insurgent attacks । పాక్‌లో 33 మంది ప్రయాణికులను కాల్చి చంపిన సాయుధులు.. 12 మంది ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్
పాకిస్తాన్‌లో సోమవారం చోటు చేసుకున్న వేర్వేరు ఉగ్రవాద దాడుల్లో 33 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇతర ఘటనల్లో 12 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి.

insurgent attacks । పాకిస్తాన్‌లో (Pakistan) దారుణం చోటు చేసుకున్నది. సోమవారం రెండు వేర్వేరు ఘటనల్లో 33 మందిని సాయుధులు విచక్షణారహితంగా కాల్చి చంపారు. వేర్వేరు ఘటనల్లో 12 మంది ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. కల్లోలిత బలూచిస్తాన్ ప్రాంతంలో (Balochistan province) ఈ దారుణాలు జరిగాయి. మొదటి ఘటనలో పంజాబ్ రాష్ట్రానికి (Punjab province) చెందిన సుమారు 23 మందిని బలూచిస్తాన్‌లోని ముసాఖేల్ జిల్లాలో (Musakhel district) కాల్చి చంపారు. వీరంతా ఒక బస్సులో ప్రయాణిస్తుండగా.. వారిని బస్సు నుంచి కిందకు దించి వారి గుర్తింపు పత్రాలు తనిఖీ చేసి మరీ కాల్చి చంపారు. ‘ప్రయాణికులను బస్సు నుంచి కిందకు దిగాల్సిందిగా ఆదేశించిన సాయుధులు.. వారి జాతీయ ఐడీ కార్డులను (national ID cards) చూసి, కాల్చి చంపారు’ అని సీనియర్ ఎస్పీ అయూబ్ ఖోసో చెప్పారు. మృతుల్లో అత్యధికులు దక్షిణ పంజాబ్‌కు చెందినవారని, మరికొందరు ఖైబర్ పఖ్తుంఖ్వాకు (Khyber Pakhtunkhwa) చెందినవారని ఆయన తెలిపారు. వారి జాతి నేపథ్యంలోనే వారిని కాల్చి చంపారని చెప్పారు.
మరో ఘటనలో నలుగురు పోలీసులు సహా సుమారు పది మందిని ఒక సాయుధుడు కాల్చి చంపాడు. బలూచిస్తాన్‌లోని ఖలాత్ జిల్లాలో (Qalat district) ఈ ఘోరం చోటు చేసుకున్నదని అధికారవర్గాలు తెలిపాయి. ఆగస్ట్ 24, 25 తేదీల మధ్యరాత్రి బలూచిస్తాన్‌లోని పలు చోట్ల ఉగ్రవాదులు దాడులకు తెగబడినట్టు భద్రతా వర్గాలు జియో న్యూస్‌కు తెలిపాయి. ముసాఖేల్ రహదారిపై 12 వాహనాలకు సాయుధుడు నిప్పు పెట్టినట్టు ఖోసో తెలిపారు.
ముసాఖేల్ ఘటనకు తామే పాల్పడినట్టు ఈ ప్రాంతంలో అత్యంత క్రియాశీలకంగా ఉండే బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) (The Baloch Liberation Army) ప్రకటించింది. పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Zardari), ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) ఈ ఘటనలను తీవ్రంగా ఖండించారని రేడియో పాకిస్తాన్ తెలిపింది. ఈ దారుణ ఘటనలో విలువైన ప్రాణాలు పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అమాయక ప్రజలపై దారుణ హత్యాకాండ మానవత్వంపై (humanity) జరిగిన హత్యలుగా జర్దారీ అభివర్ణించారు. ఇందుకు బాధ్యులను న్యాయం ముందు నిలబెట్టాలని పిలుపునిచ్చారు. మృతుల కుటుంబాలకు పూర్తి సహాయం అందించాలని స్థానిక అధికారులను ప్రధాన మంత్రి ఆదేశించారు. గాయపడినవారికి తగిన చికిత్స అందించాలని చెప్పారు. ఈ ఘటనపై సత్వరమే దర్యాప్తు చేయాలని కేంద్ర సంస్థలను ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన ఉగ్రవాదులను (terrorists) కఠినంగా శిక్షించి తీరుతామని ఆయన తేల్చి చెప్పారు. దేశంలో ఎలాంటి ఉగ్రవాదాలను అనుమతించే ప్రసక్తి లేదన్నారు.
ఇదిలా ఉండగా.. మరొక ఘటనలో బోలాన్‌లోని డోజాన్ ఏరియాలో ఒక రైల్వే బ్రిడ్జిని ఉగ్రవాదులు పేల్చివేశారు. బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్. అంతేకాదు అన్ని రాష్ట్రాల కంటే అధిక స్థాయిలో సహజ వనరులు ఉన్నా.. అభివృద్ధిలో మాత్రం బాగా వెనుకబడిపోయింది. బీఎల్‌ఏ (BLA), ఇతర బలూచ్ వేర్పాటువాదులు (Baloch separatists) ఈ ప్రాంతంలోని పంజాబీలు, సింధీలపై దాడులను తీవ్రతరం చేశారు. ఈ ప్రాంతానికి లాభాలను పంచకుండా మొత్తం దోచుకుపోతున్నారంటూ విదేశీ ఇంధన సంస్థలను సైతం ఉగ్రవాద సంస్థలు టార్గెట్ చేశాయి. గత ఏడాది బలూచిస్తాన్‌లో సుమారు 170 ఉగ్రదాడులు చోటుచేసుకోగా.. అందులో 151 మంది చనిపోయారని పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ పేర్కొంటున్నది.