చైనాలోని లియుషెన్యూ బొగ్గుగనిలో పేలుడు ఘటన తీవ్ర విషాదానికి దారితీసింది. షాంగ్జీ ప్రావిన్స్‌లోని బొగ్గుగనిలో శుక్రవారం చోటుచేసుకున్న పేలుడు ధాటికి ఇప్పటి వరకు 82 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 9 మంది గల్లంతైనట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పేలుడు తర్వాత గని పాక్షికంగా కుప్పకూలింది. దీంతో మరికొందరు కార్మికులు చిక్కుకున్నట్లు చెబుతున్నారు. విపత్తు నివారణ, సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. క్షత గాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్యసేవలు అందించాలని, తక్షణమే ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. చైనా ప్రధాని లీ కియాంగ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
షాంగ్జీ ప్రావిన్స్‌లోని ఈ గని టాంగ్జో గ్రూపునకు చెందినది. రాత్రి 7.29 గంటల సమయంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించినట్టు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ప్రమాదసమయంలో అక్కడ 247 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. కార్బన్ మొనాక్సైడ్ భారీ పరిమాణంలో విడుదల కావడమే ఈ పేలుడుకు ప్రధాన కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ఇవి కూడా చదవండి :
ఆయనకే ఫ్యూచర్ లేదు…ఫ్యూచర్ సిటీని ఏం ఆపుతారు: హరీష్ రావుపై మంత్రి పొంగులేటి ఫైర్
సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ భర్త హత్య!
