మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌.. ఈసారి ఆమె ఏం తీసుకువెళుతున్నారంటే..

భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రొనాట్‌ కెప్టెన్‌ సునీతా విలియమ్స్‌ మరోసారి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. అంతరిక్షంలో సమోసాలు తినడం తనకు ఇష్టమని చెప్పే సునీత.. ఈసారి కొత్త స్పేస్‌క్రాఫ్ట్‌ బోయింగ్ స్టార్‌లైనర్‌లో అంతరిక్ష కేంద్రానికి చేరుకోన్నారు.

మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌.. ఈసారి ఆమె ఏం తీసుకువెళుతున్నారంటే..

న్యూయార్క్‌: భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రొనాట్‌ కెప్టెన్‌ సునీతా విలియమ్స్‌ మరోసారి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. అంతరిక్షంలో సమోసాలు తినడం తనకు ఇష్టమని చెప్పే సునీత.. ఈసారి కొత్త స్పేస్‌క్రాఫ్ట్‌ బోయింగ్ స్టార్‌లైనర్‌లో అంతరిక్ష కేంద్రానికి చేరుకోన్నారు. భారతీయ కాలమానం ప్రకారం 2024, మే 7వ తేదీన ఉదయం 8.04 గంటలకు కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి బోయింగ్‌ స్టార్‌లైనర్‌ లిఫ్ట్‌ఆఫ్‌ కానున్నది. కొత్త స్పేస్‌క్రాఫ్ట్‌లో వెళుతున్నందుకు కొంత కంగారుగా ఉన్నప్పటికీ.. భయం ఏమీ లేదని సునీత చెప్పారు. లాంచ్‌పాడ్‌ వద్ద శిక్షణ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు వెళ్లడం మళ్లీ ఇంటికి వెళుతున్నంత సంతోషంగా ఉన్నదని అన్నారు.

కొత్త స్పేస్‌క్రాఫ్ట్‌లో వెళుతున్న తొలి మహిళా ఆస్ట్రొనాట్‌

డాక్టర్‌ దీపక్‌ పాండ్యా, బొన్నీ పాండ్యాలకు జన్మించిన సునీతా విలియమ్స్‌ వయసు 59 ఏళ్లు. కొత్త స్పేస్‌క్రాఫ్ట్‌లో వెళుతున్న తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. క్వాలిఫైడ్‌ నేవీ టెస్ట్‌ పైలట్‌ అయిన సునీత.. ఇప్పటికే రెండు సార్లు.. 2006, 2012లో ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు వెళ్లినట్టు నాసా డాటా పేర్కొంటున్నది. ఆమె మొత్తంగా అంతరిక్షంలో 322 రోజులు గడిపారు. ఒకదశలో ఏడు స్పేస్‌వాక్స్‌తో అంతరిక్షంలో మొత్తం 50 గంటల 40 నిమిషాలు గడిపి.. ఆ ఘనత సాధించిన తొలి మహిళా ఆస్ట్రొనాట్‌గా రికార్డు నెలకొల్పారు. అయితే.. తదుపరి పెగ్గీ విట్సన్‌ 10 స్పేస్‌వాక్‌లు నిర్వహించి, ఆమె రికార్డును అధిగమించారు. సునీత తండ్రి న్యూరోఅనాటమిస్ట్‌. గుజరాత్‌లోని మెహసానా జిల్లా ఝుల్సాన్‌లో జన్మించారు. అయితే.. అమెరికాకు వలస వెళ్లిపోయి, సాల్లేనియాకు చెందిన బొన్నీని వివాహం చేసుకుని అక్కదే స్థిరపడిపోయారు.

సునీత వెంట గణేషుడి ప్రతిమ

విఘ్నేశ్వరుడు తనకు అదృష్టం కల్పిస్తాడని నమ్ముతానని, అందుకే తన వెంట గణేశుడి విగ్రహాన్ని తీసుకొని వెళుతున్నానని ఆమె మీడియాకు తెలిపారు. తాను మత విషయాలకంటే ఆధ్యాత్మిక అంశాలకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. అంతరక్షింలో గణేశుడు తన వెంట ఉండటం తనకు సంతోషాన్నిస్తుందని తెలిపారు. గతంలో ఆమె అంతరిక్ష కేంద్రానికి వెళ్లినప్పుడు తన వెంట భగవద్‌గీత పుస్తకాన్ని తీసుకొని వెళ్లారు. తనకు అంతరిక్షంలో సమోసాలు తినడం ఇష్టమని కూడా సునీత చెప్పారు.

కాగా.. తాను మారథాన్‌ రన్నర్‌నని, ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో కూడా మారథాన్‌ చేశానని తెలిపారు. సునీతతోపాటు 61ఏళ్ల ఆస్ట్రొనాట్‌ బర్రీ ఇయుజేన్‌ (బచ్‌) విల్మోర్‌ కూడా వెళ్లనున్నారు. ఈయన కూడా ఇప్పటికి రెండుసార్లు ఐఎస్‌ఎస్‌లో పనిచేశారు. వీరిద్దరూ ఐఎస్‌ఎస్‌లో వారంరోజులపాటు గడపనున్నారు. అనంతరం పారాచూట్‌, ఎయిర్‌బ్యాగ్‌ సహకారంతో క్రూక్యాప్సుల్‌ ద్వారా అమెరికాలోని నైరుతి ప్రాంతంలో భూమిపైకి దిగనున్నారు.

ఇస్రో శుభాకాంక్షలు

భారతదేశం కూడా గగన్‌యాన్‌ పేరిట తన మానవ సహిత అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నది. ఈ ప్రాజెక్ట్‌ హెడ్‌ డాక్టర్‌ ఎం మోహన్‌ ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ.. సునీత మరోసారి అంతరిక్ష కేంద్రానికి వెళ్లనుండటం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నదని చెప్పారు. ఈ యాత్రలో ఆమె మరో మైలురాయిని అధిగమించాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. గగన్‌యాన్‌ కోసం భారత్‌ నలుగురు పురుష గగన్‌యాత్రికులను ఎంపిక చేసింది. అంతా అనుకున్నట్టు సాగితే.. 2026లో శ్రీహరి కోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి బయల్దేరనున్నది.