు.. వెల్లడించిన అధ్యయనం
గర్భం (Pregnant Women) తో ఉన్నపుడు తల్లి ప్రశాంతంగా ఉంటే శిశువు ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెబుతూ ఉంటారు
విధాత: గర్భం (Pregnant Women) తో ఉన్నపుడు తల్లి ప్రశాంతంగా ఉంటే శిశువు ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే ఆ సమయంలో తల్లి శారీరిక, మానసిక ఆరోగ్య స్థితి శిశువు (Infant) పుట్టిన తర్వాత కూడా ప్రభావం చూపుతుందని కొందరి వాదన. దానిపై పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ వాదనను బలపరిచేలా ఒక అధ్యయనం ప్రచురితమైంది. గర్భంతో ఉన్నపుడు తల్లి కనుక ఒత్తిడి (Stress) , ఆందోళన (Anxiety) లకు గురైతే.. శిశువు పుట్టిన తర్వాత వారి ప్రవర్తన సమస్యాత్మకంగా మారే ప్రమాదముందని అందులో పరిశోధకులు పేర్కొన్నారు.
అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం (Study) ప్రకారం.. గర్భస్థ మహిళ ఆరోగ్య స్థితి ప్రభావం వారి పిల్లలకు 10 లేదా 15 ఏళ్లు వచ్చే వరకు ఉండొచ్చు. ఒకవేళ ఆమె ఆ సమయంలో ఒత్తిడి, ఆందోళనలకు గురైతే పిల్లల్లో చిరాకు, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ పరిశోధన కోసం వైద్యులు సుమారు 45000 మంది మహిళలపై చేసిన 55 అధ్యయనాలను క్రోడీకరించారు.
వీరిలో ఎవరెవరు గర్భంతో ఉన్న సమయంలో ఒత్తిడికి, ఆందోళనకు గురయ్యారో వర్గీకరించారు. వారి పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు. ప్రవర్తన ఎలా ఉందనే అంశాలను తెలుసుకుని నమోదు చేశారు. ఈ సమాచారాన్ని విశ్లేషించగా.. తల్లి ఆరోగ్యం కడుపులో ఉన్న బిడ్డపై ప్రభావం చూపడమే కాకుండా.. వారికి 10, 15 ఏళ్లు వచ్చే వరకు అది కొనసాగుతోందని తేలింది. ఈ దుష్ప్రభావం అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరిపై ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.
యుటెరోలో ఉన్న స్ట్రెస్ హార్మోన్‌లు.. శిశువుల్లో మెదడు అభివృద్ధిని అడ్డుకోవడమే దీనికి కారణంగా భావిస్తున్నామని వారు తెలిపారు. ఈ పరిశోధనను ముందుకు తీసుకెళ్లడం ద్వారా సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులు తల్లి ఆరోగ్యంపై తద్వారా శిశువు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో మరింతగా తెలుసుకుంటామని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఐరెనీ టంగ్ వెల్లడించారు. ‘ఇప్పటి వరకు చేసిన అధ్యయనంలో మధ్యతరగతి, విద్యావంతుల కుటుంబాలకు చెందిన మహిళలనే పరిశీలించాం.
అయితే వివక్ష, ఆర్థిక అసమానతలే కొందరి జీవితాల్లో ఒత్తిడికి కారణం. ఆ కుటుంబాలు ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటున్నాయి.. ఏ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నాయో త్వరలోనే తెలుసుకుంటాం’ అని టంగ్ పేర్కొన్నారు. ఏ ఆర్థిక స్థితిలో ఉన్న మహిళకైనా గర్భం ధరించిన సమయంలో మానసిక వైద్యం అవసరమని ఈ అధ్యయనం మరో సారి రుజువు చేసిందని ఆయన స్పష్టం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram