సంజయ్ గాంధీ నుంచి అజిత్ పవార్ వరకు.. విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన నేతలు వీళ్లే..
సంజయ్ గాంధీ నుంచి అజిత్ పవార్ వరకు పలువురు భారత రాజకీయ నేతలు విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ విషాద ఘటనలపై ప్రత్యేక కథనం.
‘మహా’ రాజకీయాల్లో దిగ్ర్భాంతికర వాతావరణం నెలకొంది. కీలక నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఉదయం బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన మృతిపై దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తమవుతోంది. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలువురునేతలు అజిత్ పవార్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాద ఘటన గతంలో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పలువురు ప్రముఖులు ఇలాంటి విమాన ప్రమాదాల్లోనే (plane crashes) ప్రాణాలు కోల్పోయిన సంఘటనలను గుర్తుకు తెస్తోంది. అలా గగనతలంలో జరిగిన విషాదాల్లో ప్రాణాలు కోల్పోయిన నేతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
విజయ్ రూపానీ..
2025 జూన్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఎయిర్‌పోర్టు సమీపంలోని ఓ బిల్డింగ్‌పై కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సహా 240 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక విమానం బిల్డింగ్‌పై పడటంతో మరో 20 మంది మరణించారు. విజయ్ రూపానీ.. 2016 ఆగస్టు 7 నుంచి 2021 సెప్టెంబరు 12 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. గతేడాది తన కుటుంబ సభ్యులను కలిసేందుకు ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ విమానంలో లండన్ వెళ్తూ ప్రాణాలు కోల్పోయారు.
జీఎంసీ బాలయోగి మృతి
2002 మార్చి 3న లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జీఎంసీ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ కృష్ణా జిల్లాలో ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఆయన ప్రాణాలు విడిచారు.
నల్లమల అడవుల్లో వైఎస్సార్ మరణం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేత అయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy) కూడా గగనతలంలో జరిగిన ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారు. 2009 సెప్టెంబర్ 2న అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్ చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తుండగా నల్లమల అడవుల్లో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన మరణించారు. సుమారు 24 గంటల గాలింపు తర్వాత ఆయన మృతదేహాన్ని గుర్తించారు.
సంజయ్ గాంధీ..
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ (Sanjay Gandhi) కూడా విమాన ప్రమాదంలోనే మరణించారు. 1980లో ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్‌కు చెందిన విమానం నడుపుతూ ప్రమాదానికి గురయ్యారు. విమానంలో సంజయ్ గాంధీ ఏరోబాటిక్స్ చేస్తున్న క్రమంలో అది కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇదే తరహాలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా 2001లో ఉత్తరప్రదేశ్‌లో విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన గతంలో విమానయాన శాఖ మంత్రిగా సేవలందించారు.
అలాగే, 2011లో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు, 2005లో హర్యానా మంత్రి, పారిశ్రామికవేత్త ఓపీ జిందాల్ కూడా హెలికాప్టర్ ప్రమాదాల్లోనే కన్నుమూశారు. వీరే కాదు, పలువురు ప్రముఖులు కూడా విమాన ప్రమాదాల్లో మరణించారు. 2004లో ప్రముఖ సినీతార సౌందర్య, 2004లో మేఘాలయా మంత్రి సైప్రియన్ సంగ్మా, 2021లో భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సహా పలువురు గగనతలంలో ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి :
Rajgopal Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాంబు పేలుస్తా: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వార్నింగ్
Captain Shambhavi Pathak : అజిత్ పవార్ విమాన ప్రమాద మృతుల్లో యువ మహిళా పైలట్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram