అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలలో అస్థిరత కొనసాగుతుంది.బుధవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 1,44,230వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 1,08,170వద్ద నిలచింది. కిలో వెండి ధర సైతం రూ.100 పెరిగి రూ.2,40,100 వద్ద కొనసాగుతుంది.
పసిడి ధరలు పుంజుకునే ఛాన్స్..
పశ్చిమ ఆసియాలో అమెరికా-ఇరాన్ ల మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లను కుదిపేస్తున్నాయి.భౌగోళిక రాజకీయ సంక్షోభాలతో పాటు ద్రవ్యోల్బణ భయాలు కూడా పసిడి ర్యాలీకి బలాన్ని చేకూరుస్తున్నాయి. యుద్ధ భయాలతో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి పెరగడంతో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లు, ప్రమాదకర ఆస్తుల నుండి నిధులను ఉపసంహరించుకుని.. సంక్షోభ సమయాల్లో సురక్షితమైన ఆస్తిగా పరిగణించే పసిడి వైపు మళ్లిస్తున్నారు. పర్యవసానంగా, అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,050 డాలర్ల మార్కును అధిగమించి 4,100 డాలర్ల సమీపానికి వేగంగా వెళ్లింది.
పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో చమురు ధరలు ఆకస్మికంగా పెరగడం వల్ల గ్లోబల్ ద్రవ్యోల్బణం మళ్లీ తీవ్రమయ్యే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు అమెరికా డాలర్ ఇండెక్స్‌లో కనిపించిన సడలింపు, బాండ్ ఈల్డ్స్‌లోని హెచ్చుతగ్గులు బంగారం కొనుగోళ్లకు మరింత ప్రోత్సాహాన్నిచ్చాయి. రాబోయే రోజుల్లో 4,100 డాలర్ల స్థాయి పైన ధరలు స్థిరంగా కొనసాగితే.. పసిడి ధరలు మునుపటి ఆల్-టైమ్ గరిష్టాల వైపు పయనించవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.