హర్మూజ్‌ను మళ్లీ మూసేసిన ఇరాన్
హర్మూజ్ జలసంధిని ఒక్కరోజే తెరిచి మళ్లీ మూసేసిన ఇరాన్, అమెరికా దిగ్బంధనే కారణమని ఆరోపించింది. ఈ నిర్ణయంతో చమురు ధరలు, ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడనుంది.
అమెరికాపై ఆరోపణల మధ్య హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ మళ్లీ పరిమితులు విధించినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.
విధాత : హర్మూజ్ జలసంధిని తెరచి ఒక్కరోజైనా కాకముందే ఇరాన్ మళ్లీ మూసేసింది. హర్మూజ్ జలసంధిని మూసివేయడానికి అమెరికా ధోరణే కారణమని ఆరోపించింది. ఇరాన్ ఓడరేవుల చుట్టూ అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మిలిటరీ కమాండ్ పేర్కొంది. హర్మూజ్ జలసంధిపై మా నియంత్రణ గతంలో మాదిరిగా కొనసాగుతుందని, ప్రస్తుతం మా సాయుధ దళాల నియంత్రణలో జలసంధి ఉంది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం అమల్లో ఉన్నంతకాలం.. జలసంధి మార్గంలో రాకపోకలను అడ్డుకుంటాం అని ఇరాన్ సంయుక్త మిలిటరీ కమాండ్ హెచ్చరించింది. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునే వరకు హర్మూజ్‌లో దిగ్బంధనం కొనసాగుతుందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో ఇరాన్ మళ్లీ హర్మూజ్ మూసివేతకు నిర్ణయించింది.
ఒక్కరోజుకే పరిమితమైన జలసంధి తెరిచివేత
అంతకుముందు రోజు జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. లెబనాన్‌లో కాల్పుల విరమణ అమలవుతున్నందున.. హర్మూజ్‌ను పూర్తిగా తెరుస్తున్నాం. కాల్పుల విరమణ గడువు ముగిసేదాకా ఈ జలసంధిలో వాణిజ్య నౌకలన్నీ ప్రయాణించొచ్చు అని పేర్కొంది. అయితే ఇరాన్ ఓడరేవులు-సముద్రరవాణా సంస్థ ఇప్పటికే ప్రకటించిన మార్గంలో మాత్రమే అవి ప్రయాణించాలని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీగ్చీ స్పష్టం చేశారు. హర్మూజ్ మార్గం తెరవడంతో వాణిజ్య నౌకల రాకపోకలకు అడ్డంకులు తొలగిపోయాయి. హర్మూజ్ పూర్తిగా తిరిగి తెరుచుకోవడంతో చమురు ధరలు ఒక్కరోజే దాదాపు 11% తగ్గాయి. చమురు కొరతను ఎదుర్కోంటున్న దేశాలతో పాటు ఇరాన్ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్వాగతించారు. అయితే, జలసంధి పూర్తిగా తెరిచినా ఇరాన్ నౌకలపై తమ దిగ్బంధనం కొనసాగుతోందని ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. మా ఓడరేవుల దిగ్బంధనం కొనసాగితే.. హర్మూజ్‌ను మళ్లీ మూసేస్తామని హెచ్చరించి..అన్నంత పనిచేసింది. అయితే దేశంలోని పలు ఎయిర్‌పోర్టులను తిరిగి తెరవడంతోపాటు తమ గగనతలాన్ని పాక్షికంగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తూర్పు మార్గంలో అంతర్జాతీయ విమానాలు ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్లు సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.
ఇరాన్ నిర్ణయంతో చర్చలపై సందిగ్థత
అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి దౌత్య చర్చల కోసం ప్రయత్నాలు సాగుతున్న హర్మూజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేయంతో చర్చల భవితవ్యంపై గందరగోళం నెలకొంది. అమెరికా- ఇరాన్ మధ్య ఏప్రిల్ 20న మరోసారి చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై మళ్లీ బాంబులు పడతాయ్ అంటూ ట్రంప్ హెచ్చరికలు చేశారు. బుధవారంలోగా ఒప్పందం చేసుకోవాలన్నారు.
ట్రంప్ పై ఇరాన్ సెటైర్లు
అంతకుముందు హర్మూజ్‌ను శాశ్వతంగా తెరిచి ఉంచేందుకు టెహ్రాన్ అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచానికి ఇదో గొప్ప రోజుగా అభివర్ణించారు. దీనిపై జింబాబ్వేలోని ఇరాన్ రాయబార కార్యాలయం స్పందిస్తూ.. ట్రంప్‌పై సెటైర్లు వేసింది. ‘మీరు మరీ సంతోషంగా ఉన్నట్లు చూపించుకోకండి. హుందాగా ఉండండి’ అంటూ ఎక్స్ పోస్టులో పేర్కొంది. హర్మూజ్ జలసంధి, ఇరాన్‌లో పాలన మార్పు అనే ఊహలను ఇకపై వదులుకోవాలని సూచించింది. తమ సమస్యలన్నింటినీ తామే పరిష్కరించుకుంటామని స్పష్టం చేసింది. ఫోన్ ఆఫ్ చేసి విశ్రాంతి తీసుకోవాలని, బీబీ(ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు)ని వారం రోజులు బ్లాక్ చేయాలని పేర్కొంది. తేలికైన భోజనం తిని.. హాయిగా నిద్రపోవాలని సూచించింది.
ఇవి కూడా చదవండి :
మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవడం ద్రోహం : సీఎం చంద్రబాబు
2026లో ఆపిల్ దూకుడు మామూలుగా లేదుగా : 15కు పైగా కొత్త ఉత్పత్తులు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram